Abn logo
Feb 23 2021 @ 21:42PM

మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేసిన ప్రియాంక గాంధీ.. కారణం ఇదే!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో రైతుల సమావేశంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఇదే సభకు ఓ అత్యాచార బాధితురాలి తల్లి కూడా హాజరైంది. ప్రియాంక మాట్లాడుతున్న సమయంలో తనకు న్యాయం కావాలంటూ నినదించింది. దీంతో ప్రియాంక తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. బాధిత మహిళ కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి. అక్కడి భరత్‌పూ‌ర్‌లో ఆమె కుమార్తె అత్యాచారానికి గురైంది. అది ఉత్తరప్రదేశ్‌కు సరిహద్దు గ్రామం. మథురలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్న మహిళ ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కాంగ్రెస్ ర్యాలీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 


తాజాగా, రైతుల సమావేశంలో ప్రియాంక మాట్లాడుతున్న సమయంలో ఆమె తనకు న్యాయం జరిపించాలంటూ పెద్దగా నినాదాలు చేసింది. వెంటనే ప్రసంగాన్ని ఆపేసిన ప్రియాంక, ఆమెను తన వద్దకు పిలిచి ఆరా తీశారు. ఆ వెంటనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి సత్వరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

Advertisement
Advertisement
Advertisement