మాయావతిని నిలదీసిన ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2020-10-30T00:33:11+05:30 IST

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

మాయావతిని నిలదీసిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గట్టిగా నిలదీశారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీజేపీకైనా ఓటు వేస్తామని మాయావతి చెప్పిన నేపథ్యంలో ప్రియాంక ఘాటుగా స్పందించారు. చెప్పవలసినది ఇంకా ఏమైనా ఉందా? అని అడిగారు. 


ఉత్తర ప్రదేశ్‌లో ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు, సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మాయావతి ఓ ప్రకటనలో, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు తమ పార్టీ ఏ అవకాశాన్నీ వదులుకోదని చెప్పారు. బీజేపీ లేదా మరొక పార్టీ అభ్యర్థులకు ఓటు వేయడానికైనా వెనుకాడబోమని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి వెనుక రెండో స్థానంలో ఉన్నవారికి బీఎస్‌పీ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. 


ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వాద్రా ఇచ్చిన ట్వీట్‌లో, దీని తర్వాత చెప్పడానికి ఇంకా ఏమైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించారు. 


బుధవారం ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కలిసినట్లు వార్తలు రావడంతో మాయావతి తీవ్ర ఆగ్రహంతో ఈ ప్రకటన చేశారు.


Updated Date - 2020-10-30T00:33:11+05:30 IST