Abn logo
Oct 17 2020 @ 21:06PM

సీసీబీ విచారణకు గైర్హాజరైన వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక

Kaakateeya

బెంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో సమన్లు అందుకున్న వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక ఆళ్వా సీసీబీ విచారణకు హాజరు కాలేదు. ప్రియాంక ఆళ్వా సోదరుడు ఆదిత్య ఆళ్వాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు తేలడం, అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రియాంకను విచారించాలని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావించారు. ఆదిత్య ఆళ్వా కోసం వివేక్ ఒబెరాయ్ ఇంట్లో ఇప్పటికే సోదాలు చేసిన సీసీబీ పోలీసులు, ప్రియాంకకు శుక్రవారం నాడు విచారణకు హాజరుకావాలని గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించని ప్రియాంక.. విచారణకు కూడా హాజరుకాలేదు. ఆమెకు మరోసారి నోటీసులు పంపుతామని సీసీబీ అధికారులు స్పష్టం చేశారు.

ఆదిత్య ఆళ్వా ముంబైలోనే ఉన్నట్లు తాము భావిస్తున్నామని, అందువల్ల అతని బంధువులను కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. దాదాపు నెల రోజుల నుంచి ఆదిత్య ఆళ్వా ఆచూకీ కోసం బెంగళూరు పోలీసులు వెతుకులాట సాగిస్తున్నారు. శాండల్‌వుడ్ డ్రగ్స్ మాఫియాకు సంబంధించి శివకుమార్, ఆదిత్య ఆళ్వా మినహా మిగిలిన వారంతా పట్టుబడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారందరితోనూ వీరికి సంబంధాలు ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆదిత్య ఆళ్వాకు చెందిన ‘హౌస్ ఆఫ్ లైఫ్’ రిసార్ట్‌లో పలు పార్టీలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదిత్య ఆళ్వాపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.

Advertisement
Advertisement
Advertisement