Jul 22 2021 @ 19:34PM

Priyamani: మేం అన్యోన్యంగా ఉన్నాం

నటి ప్రియమణి, ముస్తఫారాజ్‌ వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య అయేషా కొద్దిరోజులుగా వాదిస్తోన్న సంగతి తెలిసిందే. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. తనతో విడాకులు తీసుకోలేదని ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్తఫా రాజ్‌, ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లకు పలు కారణాలతో విడిపోయారు.  పిల్లల బాధ్యతను ముస్తఫా చూసుకుంటున్నారు. 2017లో హీరోయిన్‌ ప్రియమణిని వివాహం చేసుకున్నారు. తాజాగా తన వివాహంపై వస్తున్న రూమర్లను ఖండించారు ప్రియమణి. ‘‘మాది చట్ట విరుద్ధ సంబంధం కాదు. మా బంఽధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. నేను సెక్యూర్‌ జోన్‌లో ఉన్నా. ముస్తఫా భర్తగా దొరకడం నా అదృష్టం. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. రోజూ ఇద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటాం’’ అని చెప్పారు. ‘‘ఎక్కడ ఉన్నా కమ్యూనికేషన్‌ చాలా ముఖ్యం. మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. బిజీగా ఉండి మాట్లాడుకోకపోతే.. కనీసం హాయ్‌, బాయ్‌ అయినా చెప్పుకుంటాం. ఆయన ఖాళీగా ఉంటే నాతో మెసేజ్‌లు చేస్తుంటాడు. షూటింగ్స్‌ లేకుండా ఖాళీగా ఉంటే నేనే ఆయనకు కాల్‌ చేస్తా. కొంతమంది మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు’’ అని ఆమె తెలిపారు.