2 పీఎస్‌బీల ప్రైవేటీకరణ పక్కా!

ABN , First Publish Date - 2022-05-26T10:03:06+05:30 IST

రెండు ప్రభుత్వ

2 పీఎస్‌బీల ప్రైవేటీకరణ పక్కా!

న్యూఢిల్లీ : రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇదే పనిలో ఉందని అధికార వర్గాలు చెప్పాయి. నిజానికి గత ఆర్థిక సంవత్సరమే రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో ఈ ప్రతిపాదన మూలన పడినట్టేనని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికార వర్గాలు ఈ విషయం చెప్పడం విశేషం. నీతి ఆయోగ్‌ ఇప్పటికే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్లను ఇందుకోసం సూచించినట్టు  సమాచారం. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉన్న ఈ విషయం త్వరలోనే కేంద్ర క్యాబినెట్‌ ముందుకు రానుంది. 

బీపీసీఎల్‌నీ అమ్మేస్తాం 

మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌  (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ కూడా ఆగదని అధికార వర్గాలు చెప్పాయి. ఈ సంస్థ కొనుగోలుకు ముందుకు వచ్చిన మూడు సంస్థల్లో రెండు సంస్థలు బిడ్డింగ్‌ నుంచి తప్పుకున్నాయి. దీంతో త్వరలో మళ్లీ కొత్తగా బీపీసీఎల్‌ అమ్మకానికి బిడ్స్‌ ఆహ్వానించబోతున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. కొన్ని సమస్యల పరిష్కారం తర్వాత కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) అమ్మకానికి చర్యలు చేపడతామని అధికార వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2022-05-26T10:03:06+05:30 IST