ఈ ఏడాదిలోనే... ప్రై‘వేటు’...

ABN , First Publish Date - 2021-08-11T22:11:26+05:30 IST

ఎయిరిండియా, బీపీసీఎల్ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగాన్ని పుంజుకుంది.

ఈ ఏడాదిలోనే... ప్రై‘వేటు’...

న్యూఢిల్లీ: ఎయిరిండియా, బీపీసీఎల్ సంస్థల  ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగాన్ని పుంజుకుంది. వాటిని... ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు విక్రయించే విషయంలో... గడువు పెట్టుకుని మరీ కేంద్ర దూసుకెళుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 తో ముగియనున్న ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలోనే ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ను తప్పనిసరిగా ప్రైవేటీకరిస్తామని పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే స్పష్టం చేశారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌‌లను కూడా దాదాపుగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించనున్నట్లుగా పేర్కొన్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌‌లను విక్రయించడానికి అవసరమైన బిడ్డింగుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఆశించిన స్థాయిలోనే ప్రైవేటు సంస్థలు తమ బిడ్లను దాఖలు చేసినట్లు చెప్పారు. 


ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ)లో పెట్టుబడుల ఉపసంహరణ పనులను వేగవంతం చేశామని తుహిర్ కాంత్ పాండే పేర్కొన్నారు. ఇందులో పెట్టుబడులను వ్యూహాత్మకంగా ఉపసంహరిచుకుంటున్నామని తెలిపారు. దీనికోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్ నియామకం ప్రక్రియను చేపట్టామని తెలిపారు. కంటెయినర్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ విషయంలో... ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డింగ్స్ దాఖలు కావాల్సి ఉందని, ల్యాండ్ లీజ్ విధానాలు ఖరారైన వెంటనే దీనిపై ముందుకెళ్ళాల్సి ఉందని పేర్కొన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జాతీయ రహదారులకు సంబంధించి... రూ. 6 లక్షల కోట్ల విలువైన ఆస్తుల మోనిటైజేషన్ ప్రణాళికను  రూపొందించాల్సి ఉందని తుహిర్ కాంత్ తెలిపారు. ఇక... పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కింద... ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను ఆధునికీకరించడానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను చేపట్టామని చెప్పారు. ఇదే తరహా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ప్రోగ్రామ్ విమానాశ్రయాల ఆధునికీకరణ విషయంలో విజయవంతమైదని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలోనే ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ల ప్రైవేటీకరణ వందశాతం పూర్తి చేయడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు  ఎప్పటికప్పుడు అందిస్తున్నామని వెల్లడించారు. 


Updated Date - 2021-08-11T22:11:26+05:30 IST