ప్రైవేట్ స్కూళ్ళకు మద్రాస్ హైకోర్టు ఝలక్

ABN , First Publish Date - 2021-08-07T23:47:45+05:30 IST

విద్యార్థులు బాకీ పడిన ఫీజులను చెల్లించాలని పట్టుబట్టకుండా, దరఖాస్తు

ప్రైవేట్ స్కూళ్ళకు మద్రాస్ హైకోర్టు ఝలక్

చెన్నై : విద్యార్థులు బాకీ పడిన ఫీజులను చెల్లించాలని పట్టుబట్టకుండా, దరఖాస్తు చేసిన వారం రోజుల్లోగా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లను జారీ చేయాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. యునైటెడ్ డిస్ట్రిక్ట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కూల్స్ అసోసియేషన్ పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది. 


250కి పైగా పాఠశాలలతో కూడిన ఈ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌లో, విద్యార్థులు చదివిన పాఠశాల నుంచి టీసీని పొందకుండా కానీ, టీసీ కోసం దరఖాస్తు చేయకుండా కానీ వేరొక పాఠశాలలో ప్రవేశం పొందడానికి విద్యా శాఖ అధికారులు అనుమతి ఇవ్వడాన్ని నిరోధించాలని కోరింది. 


దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వాదనలో, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు తాము చదివిన పాఠశాల నుంచి వేరొక పాఠశాలకు మారాలనుకుంటే, టీసీ లేకపోవడం వల్ల వారి చదువు అర్ధాంతరంగా ఆగిపోకూడదని కోరుకున్నట్లు తెలిపింది. 


జస్టిస్ ఆనంద్ వెంకటేష్ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో, విద్యార్థి ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకు మారాలంటే నిబంధనలు వర్తిస్తాయనేది నిజమేనని తెలిపింది. అయితే ఏదైనా అసాధారణ పరిస్థితి తలెత్తినపుడు విద్యార్థుల సర్వతోముఖ ప్రయోజనాల కోసం విధాన నిర్ణయాలను తీసుకోవడానికి, వ్యవహారాలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త చేయూత ఇవ్వాలని తెలిపింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కోర్టు వేలు పెట్టకూడదని తెలిపింది. అటువంటి జోక్యం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని పేర్కొంది. ప్రభుత్వం తన నిర్ణయాలను స్వేచ్ఛగా అమలు చేయడాన్ని నిరోధిస్తుందని పేర్కొంది. 


ఒక పాఠశాలలో చదివిన విద్యార్థి లేదా తల్లిదండ్రులు తదుపరి చదువును వేరొక పాఠశాలలో కొనసాగించాలని నిర్ణయించుకుంటే, వారు చదివిన పాఠశాలకు దరఖాస్తు చేసి, టీసీ మంజూరు చేయాలని కోరవచ్చునని తెలిపింది. ఈ దరఖాస్తును స్వీకరించిననాటి నుంచి వారం రోజుల్లోగా టీసీని ఆ పాఠశాల జారీ చేయాలని తెలిపింది. ఈ విధంగా టీసీని జారీ చేయడానికి తిరస్కరించినట్లయితే, సంబంధిత పాఠశాలపై చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పాఠశాలలపై చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌ తక్షణమే చర్య తీసుకోవాలని తెలిపింది.


ఈ తీర్పు నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రెండు వారాల్లోగా సర్క్యులర్ జారీ చేయాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది.


Updated Date - 2021-08-07T23:47:45+05:30 IST