ప్రైవేటు బడి.. బాట

ABN , First Publish Date - 2022-08-19T06:00:48+05:30 IST

ప్రభుత్వ నూతన విద్యా విధానంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది.

ప్రైవేటు బడి.. బాట

నూతన విద్యా విధానంతో విద్యార్థుల వలస

ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా తగ్గిన అడ్మిషన్లు

27 వేల విద్యా కానుకలు, భోజన నిధులు మిగులు 

నరసరావుపేట, ఆగస్టు 18: ప్రభుత్వ నూతన విద్యా విధానంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది.  ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రైవేట్‌ స్కూల్స్‌కు వరంలా మారింది. పాఠశాలల విలీనం, పది పరీక్షల్లో పెద్దసంఖ్యలో విద్యార్థుల ఫెయిల్‌  తదితర కారణాలతో పలువురు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఈ ఏడాది ఇలా దూరమైన వారితో పాటు నూతన ప్రవేశాల పొందేవారు కూడా ప్రైవేట్‌ పాఠశాలల బాట పట్టారు. ఈ ఏడాది ఎటువంటి ప్రచారం చేయకుండానే ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు భారీగా చేరారు. దాదాపు అన్ని పాఠశాలలు హౌస్‌ ఫుల్‌ బోర్డులు తగిలించాయి. గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2.12 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు విద్యా కానుక కిట్లకు పంపిణీ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. అయితే ఈ విద్యా సంవత్సరం ఆరంభం నాటికి విద్యార్థుల సంఖ్య 1.85 లక్షలకు తగ్గింది. అంటే మిగిలిన 27 వేల మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు వలస వెళ్లినట్లు విద్యా శాఖ తేల్చింది. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటులో బోధన మెరుగ్గా ఉంటుందన్న భావన, విలీనంతో గందరగోళ పరిస్థతులతోనే తల్లిండ్రులు ప్రైవేట్‌ స్కూల్స్‌లో పిల్లలను చేర్పించారని సమాచారం. 

జిల్లాలో 165 పాఠశాలలు విలీనం

జిల్లాలో దాదాపు 165 పాఠశాలలను విలీనం చేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. పాఠశాలల విలీనం, సెక్షన్ల కుదింపుతో ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గనున్నది. రానున్న రోజుల్లో ఉపాధ్యాయులను నియమించకుండానే ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారనేది అంచనా. ఈ విధానాలే కొనసాగితే భవిష్యత్‌లో ఉపాధ్యాయ నియమాకాలు ఉండే పరిస్థితి లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పథకం ప్రకారం ప్రభుత్వ విద్యా వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేస్తే విధానాలను కొనసాగిస్తున్నారని విద్యా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. 

ప్రభుత్వానికి నిధుల ఆదా..

విద్యారంగంపై ఖర్చు తగ్గించుకునే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూతన విద్యా విధానాల కారణంగా ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 27 వేల విద్యార్థులు తగ్గారు. అంటే ఆ పరంగా వారికి ఇవ్వాల్సిన విద్యా కానుక కిట్లు మిగిలిపోనున్నాయి. మధ్యాహ్న భోజన పథకం చేసే విద్యార్థుల సంఖ్య కూడా ఆ మేరకు తగ్గింది. ఇలా విద్యా కానుక కిట్లు, భోజన పథకం ద్వారా ప్రభుత్వానికి ఒక్క పల్నాడు జిల్లా నుంచి రూ.కోట్లలో నిధులు ఆదా అవుతున్నాయి. ఇక ఉపాధ్యాయ నియామకాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వానికి ఆ మేరకు నిధులు వ్యయం తగ్గుతుంది.   


Updated Date - 2022-08-19T06:00:48+05:30 IST