భారత్‌లోనూ ప్రైవేటు రాకెట్‌!

ABN , First Publish Date - 2020-06-29T08:06:18+05:30 IST

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఇద్దరు వ్యోమగాములను పంపడానికి.. ప్రైవేటు సంస్థ అయిన ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థ సేవలను అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా వినియోగించుకుంది. అదే బాటలో నడిచేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా సిద్ధమైంది...

భారత్‌లోనూ ప్రైవేటు రాకెట్‌!

  • నాసా బాటలో పయనిస్తున్న ఇస్రో
  • ఇన్‌స్పేస్ పేరిట కొత్త ఒరవడికి శ్రీకారం
  • మార్పు తప్పనిసరి.. నిపుణుల మనోగతం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఇద్దరు వ్యోమగాములను పంపడానికి.. ప్రైవేటు సంస్థ అయిన ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థ సేవలను అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా వినియోగించుకుంది. అదే బాటలో నడిచేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా సిద్ధమైంది. విదేశీ ఉపగ్రహ ప్రయోగాలను వాణిజ్యస్థాయిలో చేసి అమితంగా ఆర్జిస్తున్న ఘనచరిత్ర మన ఇస్రోది. అయితే అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌ విలువ 12,700 కోట్ల డాలర్లు ఉంటే.. దాంట్లో మనకు దక్కేది అతి తక్కువ. అందుకే మన మార్కెట్‌ను పెంచుకోవడానికి, రోదసిలో మన విజయపరంపరను కొనసాగించడానికి మోదీ సర్కారు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌స్పే్‌స)’ను ఏర్పాటు చేసింది. భారతీయ అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో ప్రైవేట్‌ సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇన్‌స్పే్‌స వల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 


ఇస్రోను స్థాపించి 50 ఏళ్లు దాటింది. ఈ ఐదు దశబ్దాలలో అంతరిక్ష రంగంలో మనం అనేక విజయాలు సాధించగలిగాం. పీఎ్‌సఎల్‌ వీ, జీఎ్‌సఎల్‌వీ రాకెట్ల ద్వా రా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగాం.. అంగారక యాత్ర (మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌) చేపట్టాం. చంద్రుడిపై నీరు ఉందా? లేదా అనే విషయంపై పరిశోధనలు చేయగలిగాం.. తాజాగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి శిక్షణ కూడా ప్రారంభమైంది. అయితే, ఒకసారి ఈ నైపుణ్యాలను సాధించిన తర్వాత మరింత లాభదాయకమైన కార్యక్రమాలను చేపట్టాలని.. లేకపోతే, అంతరిక్ష రంగంలో  వచ్చే మార్పులను తట్టుకొని నిలబడలేమని ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ అంటారు. ఈ నేపథ్యంలోనే.. ప్రభుత్వం ‘ఇన్‌స్పే్‌స’కు శ్రీకారం చుట్టింది.


ఇంతింతై..

ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలన్నింటినీ ప్రభుత్వాల అధీనంలో ఉన్న సంస్థలే చేసేవి. ఆ తర్వాత నాసా, యూరప్‌ స్పేస్‌ ఏజన్సీ వంటివి ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచాయి. ఈ ఒరవడి వడివడిగా సాగి ప్రస్తుతం ప్రైవేట్‌ సంస్థలు కూడా అంతరిక్షంలోకి మానవులను పంపే స్థాయికి చేరుకున్నాయి. టెస్లా అధినేత ఈలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజో్‌సకు చెందిన బ్లూ ఆరిజన్‌ మొదలైన సంస్థలు అంతరిక్షంలోకి రాకెట్లను పంపి సత్తా చాటాయి. దీంతో రోదసిలో భవిష్యత్తు ప్రైవేట్‌ సంస్థలదేననే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఇస్రో వేసిన తొలి అడుగే ఇన్‌ స్పేస్‌ అని చెప్పుకోవాలి. ఈ మేరకు మంగళవారం కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంలో మూడు ముఖ్యమైన అంశాలున్నాయి. వాటిలో మొదటిది- రాకెట్లు, ఉపగ్రహాలను తయారుచేసి వాటిని పంపటానికి ప్రైవేట్‌ సంస్థలకు అనుమతి ఇవ్వడం.


రెండోది- భవిష్యత్‌ తరాలకు అవసరమైన అంతరిక్ష పరిశోధలనపై ఇస్రో దృష్టి కేంద్రీకరించేలా నిర్ణయించడం. ప్రస్తుతం ఇస్రోకు ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రైవేట్‌ సంస్థలు ఉపయోగించుకోవటానికి అనుమతులు ఇవ్వడం. ‘‘ఇప్పటి దాకా ఇస్రోతో అనేక ప్రైవేట్‌ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. రాకెట్లకు, ఉపగ్రహాలకు అవసరమైన వ్యవస్థలను రూపొందించి ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సంస్థలకు రాకెట్లను తయారుచేసి, వాటిని ప్రయోగించుకోగల అవకాశం ఉంటుంది. అన్ని యాజమాన్య హక్కులూ వారికే ఉంటాయి. ప్ర పంచంలో వస్తున్న మార్పులకు తగినట్లుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..’’ అని ఇస్రో ఛైర్మన్‌ సంతోష్‌ శివన్‌ పేర్కొన్నారు.


పదిహేను రెట్ల ఆదాయం

ఇస్రో సేవలను అంతర్జాతీయ కంపెనీలకు అందించటానికి ప్రభుత్వం యాంత్రిక్స్‌  విభాగాన్ని ఏర్పాటు చేసింది. యాంత్రిక్స్‌కు 2016-19 మధ్య దాదాపు రూ.6268 కోట్ల  ఆదాయం వచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఈ ఆదాయం వచ్చే ఐదేళ్లలో కనీసం 15 రెట్లు పెరుగుతుందని ఒక అంచనా.


ఎవరికెంత ప్రయోజనం?

ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇటు ఇస్రోకు.. అటు ప్రైవేట్‌ సంస్థలకు కూడా లాభం చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ఇతర దేశాలతో పోలిస్తే మనం తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను ప్రయోగించగలం. ఇది మనకున్న బలం. ఇప్పటి దాకా వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తోంది. అయితే ఇస్రో చేజిక్కించుకున్న మార్కెట్‌ తక్కువ. ప్రైవేట్‌ రంగానికి కూడా అనుమతి ఇస్తే అనేక కంపెనీలు తమ ఉపగ్రహాలను ఇక్కడి నుంచి ప్రయోగిస్తాయి. అంతే కాకుండా ఒక ప్రైవేట్‌ సంస్థ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే దాంట్లో అందుబాటులో ఉండే బ్యాండ్‌విడ్త్‌ను ఆ సంస్థే విక్రయించుకుంటుంది. అంటే మార్కెట్‌లో ఉండే డిమాండ్‌, సప్లైల ఆధారంగా ఈ ధరలు ఉంటాయి.. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక కీలకమైన ఘట్టం’’ అని ‘ఎల్‌ అండ్‌ టి’కి చెందిన ‘డిఫెన్స్‌ అండ్‌ స్మార్ట్‌ టెక్నాలజీస్‌’ విభాగాధిపతి జయంత్‌ పటేల్‌ వివరించారు. ఈ నిర్ణయం వల్ల ఇస్రో శక్తి సామర్థ్యాలు మరింతగా పెరుగుతాయంటారు శాట్‌సెర్చ్‌ వ్యవస్థాపకుడు నారాయణ ప్రసాద్‌. ‘‘ఇస్రో పనితీరులో తేడా ఉండదు. వారి లక్ష్యాలలోనే తేడా వస్తుంది. ఒకప్పుడు వారికి అవసరమైన ఉప వ్యవస్థలను కంపెనీలు తయారుచేసి ఇచ్చేవి. ఇప్పుడు ఇస్రో మౌలిక సదుపాయాలను వాడుకొని, డిజైన్‌ నుంచి వ్యవస్థల ఉత్పత్తి దాకా ప్రైవేట్‌ సంస్థలు తయారుచేస్తాయి. దీని వల్ల ఇస్రోకు శ్రమ తప్పుతుంది. వారు మానవ సహిత అంతరిక్ష యాత్రల వంటి కీలకమైన పరిశోధనలపై దృష్టి పెట్టడానికి వీలుంటుంది. ఇస్రో మౌలిక సదుపాయాలు వాడుకున్నందుకు వారికి ప్రైవేట్‌ సంస్థలు ఎలాగూ సొమ్ము చెల్లిస్తాయి. ఈ నిర్ణయం వల్ల ఇస్రో సామర్థ్యం మరింతగా పెరుగుతుంది’’ అంటారాయన. అయితే ప్రభుత్వం నిర్ణయించే విధివిధానాలపైనే ఇన్‌స్పే్‌స విజయం ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.


- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-29T08:06:18+05:30 IST