ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు మోజు!

ABN , First Publish Date - 2022-07-02T06:17:48+05:30 IST

జిల్లాలో రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన డాక్టర్లు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నారు. విధులను విస్మరిస్తూ ప్రైవేటు వైద్యం వైపు మోజు చూపుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు మోజు!

విధులను విస్మరిస్తున్న ప్రభుత్వ వైద్యులు

ప్రైవేటు ప్రాక్టీస్‌కే ప్రాధాన్యం

ప్యాకేజీ పద్ధతుల్లో ప్రసవాలు

బయోవేస్టేజీ తరలింపులో జాప్యం

ఆసుపత్రులను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందం

బయటపడుతున్న సర్కారు వైద్యుల పనితీరు

నిజామాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన డాక్టర్లు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నారు. విధులను విస్మరిస్తూ ప్రైవేటు వైద్యం వైపు మోజు చూపుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సర్కారు వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించకపోగా.. సరిపడా సిబ్బంది లేరు. శిక్షణ పొందిన నర్సింగ్‌ స్టాఫ్‌ సరిపడా లేకుండానే కొంతమందిని తాత్కాలిక శిక్షణ ఇచ్చి నియమించుకుంటున్నారు. వారి ద్వారానే వైద్య సేవలు అందిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో బయో వేస్టేజీని బయటేపారవేస్తున్నారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించడం లేదు. రోగులకు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. స్పెషలిస్టు డాక్టర్లను తీసుకువచ్చి వైద్యసేవలందిస్తున్న ఆసుపత్రుల యజమాన్యం డ్యూటీ డాక్టర్ల ద్వారానే ఇతర వైద్య సేవలను సైతం నిర్వర్తిస్తున్నారు. బిల్లులు మాత్రం స్పెషలిస్టు పేరుతో దండిగా వసూలు చేస్తున్నారు. 

ఫ ఐదు రోజులుగా తనిఖీలు..

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో గడిచిన ఐదు రోజులుగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి నియమించిన ఎనిమిది బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ప్రసవాలు జరిగే అన్ని ఆసుపత్రులను పరిశీలిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఆసుపత్రులు నడుస్తున్నాయా? అనే విషయాలను బృందం సభ్యులు పరిశీలిస్తున్నారు. వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ బృందసభ్యులు తనిఖీలు జరిగే సమయంలో కొన్ని ఏర్పాట్లు చేసిన ప్రైవేట్‌ ఆసుపత్రుల లోపాలు బయటపడుతున్నాయి. బృందసభ్యులు తనిఖీలు చేసిన వాటిలో మెజారిటీ జిల్లాలోనే ప్రభుత్వ సర్వీసు ఉన్న వైద్యులు నడిపిస్తున్నవే కావటం గమనార్హం. ఆసుపత్రులు వారిపేరుమీద లేకుండా వారి బంధువులు, ఇతరుల పేరుతో కొనసాగిస్తున్నారు. వారు సాయంత్రం సమయంలో వచ్చి సేవలందిస్తున్నట్లు చూపెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ టైంలో మాత్రం ఒకట్రెండు గంటలు మాత్రమే ఉంటూ మిగతా సమయాల్లో వారి వారి సొంత ఆసుపత్రుల్లోనే సేవలందిస్తున్నట్లు బృందం సభ్యులు గమనించారు. కొన్ని ఆసుపత్రుల్లో గైనకాలజీ వైద్యులున్నా, మిగతా ఆసుపత్రుల్లో వారిని తీసుకువచ్చి ప్రసవాలు చేయిస్తున్నారు. మత్తు, ఇతర వైద్యులను కూడా ఆపరేషన్‌ సమయంలో తీసుకువస్తున్నారు. ప్రతీ ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్‌తోపాటు జీఎన్‌ఎం చేసిన నర్సులుండాలి. కానీ చాలా ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్‌ చేసిన స్టాఫ్‌ నర్సులు లేరు. జీఎన్‌ఎం చేసిన వారితోనే ఎక్కువగా వైద్య సేవలందిస్తున్నారు. కొన్ని ఆసుపత్రిల్లో వారి కొంతమందికి అవసరమైన మేరకు మాత్రమే నర్సింగ్‌ శిక్షణ ఇచ్చి వారి సేవలు వాడుకుంటున్నట్లు బృందం సభ్యులు గుర్తించారు. మెజారిటీ ఆసుపత్రుల్లో శానిటేషన్‌ సరిగా పట్టించుకోవడం లేదని గుర్తించారు. బయో మెడికల్‌ వేస్టేజీని మూడు పద్ధతుల్లో వేరుచేసి ఇతర ప్రాంతాలకు పంపించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వదిలివస్తున్నట్లు గుర్తించారు. బయోవేస్టేజీని మున్సిపల్‌ వాహనాల్లోనే తరలిస్తున్నట్లు బృందం సభ్యులు గుర్తించారు. 

ఫ ఆసుపత్రుల్లో ప్రసవాలన్నీ ప్యాకేజీ పద్ధతుల్లో..

చాలా ఆసుపత్రుల్లో ప్రసవాలన్నీ ప్యాకేజీ పద్ధతుల్లో, అదీ వైద్యుల వెసులుబాటు ప్రకారమే జరుగుతున్నట్లు గుర్తించారు. మందుల వాడకం నుంచి డిశ్చార్జీ అయ్యేంత వరకు ఈ ప్యాకేజీ ప్రకారమే వైద్య సేవలను అందిస్తున్నట్లు బృందం సభ్యులు తమ నివేదికల్లో పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రసవాలు అయ్యే అవకాశం ఉన్నా ఎక్కువగా సిజేరియన్‌లకే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. నొప్పులు వస్తున్నా గర్భిణులకు పెయిన్‌ కిల్లర్‌లు ఇచ్చి షెడ్యూల్‌ ప్రకారమే ఆపరేషన్‌ చేసేందుకు పేషెంట్ల బంధువులను నమ్మిస్తున్నట్లు పేషెంట్ల అటెండెంట్‌ల ద్వారా తెలుసుకున్నారు. ఈ బృందం సభ్యులు మిగతా ఆసుపత్రులను తనిఖీ చేసి మరో మూడు రోజుల్లో పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి అందించనున్నారు. ఆ తర్వాత వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సింది.

Updated Date - 2022-07-02T06:17:48+05:30 IST