మున్ముందు Gandhiలో ప్రైవేట్‌ మెడికల్‌ షాపులు ఉండవ్‌..

ABN , First Publish Date - 2022-02-08T19:07:15+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో వైద్యులు రాసి ఇచ్చే అన్ని రకాల మందులు..

మున్ముందు Gandhiలో ప్రైవేట్‌ మెడికల్‌ షాపులు ఉండవ్‌..

  • ఆ దిశగా ప్రభుత్వం యోచన 
  • టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ 
  • గాంధీ ఆస్పత్రిని సందర్శించిన చైర్మన్‌ 

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : గాంధీ ఆస్పత్రిలో వైద్యులు రాసి ఇచ్చే అన్ని రకాల మందులు ఆస్పత్రిలోనే లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇకనుంచి గాంధీ ఆస్పత్రిలో ప్రైవేట్‌ మెడికల్‌ దుకాణాలు ఉండవని అన్నారు. సోమవారం టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారుల బృందంతో కలిసి గాంధీ ఆస్పత్రిలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీ‌ష్‌రావు ఆదేశాల మేరకు తాను గాంధీ ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న కొన్ని మెడికల్‌ షాపులు ప్రతి నెలా ఇవ్వాల్సిన అద్దె డబ్బులు చెల్లించడం లేదని, ఈ అంశంపై సూపరింటెండెంట్‌ను వివరాలు అడుగగా, కోర్టు కేసులో ఉందని చెప్పారని తెలిపారు.


 కాగా.. గాంధీ ఆస్పత్రి ఫార్మసీలోనే మందులు ఉచితంగా ఇస్తున్నప్పుడు ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల అవసరం ఏమిటని, కొత్త టెండర్‌లో ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు అనుమతి లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం గాంధీ ఆస్పత్రి సెల్లార్‌లో ఉన్న ఫార్మసీ సెంటర్‌లో రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి క్యాజువాలిటీ వార్డు ముందు రూ.91లక్షలతో కొత్త షెడ్డు నిర్మించామని, రోగులకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలని ఎర్రోళ్ల ఆదేశించారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు, ఆర్‌ఎంవో 1 జయకృష్ణ, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఈఈ శరత్‌ చంద్రారెడ్డి, డిప్యూటీ ఈఈ దుర్గాప్రసాద్‌లతో పాటు వైద్య బృందం పాల్గొన్నారు.



Updated Date - 2022-02-08T19:07:15+05:30 IST