బెడ్డుకు కటకట..!

ABN , First Publish Date - 2021-05-07T05:27:26+05:30 IST

కరోనా వైరస్‌ రెండో దశలో శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే జిల్లా అంతా వ్యాపించింది. దీంతో. వైరస్‌ బాధితులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కడపలో అయితే ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. బెడ్‌ కోసం నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది.

బెడ్డుకు కటకట..!

కరోనా రోగులతో ప్రైవేటు ఆసుపత్రులు కిటకిట

కడప ఆసుపత్రులన్నీ బాధితులతో ఫుల్‌

ఆర్థిక భారమైనా ప్రైవేటు వైపు చూపు

కడప. మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ రెండో దశలో శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే జిల్లా అంతా వ్యాపించింది. దీంతో. వైరస్‌ బాధితులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కడపలో అయితే ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. బెడ్‌ కోసం నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటి దాకా రైల్వేస్టేషనలో టికెట్‌ కోసం వెయిటింగో, మంచినీళ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో కొళాయిలు దగ్గర బిందెలు పెట్టుకుని వేచి చూసే దృశ్యం చూశాం. ఇప్పుడు తొలిసారిగా వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రుల్లో బెడ్డుకోసం గంటలు, రోజుల తరబడి నిరీక్షించడం జనాలకు ఆందోళన కలిగిస్తోంది. తెలిసిన వారితో సిఫారసు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే వైరస్‌ తీవ్రత తెలుస్తోంది. కరోనాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందుతున్నప్పటికీ అక్కడ బాధితులకు భరోసా కరువు కావడంతో ఆర్థిక భారమైనా ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్నారు. వెరసి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.


ఆసుపత్రులు కిటకిట

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల  ద్వారా కరోనాకు ట్రీట్‌మెంటుకు అనుమతించారు. ఇప్పటికే జిల్లాలోని 17 ఆసుపత్రులు వైద్యం అందిస్తున్నాయి. కడప నగరంలో పది ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నాయి. కడపలో సూపర్‌ మల్టీ స్పెషాలిటీ, నర్శింగ్‌హోంలు మిగతా హాస్పిటల్స్‌ కలుపుకుని సుమారు 130కి పైగా ఉన్నాయి. మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు 18 దాకా ఉన్నాయి. అధికారికంగా పది ఆసుపత్రుల్లో కరోనాకు వైద్యం అందించడానికి అనుమతి ఉంది. అయితే అనధికారికంగా చాలా ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంటు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కడపలో రోజూ వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా ల్యాబ్‌లు, సీటీ స్కానల ద్వారా పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తులు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. దీంతో నగరంలోని ఆసుపత్రులన్నీ పాజిటివ్‌కు గురైన వ్యక్తులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యానికి లక్షల్లో ఖర్చు అయిన విషయం, సరిగా వైద్యం అందకపోవడంపై బాధితులు మాట్లాడుకున్న మాటలు సోషల్‌ మీడియాలో ఇటీవల వైరల్‌ అయ్యాయి.


ప్రభుత్వం వైద్యం అందుతున్నా..

స్వల్ప లక్షణాలు ఉన్న వారికి హోం ఐసోలేషనలో, కేర్‌ సెంటర్ల ద్వారా, తీవ్రంగా ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. కడపలో రిమ్స్‌, ఫాతిమా ఆసుపత్రుల్లో కరోనావైద్యం చేస్తున్నారు. అక్కడ ఆక్సిజన, పడకలతో పాటు విషమ పరిస్థితుల్లో సంజీవనిగా పిలవబడుతున్న రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పలువురు చికిత్స కోసం అక్కడ చేరుతున్నారు. అయితే అక్కడి వైద్యంపై నమ్మకం లేక కొందరు బాధితులు ట్రీట్‌మెంటు మధ్యలోనే డిశ్చార్జి అయి వచ్చి నగరంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో జాయిన అవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నప్పటికీ ఆర్థిక భారమైనా భరోసాతో అక్కడ చేరుతున్నారని సమాచారం. దీంతో ఆయా ఆసుపత్రుల్లో బెడ్లు ఫుల్‌ అయ్యాయి. 


24 గంటల్లో 1104 కేసులు

జిల్లాలో కరోనా వేగానికి అడ్డం లేకుండా పోతోంది. వైరస్‌ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24గంటల వ్యవధిలో మరో 1104 మంది వైరస్‌ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటినలో వెల్లడించింది. ఇప్పటి వరకూ 565 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 68,998కు చేరుకుంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న 438 మందిని డిశ్చార్జి చేశారు. మొత్తం రికవరీ సంఖ్య 62,062కు చేరుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు, పీహెచసీ సెంటర్లలో 1,850 మంది, హోం ఐసోలేషనలో 4,546 మంది చికిత్స పొందుతున్నారు. 


గురువారం నమోదైన కేసులను పరిశీలిస్తే..

జిల్లాలో 49 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరులో 175, కడప 136, పులివెందుల 89, వేంపల్లె 67, జమ్మలమడుగు 47, సింహాద్రిపురం 44, బద్వేలు 39, రాజంపేట 34, చాపాడు 34, లింగాల 33, రాయచోటి 33, ఎల్‌ఆర్‌పల్లె 27, తొండూరు 24, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే కాశినాయన, ఎర్రగుంట్ల మండలాల్లో 21 చొప్పున, సీకేదిన్నె 19,  వేముల, పోరుమామిళ్ల మండలాల్లో 18 చొప్పున, కమలాపురం 17, చకాయ్రపేట 15, బి.మఠం, వీరబల్లె 13, గాలివీడు, నందలూరు మండలాల్లో 12, సిద్దవటం 10, దువ్వూరు 9, పెండ్లిమర్రి, రైల్వేకోడూరు 8, కొండాపురం, పెద్దముడియం 7, గోపవరం, కలసపాడు, మైలవరం, ఓబులవారిపల్లె, సంబేపల్లె మండలాల్లో 6, అట్లూరు, టి.సుండుపల్లె 5, ముద్దనూరు, పుల్లంపేట, రామాపురం, వీఎనపల్లె 4, బి.కోడూరు, చెన్నూరు, పెనగలూరు, రాజుపాలెం 3, వల్లూరు, , ఒంటిమిట్ట 2, చిట్వేలి మండలంలో 1 కేసు నమోదయ్యాయి. కాగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ముగ్గురిలో పాజిటివ్‌ నిర్ధారణ అయింది


సిటీ కేర్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స నిలుపుదల

కడప, మే 6 (ఆంధ్రజ్యోతి): కడప నగరంలోని సిటీ కేర్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ వైద్య చికిత్సకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా బాధితులు పెరుగుతుండడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ వైద్యానికి ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి  తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే చికిత్స అందించాలని, రోగుల నుంచి వసూలు చేసిన డబ్బులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బాధితులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అధిక ధరల వసూలు, రెమిడెసివర్‌ ఇంజక్షనల అవకతవకలపై విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులను తనిఖీ చేసింది. ఇందులో భాగంగా కడప సిటీకేర్‌ ఆసుపత్రిని తనిఖీ చేయగా రోగుల నుంచి వసూలు చేసిన డబ్బులకు బిల్లులు ఇవ్వలేదని వెల్లడైంది. దీంతో ఈ ఆసుపత్రికి కొవిడ్‌ చికిత్స అందించేందుకు ఇచ్చిన అనుమతి రద్దుకు చర్యలు తీసుకుంటున్నట్లు విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంటు డైరెక్టర్‌ కేఆర్‌వీ రాజేంద్రనాధరెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆసుపత్రుల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో అక్రమాలపై డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేటర్‌ నెంబర్‌ 8985972367కు, విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంటు ఎస్పీ 9740081357, పబ్లిక్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టరు 9849902208 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - 2021-05-07T05:27:26+05:30 IST