ప్రైవేటు ఆస్పత్రులపై దిద్దుబాటేదీ?

ABN , First Publish Date - 2020-08-08T08:33:46+05:30 IST

ప్రైవేటు ఆస్పత్రులపై దిద్దుబాటేదీ?

ప్రైవేటు ఆస్పత్రులపై దిద్దుబాటేదీ?

మరో 100 ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స!

ప్రైవేటుకు వెళ్లొద్దంటూనే అనుమతులు

అధిక బిల్లులపై రెండు ఆస్పత్రులపైనే చర్య

కేంద్రీకృత పద్ధతిలో బెడ్లు కేటాయించొచ్చు

ప్రభుత్వానికి ఫిక్కీ తెలంగాణ సూచన

ఆస్పత్రుల యాజమాన్యాలూ అదే చెప్పాయి

చార్జీలు హేతుబద్దం చేస్తేనే ఊరట


హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన టారి్‌ఫకు విరుద్ధంగా కరోనా వైద్యానికి లక్షల్లో బిల్లులు వేస్తున్నాయని, భారీగా డిపాజిట్లు కట్టించుకున్న తర్వాతే బెడ్లు కేటాయిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబర్‌కు వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వాటికి తోడు వాట్సా్‌పలలో, సోషల్‌ మీడియాలో ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర ఆరోపణలతో అనేక వీడియోలు సర్క్యులేట్‌ అయ్యాయి. దారితప్పిన కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల జోలికి పోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోందనే అభిప్రాయం జనాల్లో బలపడుతు న్న తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం.. అధిక బిల్లులు వసూలు చేసిన దక్కన్‌, విరించి ఆస్పత్రులపై వేటు వేసింది. ఇక నుంచి అవి కొవిడ్‌ వైద్యం చేయరాదని ఆదేశించింది. అంటే, ఇతర వైద్యం చేసుకోవచ్చు. ఇదేమీ గీతదాటిన మిగతా ఆస్పత్రులను భయపెట్టి దారికి తెచ్చేంత పెద్ద శిక్ష ఏమీ కాదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. వాట్సాప్‌ ఫిర్యాదుల మేరకు.. ప్రతీ సమస్యకు తగిన పరిష్కారం వెతకాల్సిన ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలేవీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులు తమ దగ్గర ఎన్ని బెడ్లు ఉన్నాయన్న అంశంపై పారదర్శకంగా ఉండకపోవడం, క్యాష్‌ ఇచ్చిన వాళ్లకు బెడ్లు కేటాయిస్తూ, వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న వారికి బెడ్లు ఇవ్వకుండా వెళ్లగొట్టడంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఫిక్కీ తెలంగాణ, ఆస్కీ లాంటి సంస్థలు మంచి సూచన చేశాయి. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌ అడ్మిషన్లు అన్నీ కేంద్రీకృత పద్ధతిలో జరగాలని సూచించాయి. రోగం తీవ్రతను బట్టి బెడ్లు కేటాయించాలని చెప్పాయి. డబ్బున్న వాళ్లు తమకు కరోనా తీవ్రత అంత ఎక్కువగా లేకపోయినా ముందు జాగ్రత్తగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిపోతున్నారని, దాంతో నిజంగా అవసరం ఉన్న వాళ్లకు బెడ్లు లేకుండా పోతున్నాయని ఫిక్కీ వ్యాఖ్యానించింది. కరోనా రోగులు కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ఆస్పత్రిలో చేరే విధంగా చూడాలని సలహా ఇచ్చింది. గతంలో ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా ఇలాంటి సూచనే చేశాయి. కానీ, ప్రభుత్వం నుంచి  ఎలాంటి చొరవా లేదు. ప్రైవేటులో కోవిడ్‌ చికి త్స ధరలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. ఏ ప్రైవేటు ఆస్పత్రి కూడా సర్కారు నిర్ణయించిన ధరల ప్ర కారం వైద్యం చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వేర్వేరు పేర్లతో భారీ ఎత్తు న బిల్లులు వేస్తున్నట్లు వాట్సా్‌పకు వచ్చిన ఫిర్యాదుల్లో ప్రస్తావించారు. ఇప్పటివరకు 2 ఆస్పత్రులపైనే ధరల విషయంలో చర్యలు తీసుకున్నారు. అంటే, మిగతా ఆస్పత్రులన్నీ రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించిన టారిఫ్‌ ప్రకారమే బిల్లులు వసూలు చేస్తున్నాయా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. 


జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందునే..!

మొదట 150 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 91 ఆస్పత్రుల్లో చికిత్సలు ప్రారంభం అయ్యాయి. ఇప్పడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉంటుంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో అసలు బెడ్లు దొరడకం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో 100 ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు అధికారులు చెప్పే కారణం.. జిల్లాల్లో కరోనా విస్తరిస్తూ ఉండటం. పెరు గుతున్న రోగులకు వైద్య సేవలు అందించడానికే ప్రైవేటు ఆస్పత్రులకు  అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఆక్సిజన్‌, ఐసీయూ సదుపాయం ఉన్న ఆస్పత్రుల నుంచి దరఖాస్తులను తీసుకొని వెంటనే పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు.


ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం ఏది?

ప్రైవేటుకు వెళ్లవద్దని, లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్పత్రులకే రావాలని స్వయం గా వైద్య ఆరోగ్య మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సలకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో అసలు సర్కారు వైఖరేంటో అర్థం కాని పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంకా ఆక్సిజన్‌ పడకల వ్యవస్థపూర్థి స్థాయిలో ఏర్పాటు కాలేదు. గచ్చిబౌలీలోని టిమ్స్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ రోగుల కోసం 1261 పడకలను సిద్ధం చేయగా అక్కడ కేవలం 170 మంది రోగులకే సేవలందుతున్నాయి.  


ప్రైవేటులో మరణాలకు లెక్కలేవి?

రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులుగా రోజూ 10-12 కొవిడ్‌ మరణాల లెక్క చెబుతోంది. వాస్తవానికి అంతకంటే ఎక్కువగానే మరణాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రోజుకు 3-4 కరోనా మరణాలు సంభవిస్తున్నా ఆ వివరాలు సకాలంలో వైద్య ఆరోగ్యశాఖకు వెల్లడించడం లేదని సమాచారం. ప్రైవేటు ఆస్పత్రుల మరణాలనూ రోజువారీగా వెల్లడిస్తే.. మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని కొందరు వైద్యులు సర్కారుకు సూచిస్తున్నారు.


ప్రభుత్వం పునరాలోచించాలి

కొవిడ్‌ వైద్య సేవలు సర్కారులోనే ఎక్కువగా అందేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రైవేటుకు వెళ్లి లక్షల్లో చెల్లించడానికి కనీసం డబ్బులు కూడా సమకూర్చుకునే పరిస్థితి లేదు. ప్రైవేటుకు అనుమతులిచ్చే విషయంలో సర్కారు మరోసారి ఆలోచించుకోవాలి. సర్కారు ఆస్పత్రుల్లో పడకలు పెంచాలి. 

- జగన్‌, ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం, అధ్యక్షుడు.

Updated Date - 2020-08-08T08:33:46+05:30 IST