‘ప్రైవేటు’ దోపిడీ

ABN , First Publish Date - 2021-05-13T05:59:22+05:30 IST

కొవిడ్‌ బాధితులను ప్రైవేట్‌ ఆసుపత్రులు దోచేసుకుంటున్నాయి. ఒక బాధితుడు ఆసుపత్రికి వస్తే చాలు బతికి ఉన్నా, ప్రాణాలు పోగొట్టుకున్నా రూ.3 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు లాగేస్తున్నారు

‘ప్రైవేటు’ దోపిడీ

  • కొవిడ్‌ బాధితుల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు లాగేస్తున్నారు

 (రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

 కొవిడ్‌ బాధితులను ప్రైవేట్‌ ఆసుపత్రులు దోచేసుకుంటున్నాయి. ఒక బాధితుడు ఆసుపత్రికి వస్తే చాలు బతికి ఉన్నా, ప్రాణాలు పోగొట్టుకున్నా రూ.3 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు లాగేస్తున్నారు. కోనసీమకు చెందిన ఒక యువకుడిని ఇటీవల రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌ పెట్టారు. ఇప్పటికే ఈ బాధితుడికి రూ.11 లక్షలు ఖర్చయినట్టు సమాచారం. చివరకు వెంటిలేటర్‌ తీసేస్తామని, ఇక ఉపయోగం ఉండదని సలహా ఇచ్చి మరో రూ.3 లక్షలు కట్టమని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఆసుపత్రులు రూ.3 లక్షల నుంచి మొదలెట్టి ఇష్టానుసారం గుంజుతున్నాయి. ఇటీవల బాధితుల సంఖ్య బాగా పెరిగిపోవడంతో బెడ్స్‌ ఖాళీ ఉండడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో అసలు బెడ్లు ఖాళీ ఉండకపోవడం వల్ల వరండాలో కూడా బెడ్లు వేశారు. ఈ పరిస్థితుల్లో పడకల కోసం, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఉంటుందనే భ్రమతో రూ.లక్షలు పోసి చేరుతున్నారు. కొందరు డాక్టర్లు మంచి వైద్యమే అందిస్తున్నారు. లేకపోతే చాలా మంది బతకడం కష్టమే. పరిస్థితి చేయిదాటిన బాధితులను ఎవరైనా తీసుకుని వస్తే ఆసుపత్రిలో చేర్చడం వల్ల ప్రయోజనం లేదని, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సహాయం కాసేపు ఉండవచ్చని, దీనికి రూ.లక్షలు  ఖర్చు చేయడం అనవసరమని కూడా కొందరు వైద్యులు బాధితుల కుటుంబ సభ్యులకు చెప్పడం గమనార్హం. కొందరైతే ఎంతో కొంత లాగేద్దామనే ఆలోచనతో ఉన్నారు.

ప్రజలందరికీ విస్తృతంగా కొవిడ్‌ టెస్టులు చేయకపోవడంతో చాలా మంది ప్రైవేట్‌ ల్యాబ్‌లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఇష్టానుసారం డబ్బులు దోచేస్తున్నారు. ఆర్‌ఎంపీలు కూడా టెస్ట్‌లు చేసేస్తున్నారు. ప్రభుత్వం  ర్యాపిడ్‌ టెస్ట్‌లైనా నిర్వహిస్తే కనుక ఎవరికైనా లక్షణాలు ఉంటే ముందే వైద్యం పొందవచ్చు. ఇటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల రోగం ముదరబెట్టుకుని చాలా మంది కొన ఊపిరితో ఆసుపత్రులకు వస్తున్నారు. అక్కడ డబ్బు వృధా అవుతోంది. చివరకు ప్రాణమూ దక్కడం లేదు.

Updated Date - 2021-05-13T05:59:22+05:30 IST