చచ్చినా వదలట్లే! ‘కరోనా’ చావులోనూ బిల్లు బేరం

ABN , First Publish Date - 2021-05-11T06:04:31+05:30 IST

కరోనా కష్టకాలం లో ఎంతోమంది హృదయాలు స్పందిస్తున్నాయి. కానీ కొందరు ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం కఠువుగానే వ్యవహరిస్తున్నాయి. పైసలే పర మావధిగా వ్యవహరిస్తూ బిల్లుల కోసం కరోనా మృత దేహాలను కూడా వదలకుండా గంటల తరబడి తమ వద్దే పెట్టుకుని.. పూర్తి బిల్లు చెల్లిస్తేనే అప్పగిస్తా మంటూ బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.

చచ్చినా వదలట్లే!  ‘కరోనా’ చావులోనూ బిల్లు బేరం

 రూ.40వేల కోసం ఆసుపత్రిలోనే ఏడుగంటల పాటు శవం

 ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ యాజమాన్యం నిర్వాకం

 పుట్టినరోజునే మృత్యుకౌగిలికి పేదయువకుడు

ఖమ్మంసంక్షేమవిభాగం, మే 10: కరోనా కష్టకాలం లో ఎంతోమంది హృదయాలు స్పందిస్తున్నాయి. కానీ కొందరు ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం కఠువుగానే వ్యవహరిస్తున్నాయి. పైసలే పర మావధిగా వ్యవహరిస్తూ బిల్లుల కోసం కరోనా మృత దేహాలను కూడా వదలకుండా గంటల తరబడి తమ వద్దే పెట్టుకుని.. పూర్తి బిల్లు చెల్లిస్తేనే అప్పగిస్తా మంటూ బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సోమవారం జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఖమ్మంజిల్లా సరిహద్దున ఉన్న ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువ కుడు (34) కరోనా లక్షణాలతో నాలుగు రోజుల క్రితం ఖమ్మంలోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ ఆసుపత్రికి వచ్చారు. అతడికి అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆ వ్యక్తి సోమవారం ఉదయం 11గంటలకు కన్నుమూశారు. అయితే అతడిని చేర్చుకునే సమయం లో కుటుంబసభ్యులు రూ.30వేలు, సోమవారం మరో రూ.20వేలు చెల్లించారు. వైద్యసేవల అనంతరం ఆ ఆసుపత్రి యాజమాన్యం రూ.లక్ష బిల్లు వేసి మిగిలిన రూ.50వేలు చెల్లించాలని సూచించారు. అయితే సదరు మృతుడి భార్య తాము అంత చెల్లించుకోలేమని, తమది పేద కుటుంబమని, కరోనా కారణంగా తమ బంధువులు ఎవరూరాలేదని చెప్పినా యాజమాన్యం పట్టించు కోలేదు. మిగిలిన రూ.50వేలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఖరా ఖండిగా చెప్పడంతో.. ఆమె చేసేదేమీలేక.. వారడిగి నంత చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో భర్త మృత దేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. విషయం ఖమ్మంలోని బంధువు ఒకరికి చెప్పడంతో ఆయన రాత్రి 7గంటల సమయంలో సదరు ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లి యాజమాన్యంతో చర్చలు జరిపి మృతదేహాన్ని తీసుకుని ఖమ్మంలోనే అంత్యక్రియలు చేయించారు. ఇక్కడ మరో వ్యాపారం సాగింది. అతడి మృతదేహాన్ని తీసు కెళ్లేందుకు స్వగ్రామం నుంచి బంధువు లెవరూ రాకపోవడంతో.. ఖమ్మానికి చెందిన ఆ బంధువే మృత దేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకుని కార్పొరేషన్‌ సిబ్బందికి అప్పగించారు. అయితే రూ.20వేలు ఇస్తేనే అంతిమ సంస్కారాలు చేస్తామని కార్పొరేషన్‌ సిబ్బంది ఖరాఖండిగా చెప్పడంతో చేసేదేం లేక వారు అడిగినంతా ఇచ్చి.. మృతదేహానికి అంతిమసంస్కారాలు చేయించారు. 

ఏడు గంటల పాటు బేరం 

కరోనా చికిత్స పొందుతూ ఉదయం 11గంటలకు మృతిచెందిన వ్యక్తి శవాన్ని రాత్రి 7గంటల వరకు బంధువులకు అప్పగించక పోవడాన్ని చూస్తుంటే ఖమ్మంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల దందా ఏ రీతిలో సాగుతోందో అర్థమవుతోంది. గతంలో డెంగ్యూ, మలేరియాతో ఆసుపత్రుల్లో చేరిన వారు.. కోలుకొని ఇంటికి వెళ్లే సమయంలో బిల్లు చెల్లించే విషయంలో ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ కరోనాతో మృతిచెందిన వారి విషయంలోనూ ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇలా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 

పుట్టినరోజునే మృత్యుఒడికి..

సదరు ప్రైవేట్‌ ఆసుపత్రిలో కరోనాతో చనిపోయిన వ్యక్తి పుట్టినరోజు కూడా సోమవారమే కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. నాలుగురోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన అతడు కోలుకుని ఇంటికి వస్తాడనుకుంటే.. సరిగ్గా పుట్టినరోజు నాడే తుదిశ్వాస విడవడం, అయిన వారు కడసారి చూసుకోవడానికి కూడా వీల్లేకుండా ఎవరూ లేని వాడిలా అంతిమసంస్కారాలు జరపడంతో ఆ కుటుంబసభ్యులకు తీరని శోకం మిగిలింది. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులున్నారు. 


Updated Date - 2021-05-11T06:04:31+05:30 IST