ప్యాకేజీ దోపిడీ.. వైద్యం మాటున సంపాదనే లక్ష్యం

ABN , First Publish Date - 2020-08-08T22:06:41+05:30 IST

అనంతలో వైద్యం కొత్తపుంతలు తొక్కుతోంది. కరోనా బాధితుల ప్రాణాలు నిలపాల్సింది పోయి.. దోపిడీయే లక్ష్యంగా మార్చుకుంది. కొత్తగా ప్యాకేజీ వైద్యం వచ్చింది. ఇందులో అడుగడుగునా దోపిడీయే. క

ప్యాకేజీ దోపిడీ.. వైద్యం మాటున సంపాదనే లక్ష్యం

కరోనాలో కలిసొచ్చిన వ్యాపారం

మానవత్వం మరిచిన ప్రైవేట్‌ ఆస్పత్రులు

వైరస్‌ నిర్ధారణకు సిటీ స్కాన్‌.. రూ.6 వేల వరకు బాదుడు

లక్షణాల పేరుతో అనధికారికంగా అడ్మిషన్‌

10 రోజులకు రూ.60 వేల నుంచి రూ.లక్ష

డాక్టర్‌ ఫీజులు, మందులు అదనం


అనంతపురం (ఆంధ్రజ్యోతి): అనంతలో వైద్యం కొత్తపుంతలు తొక్కుతోంది. కరోనా బాధితుల ప్రాణాలు నిలపాల్సింది పోయి.. దోపిడీయే లక్ష్యంగా మార్చుకుంది. కొత్తగా ప్యాకేజీ వైద్యం వచ్చింది. ఇందులో అడుగడుగునా దోపిడీయే. కరోనా నిర్ధారణకు సిటీ స్కాన్‌ చేయిస్తున్నారు. లక్షణాలున్నాయంటూ ప్యాకేజీ మాట్లాడుతున్నారు. అనధికారికంగా అడ్మిట్‌ చేసుకుని, రోజుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు గుంజుతున్నారు. వైద్యుల ఫీజులు, మందులకు అదనంగా వసూలు చేస్తున్నారు. మరో ఆస్పత్రి అయితే ఏకంగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బందితో వైద్యం చేయిస్తూ.. ప్యాకేజీల రూపంలో లక్షలు గడిస్తోంది.


నార్పల మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాద్యాయుడు కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని గుత్తి రోడ్దు వైపు ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికెళ్లారు. సిటీ స్కాన్‌ చేయించుకోవాలని వైద్యుడు సూచించారు. ఓ ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్‌లో రూ.6 వేలు కట్టి, చేయించుకున్నారు. మైల్డ్‌ లక్షణాలున్నాయని వైద్యుడు తెలిపారు. భయపడి దాని ఎదురుగా ఉన్న మరో ప్రైవేట్‌ ఆస్పత్రికెళ్లారు. అక్కడా 10 రోజులకు రూ.60 వేలు ప్యాకేజీ కడితే అడ్మిట్‌ చేసుకుంటామన్నారు. డబ్బు కట్టాక చేర్చుకున్నారు. డాక్టర్‌ ఫీజులు, మందులకు అదనంగా రాబట్టుకున్నారు.


ఈ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మరో రకం దోపిడీ సాగుతోంది. సొంతంగా కరోనా అనుమానితులను అడ్మిట్‌ చేసుకుంటారు. ఇదే ఆసుపత్రిలో ప్రభుత్వం కూడా కొందరు కరోనా బాధితులకు చికిత్స అందిస్తోంది. వీరికి ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేసింది. ప్రైవేట్‌గా అడ్మిట్‌ చేసుకున్న బాఽధితులకు ఆ ప్రభుత్వ వైద్యులు, సిబ్బందితోనే చికిత్సలు చేయిస్తోంది యాజమాన్యం. ప్యాకేజీతోపాటు డాక్టర్‌, మందుల ఫీజులు దండుకుంటోంది. సాయినగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి మరీ బరితెగించింది. కరోనా బాధితులను అడ్మిట్‌ చేసుకోవాలంటే పగలు రూ.10 వేలు, రాత్రికి మరో రూ.10 వేలు ఫీజు చెల్లించాల్సిందే. లేదంటే అడ్మిట్‌ చేసుకోరు. చేసుకున్నా.. డిశ్చార్జ్‌ చేసి, పంపిస్తారు.


కరోనా ఓ వ్యాపారంగా మారింది. కొందరు వైద్యులు దీనిని అదునుగా తీసుకుని, దోపిడీకి తెరలేపారు. కరోనా ప్రారంభంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు సాధారణ జబ్బులతో వచ్చిన వారికి కూడా వైద్యం అందించలేదు. జూన్‌ నెల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరగటంతో ప్రభుత్వం అవసరమైన వసతులు, వైద్యసేవలు అందించలేకపోతోంది. ఈ దశలో కలెక్టర్‌ సీరియ్‌సగా తీసుకుని, కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల ద్వారా కరోనా బాధితులకు వైద్యం అందేలా చూశారు. అదే వాటికి కలిసొచ్చింది. ఈ నేపథ్యంలోనే కరోనాను సిటీ స్కాన్‌ ద్వారా నిర్ధారించవచ్చని వైద్యవర్గాలు వెల్లడించాయి. దీనిని అసరాగా చేసుకుని, వైరస్‌ లక్షణాలతో ఎవరైనా ఆస్పత్రులకు వస్తే వైద్యులు సిటీ స్కాన్‌ చేయిస్తున్నారు. తమ ఆస్పత్రుల్లో ఉంటే అక్కడే చేస్తున్నారు. లేదంటే స్కానింగ్‌ సెంటర్లతో ఒప్పందం చేసుకుని, అక్కడికి పంపిస్తున్నారు. సిటీ స్కాన్‌కు గతంలో రూ.2 వేలు తీసుకునేవారు. ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర పెంచి, దోపిడీ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో 5 నుంచి 6 వరకు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఈ దందాకు తెరలేపాయని చర్చించుకుంటున్నారు. గతంలో ఈ ఆస్పత్రులకు అనుమానితులు, సాఽధారణ జబ్బుల వారు వెళ్లినా కరోనా అంటూ లోపలికి కూడా రానిచ్చేవారు కాదు. కరోనా ముసుగులో దోపిడీకి తెరలేపటంతో ఆస్పత్రుల తలుపులు రాత్రింబవళ్లు.. బాధితుల కోసం తెరుచుకునే ఉన్నాయి.


ప్యాకేజీ రూపంలో దోపిడీ

జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు కరోనా కాసులు కురిపిస్తోంది. కొందరు అర్థిక స్తోమత ఉన్న వారు కరోనా పాజిటివ్‌ వస్తే బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నయ్‌ వెళ్లి, చికిత్సలు చేయించుకుంటున్నారు. అక్కడ ప్యాకేజీ రూపంలో రోజుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ లెక్కన 10 రోజులకు రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. దీంతో జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలకు డబ్బు ఆశ పుట్టింది. అందుకే కరోనా లక్షణాలున్నవారు వచ్చినా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే తమ ఆస్పత్రుల్లో అడ్మిట్‌ చేసుకుంటున్నారు. రోజుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. 10 రోజులకు రూ.లక్ష చొప్పున ప్యాకేజీ నిర్ణయించి, దండుకుంటున్నారు. డాక్టర్ల ఫీజు, మందులు కలిపి ఒక్కో కరోనా బాధితుడు రూ1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం ఎంపిక చేసిన కొవిడ్‌ ఆస్పత్రుల్లో వసతులు, వైద్యసేవలు సరిగా లేవంటూ అప్పోసప్పో చేసి, బాధితులు ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులను అశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని, ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఈ డోపిడీపై పలు సార్లు బహిరంగంగా మండిపడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్య శాఖ మంత్రి సమక్షంలోనే ఆయన తీవ్రస్థాయిలో ఽధ్వజమెత్తారు. అయినా జిల్లా అఽధికార యంత్రాంగం మౌనం పాటించటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-08-08T22:06:41+05:30 IST