ఙప్రైవేటు ఆస్పత్రులు దోచేస్తున్నాయి

ABN , First Publish Date - 2021-05-12T05:08:59+05:30 IST

గోపాలపట్నానికి చెందిన వెంకటరఘురామ్‌ తన భార్యకు కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఈ నెల రెండున సమీపంలోని ఎస్‌ఆర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

ఙప్రైవేటు ఆస్పత్రులు దోచేస్తున్నాయి
గోపాలపట్నం ఎస్‌ఆర్‌ ఆస్పత్రిలో విజిలెన్స్‌ తనిఖీలు

రోజుకు రూ.50 వేల నుంచి లక్ష వరకూ వసూలు

కరోనా వైద్యం పేరుతో నిర్వాహకుల దందా

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్న వారికి చికిత్స నిరాకరణ

నగదు చెల్లిస్తేనే చేర్చుకుంటున్న వైనం

చెల్లించిన మొత్తానికి బిల్లులు ఇవ్వకుండా మెసేజ్‌లతో సరి

ల్యాబ్‌లో మూడు వేలకు అయ్యే వైద్య పరీక్షలకు మూడు రెట్లు అధికంగా వసూలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


గోపాలపట్నానికి చెందిన వెంకటరఘురామ్‌ తన భార్యకు కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఈ నెల రెండున సమీపంలోని ఎస్‌ఆర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందని చెప్పగా...చేర్చుకోబోమని చెప్పడంతో డబ్బు కట్టేందుకు అంగీకరించారు. స్పెషల్‌ రూమ్‌లో చికిత్స అందించినట్టు చెప్పి నాలుగో రోజు ఆమెను డిశ్చార్జి చేశారు. ఆయన వద్ద నుంచి రూ.2.7 లక్షలు తీసుకుని బిల్లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రఘురామ్‌ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.


తగరపువలసలోని అనిల్‌ నీరుకొండ ఆస్పత్రిలో కరోనా రోగులకు రెండు రకాల బిల్లులు ఇస్తున్నారు. ఆ ఆస్పత్రిలో తనకు జరిగిన అన్యాయంపై ఒక మహిళ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తంచేయడంతో విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేసి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు.


రఘురామ్‌కో..మరొకరికో మాత్రమే కాదు. నగరంలో కరోనా బారినపడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన/పొందుతున్న ఎంతోమందికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. 


ప్రతిరోజూ జిల్లాలో రెండు వేల మందికిపైగా వైరస్‌ బారినపడుతున్నారు. వీరిలో 20 శాతం మంది శ్వాస అందకపోవడం, ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గిపోవడం వంటి కారణాలతో ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులో బెడ్‌లు ఖాళీ లేకపోవడం, అక్కడైతే సరిగా వైద్యం అందదని అనుమానంతో చాలామంది ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీనిని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వున్నా...నగదు చెల్లిస్తేనే చేర్చుకుంటామని తెగేసి చెబుతున్నారు. ఆలస్యమైతే ప్రాణాలకు ప్రమాదమని భయంతో రోగి బంధువులు కూడా అందుకు సిద్ధమవుతున్నారు. అలా చేరిన వారి వద్ద నుంచి ఆస్పత్రుల నిర్వాహకులు స్పెషల్‌ రూమ్‌, ఆక్సిజన్‌ బెడ్‌ పేరు చెప్పి రోజుకు రూ.40 వేల నుంచి లక్ష రూపాయలు వరకూ వసూలు చేస్తున్నారు. మందులను కూడా తమ ఆస్పత్రి ఆవరణలోని  దుకాణంలోనే కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. అలాగే అత్యవసరమని చెప్పి ఖరీదైన ఇంజక్షన్లు తెప్పిస్తున్నారు. వాటిని...రోగికి ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పి తిరిగి బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారు. ఇంకా రక్తపరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లకు బయట ల్యాబ్‌లో తీసుకునే మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీనిపై వరుస ఫిర్యాదులు అందుతుండడంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ప్రభుత్వం నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించగా విస్మయకరమైన విషయాలు వెలుగుచూశాయి.  


తగరపువలసలోని అనీల్‌ నీరుకొండ ఆస్పత్రిలో  కొవిడ్‌ వైద్యం పేరిట తమను దోచుకున్నారని ఒక మహిళ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేయడంతో...విజిలెన్స్‌ అధికారులు స్పందించి సోదాలు చేయగా రెండు రకాల బిల్లులు ఇస్తున్నట్టు తేలింది. ఒక బిల్లు ఆస్పత్రిలో చేసిన వైద్యానికి సంబంధించినది అయితే...మరొకటి ఆస్పత్రిలో భవిష్యత్తులో చేయించుకునే వైద్యానికి రాయితీ కల్పించే ప్యాకేజీకి సంబంధించినదని గుర్తించారు. పైగా బిల్లును నగదు రూపంలోనే చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్టు అక్కడున్నవారు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలని చెప్పి రోగి బంధువులతో బయట కొనిపించి...వాటిని రోగికి ఇవ్వకుండా పక్కనపెట్టేస్తున్నట్టు తేలింది. దీంతో విజిలెన్స్‌ అధికారుల ఫిర్యాదు మేరకు భీమిలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే ఆరిలోవ హెల్త్‌సిటీలోని జిమ్స్‌లో రోగుల నుంచి డబ్బులు ఎక్కువ తీసుకుని, బిల్లు తక్కువకు ఇచ్చినట్టు విజిలెన్స్‌ సోదాల్లో తేలడంతో ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. తాజాగా గోపాలపట్నంలోని ఎస్‌ఆర్‌ ఆస్పత్రిపై వెంకటరఘురామ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్‌ అదనపు ఎస్పీ జి.స్వరూపారాణి ఆధ్వర్యంలో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ్‌కు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వున్నప్పటికీ నగదు ఇస్తేనే వైద్యం చేస్తామని షరతు పెట్టడంతోపాటు అడ్వాన్సుగా లక్ష రూపాయలు కట్టించుకున్నట్టు తేలింది. ఈ నెల రెండున ఆస్పత్రిలో చేర్పించుకుని స్పెషల్‌రూమ్‌లో ఆక్సిజన్‌ బెడ్‌ ఇస్తామని చెప్పి జనరల్‌ వార్డులో చికిత్స చేసినట్టు గుర్తించారు. అలాగే ఆక్సిజన్‌ కోసం నాలుగు రోజులకు రూ.70 వేలు వసూలు చేసినట్టు తేలింది. బయట ల్యాబ్‌లో రూ.మూడు వేలకు చేసే రక్తపరీక్షలు, సీటీ స్కాన్‌ కోసం ఏడు వేలు చొప్పున తీసుకున్నట్టు, మొత్తంగా నాలుగు రోజులకు రూ.2.7 లక్షలు వసూలు చేసి బిల్లు ఇవ్వకుండా కేవలం ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోవాలని చెప్పినట్టు నిర్ధారణ అయ్యింది.  ప్రసాద్‌ అనే కరోనా బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా 37 రెమిడెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో వున్నప్పటికీ బయట నుంచి తెచ్చుకోవాలని చెప్పినట్టు విజిలెన్స్‌ అధికారుల విచారణలో తేలింది. ఆస్పత్రిలో మొత్తం తొమ్మిది మంది రోగులు మాత్రమే చికిత్స పొందుతుండగా 37 రెమ్‌డెవిసర్‌ ఇంజక్షన్లను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు ఎలా కేటాయించారనే దానిపై అధికారులు దృష్టిసారించారు. ఎస్‌ఆర్‌ ఆస్పత్రిపై పోలీసు కేసు నమోదుచేస్తామని విజిలెన్స్‌ అదనపు ఎస్పీ స్వరూపారాణి తెలిపారు.

Updated Date - 2021-05-12T05:08:59+05:30 IST