అక్రమంగా Medical Training: బెంగళూరు ఆస్పత్రిపై కేసు

ABN , First Publish Date - 2021-10-27T02:13:02+05:30 IST

అనుమతి లేకున్నా విద్యార్థులకు ఫీటల్ (పిండం) మెడిసిన్‌లో శిక్షణ ఇస్తున్న స్పర్శ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి

అక్రమంగా Medical Training: బెంగళూరు ఆస్పత్రిపై కేసు

బెంగళూరు: అనుమతి లేకున్నా విద్యార్థులకు ఫీటల్ (పిండం) మెడిసిన్‌లో శిక్షణ ఇస్తున్న స్పర్శ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి బెంగళూరు అర్బన్ జిల్లా అధికారులు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫీటల్ మెడిసిన్‌లో శిక్షణ ఇవ్వాలంటే ప్రసూతి, గైనకాలజీ రంగంలో ప్రినేటల్ పరీక్షలు, చికిత్సలు అందించడం, శస్త్రచికిత్సలు చేసేందుకు వైద్యులను సన్నద్ధం చేయడం వంటివి అవసరం.


కానీ, అలాంటివేమీ లేకుండానే అనధికారికంగా శిక్షణ ఇస్తుండడంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఆసుపత్రి కర్ణాటక మెడికల్ కౌన్సిల్‌కు అనుబంధంగా కానీ, అలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కానీ లేదని బెంగళూరు అర్బన్ జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్ఓ) డాక్టర్ జీఏ శ్రీనివాస్ తెలిపారు.


ఆసుపత్రిని సందర్శించిన అధికారుల బృందం అక్కడ అనధికారికంగా ఫీటల్ మెడిసిన్‌లో శిక్షణ ఇస్తున్నట్టు నిర్ధారించారు. అలాగే, గర్భిణులకు ఆసుపత్రిలో నిర్వహించిన స్కానింగ్‌ల కోసం జారీ చేసిన మార్గదర్శకాలను కూడా అధికారులు ఉల్లంఘించినట్లు బృందం గుర్తించింది.


స్కానింగ్‌కు ముందు ప్రతిసారి ఫామ్ ఎఫ్ (అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటున్న గర్భిణి పేరు, చిరునామా, మునుపటి పిల్లలు వారి లింగం, మునుపటి ప్రసూతి చరిత్రసహా పూర్తి సమాచారంతో కూడిన తప్పనిసరి రికార్డు) అప్‌లోడ్ చేయాలని నిర్దేశించబడినప్పటికీ అదేమీ జరగడం లేదని, సాయంత్రం వేళల్లో వాటిని అప్‌లోడ్ చేస్తున్నారని గుర్తించారు.


అలాగే, గది లోపల ఉన్న పెద్ద టీవీలో పిండాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా పిండం ఆడా, మగా అనేది చెప్పకనే చెబుతున్నారు. చట్టప్రకారం ఇది చాలా తవ్రమైన నేరమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

Updated Date - 2021-10-27T02:13:02+05:30 IST