ప్రైవేటు ఫ్రెండ్‌షిప్‌

ABN , First Publish Date - 2022-05-17T06:52:22+05:30 IST

బంగ్లాదేశ్‌ నౌక పేరుతో పెద్ద బాగోతమే నడుస్తోంది. నిబంధనలకు తిలోదకాలిచ్చేసి ప్రభుత్వ ఆస్తులను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రైవేటు ఫ్రెండ్‌షిప్‌

తెన్నేటి పార్కుకు ఎసరు?

రెండేళ్ల క్రితం తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్‌ నౌక ‘ఎంవీ మా’పై 

రెస్టారెంట్‌ ఏర్పాటుకు అప్పట్లో ప్రభుత్వం ఆలోచన

నిధుల సమస్యతో వెనక్కి తగ్గిన పాలకులు

ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ‘గిల్‌మెరైన్‌’ ఆసక్తి

నౌక యజమాని నుంచి స్ర్కాప్‌ కింద కొనుగోలు చేసిన సంస్థ

సహకరిస్తున్న అధికారులు

తెన్నేటి పార్కును తమకు అప్పగించాలని సదరు సంస్థ లేఖ

అంతా అమరావతి నుంచి చూసుకుంటున్నారంటున్న పర్యాటక శాఖ నంగనాచి కబుర్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బంగ్లాదేశ్‌ నౌక పేరుతో పెద్ద బాగోతమే నడుస్తోంది. నిబంధనలకు తిలోదకాలిచ్చేసి ప్రభుత్వ ఆస్తులను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అటు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన విశాఖపట్నం పోర్టు ట్రస్టుతో పాటు ఇటు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, అటవీ శాఖలు వంత పాడుతున్నాయి. కొన్ని పదాలకు అర్థాలే మార్చేసి, ప్రపంచంలో ఎక్కడా లేని పోకడలకు విశాఖపట్నంలో శ్రీకారం చుడుతున్నాయి. ఇక్కడి పర్యాటక శాఖ అధికారులు ‘మాకు ఏమీ తెలియదు. అంతా అమరావతి అధికారులే చేస్తున్నారు’ అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శించే తెన్నేటి పార్కును ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు, దాంతో సొమ్ము చేసుకోవడానికి యత్నిస్తున్నారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారానికి రాష్ట్ర ప్రభుత్వమే వెన్నుదన్నుగా ఉండడం గమనార్హం. 


ఇదీ కథ

బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవీ మా అనే నౌక రెండేళ్ల క్రితం తుఫాన్‌ గాలులకు విశాఖపట్నం పోర్టు అవుటర్‌ హార్బర్‌ నుంచి సుమారుగా ఎనిమిది కి.మీ. దూరం కొట్టుకువచ్చి తెన్నేటి పార్కు సమీపాన రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. దానిని తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు యాజమాన్యం చేసిన ప్రయత్నం విఫలమైంది. అక్కడి నుంచి కదల్చలేమని తేటతెల్లమైంది. అంతర్జాతీయ మేరిటైమ్‌ నిబంధనల ప్రకారం ఇలాంటి వాటిని శిథిల నౌకలుగా ప్రకటించి, తుక్కుకు విక్రయించి, అక్కడి నుంచి తొలగించాలి. అలాగే వదిలేస్తే...సముద్ర పర్యావరణానికి హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఈ నౌకను తీసుకొని ‘ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌’గా మార్చాలని భావించింది. ఆ మేరకు సంప్రతింపులు చేసింది. నౌక యజమాని దానిని శిథిల నౌకలను కొనుగోలు చేసే గిల్‌మెరైన్‌ సంస్థకు అమ్మేశారు. వారి నుంచి కొనడానికి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్చలు జరిపింది. రూ.1.25 కోట్లకు నౌకను కొని, రూ.10.5 కోట్లతో ఆ ప్రాంతమంతా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆ తరువాత ఏమనుకుందో పక్కకు తప్పుకుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టును గిల్‌మెరైన్‌ సంస్థకే అప్పగించి, వారికి అవసరమైన అనుమతులు, ఇతర భూములు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


నిబంధనల ఉల్లంఘన

- ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ అంటే...నీటిపై తేలియాడేది అని అర్థం. ప్రపంచంలో ఇలాంటి రెస్టారెంట్లన్నీ సముద్రంలో, నదుల్లో కదిలే నౌకలపై మాత్రమే ఉన్నాయి. తీరాన చిక్కుకుపోయి, ఎటూ కదలలేని స్థితిలో ఉన్న నౌకలో పెట్టే రెస్టారెంట్‌ను ‘ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌’గా పరిగణించకూడదు.

- విశాఖపట్నం పోర్టు చేసిన సర్వే ప్రకారం ఇది శిథిలమైన నౌక. అక్కడి నుంచి  దానిని తొలగించాల్సిన అవసరం ఉంది. కానీ పోర్టు అధికారులు కూడా ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.  

- రాళ్ల మధ్య చిక్కుకుపోయిన నౌక తీరం వైపు ఒరిగిపోయి ఉంది. దానిని గొలుసులతో కదలకుండా కట్టారు. బలమైన తుఫాన్లు వస్తే...ఏమవుతుందో తెలియదు. ఎటువంటి ప్రమాదం జరగక ముందే దానిని అక్కడి నుంచి తొలగించాలి. కానీ ఆ విషయాలేవీ పట్టించుకోకుండా నౌకను పర్యాటకంగా ఎలా మార్చాలి? ఎలా డబ్బు చేసుకోవాలి? అనే అంశంపైనే పర్యాటక శాఖ దృష్టిపెట్టింది.


తెన్నేటి పార్కుకు ఎసరు

ఈ నౌకను చేరుకోవడానికి జోడుగుళ్లపాలెం బీచ్‌, తెన్నేటి పార్కు, జీవీఎంసీ శ్మశానం పక్క నుంచి మార్గాలు ఉన్నాయి. అటవీ శాఖ భూమి (జోడుగుళ్లపాలెం బీచ్‌ ప్రాంతం) తీసుకోవాలంటే...రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అలాగే తెన్నేటి పార్కు నుంచి అయితే వీఎంఆర్‌డీఏ, శ్మశానం దగ్గరైతే జీవీఎంసీ అనుమతులు ఇవ్వాలి. శ్మశానం పక్క నుంచి అయితే సెంటిమెంట్‌ బాగోదని తెన్నేటి పార్కును ఎంచుకున్నారు. ఏపీటీడీసీ అధికారులు వీఎండీఆర్‌ఏని సంప్రతించారు. తెన్నేటి పార్కును తమకు అప్పగిస్తే, అందులో నుంచి రాకపోకలకు మార్గం ఏర్పాటు చేసుకుంటామని లేఖ రాశారు. దానిపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని, ప్రభుత్వ నిర్ణయం కోసం అమరావతి పంపాలని యోచిస్తున్నారు. 

తెన్నేటి పార్కులో రూపాయి కూడా ఫీజు లేకుండా నగర ప్రజలను ఎన్నో ఏళ్ల నుంచి అనుమతిస్తున్నారు. ఇప్పుడు ఎంతో ఆదరణ కలిగిన ఆ పార్కును గిల్‌మెరైన్‌ సంస్థకు అప్పగిస్తే...సాధారణ ప్రజలు అటు వెళ్లడానికి వీలుండదు. అసలు శిథిలమైన నౌకను ఉపయోగించడానికి కూడా నిబంధనలు అంగీకరించవు. ఏ ధీమాతో ఈ ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖ పెద్దలు ఫైళ్లు నడుపుతున్నారో అర్థం కావడం లేదు. విశాఖపట్నంలో పర్యాటక శాఖ అఽధికారులైతే....‘మాకు ఏమీ తెలియదు. అంతా అమరావతి పెద్దలే చూసుకుంటున్నారు.’ అంటూ కబుర్లు చెబుతున్నారు. ఇక్కడ ఒక రీజనల్‌ డైరెక్టర్‌, ఒక టూరిజం జిల్లా అధికారి ఉన్నారు. వారు కూడా తమకు ఏమీ తెలియదనే అంటున్నారు. 

Updated Date - 2022-05-17T06:52:22+05:30 IST