ప్రైవేట్‌ దోపిడీ!

ABN , First Publish Date - 2022-06-25T05:36:16+05:30 IST

జిల్లాలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై అధికారుల నియంత్రణ కరువైంది. ఏటా ఫీజులు పెంచుతూ భారీగా వసూలు చేస్తున్నా కనీస చర్యలు తీసుకునే వారు లేరు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేదు.

ప్రైవేట్‌ దోపిడీ!

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజుల వసూళ్లు

పాఠశాలల్లోనే పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలు

ఫీజుల భారం మోయలేక ఉక్కిరి బిక్కిరవుతున్న తల్లిదండ్రులు

ఎక్కడా అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం

పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు

నిజామాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై అధికారుల నియంత్రణ కరువైంది. ఏటా ఫీజులు పెంచుతూ భారీగా వసూలు చేస్తున్నా కనీస చర్యలు తీసుకునే వారు లేరు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేదు. నామమత్రంగా తనిఖీ చేస్తూ వదిలేస్తున్నారు. గుర్తింపు లేని పాఠశాలలపైనా చర్యలు చేపట్టడం లేదు. కొన్ని పాఠశాలలకు నోటిసులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 517 ప్రైవేట్‌ పాఠశాలలు.. జిల్లా

లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు కలిపి 1770 ఉన్నాయి. వీటిలో ప్రైవేట్‌ పాఠశాలలు 517 ఉన్నాయి. కార్పొరేట్‌, ఈ ప్రైవేట్‌ విద్యాసంస్థలల్లో లక్షా 25 వేల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో కరొనా సమయంలో ఆన్‌లైన్‌ పేరిట కార్పొరేట్‌ విద్యాసంస్థలు తరగతులు నిర్వహించి భారీగా ఫీజులు వసూలు చేశారు. విద్యార్థులకు నామమాత్రం తరగతులను నిర్వహించి మొత్తం ఫీజును తీసుకున్నారు. కాగా, ప్రస్తుత విద్యాసంత్సరం మొదటినుంచే భారీగా ఫీజులను పెంచారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో ఐఐటీ ఇతర ఫౌండేషన్‌ల పేరిట తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పి సంవత్సరానికి రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంస్థలను బట్టి ఫీజులను వసూలు చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలు నెలవారీగా రూ.1500 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు ఒకేసారి 20 నుంచి 40 శాతం వరకు పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పుస్తకాలు, నోట్‌బుక్‌లు, బ్యాగులు, స్కూల్‌ డ్రెస్‌ ల పేరుమీద భారీగా వసులు చేస్తున్నారు.

అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా

జిల్లాలో కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు కొన్ని తరగతులకే అనుమతులు తీసుకుని అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ అనుమతులు లేకుండా తరగతులను కొనసాగిస్తున్నారు. 10వ తరగతిలో వేరే పాఠశాలల పేరు మీద అనుమతులు తీసుకోవడం గాని ప్రైవేట్‌ క్యాండెట్‌గా పరీక్షలు రాయించడం లాంటివి చేస్తున్నారు. ఇదంతా విద్యాశాఖధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహరంలో ప్రతి సంవత్సరం భారీగానే చేతులు మారుతున్నాయి. నగరంలో పలు చోట్ల ప్రైవేట్‌ విద్యాసంస్థలు నిర్వాహకులు గుర్తింపు లేకుండానే పాఠశాలల నిర్వహణ చేస్తున్నారు.  

కనీస సౌకర్యాలు కరువు..

తరగతి గదుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వెలుతురు, గాలితో పాటు శుభ్రత ఉండాలి. చాలా పాఠశాలల్లో రేకుల భవనాలే తరగతి గదులుగా కొనసాగుతున్నాయి. ఎలాంటి వెలుతురు ఉండడంలేదు. పిల్లలకు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్‌ లేదు. అనుమతుల సమయంలో విద్యాశాఖ చేతివాటం వల్ల విద్యార్థులకు క్రీడాసౌకర్యాలు ఎండమావిగా మారుతున్నాయి. అలాగే పాఠశాల యాజమాన్యాలు వారికి అనుకూలమైన వారిని పెట్టుకుని పేరెంట్స్‌ కమిటీల సమావేశాలను కాగితాలకే పరిమితం చేస్తున్నాయి.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు భారీగా పెంచారు..

- బాలకిషన్‌, ఆర్మూర్‌

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు బాగా పెంచారు. కరొనా తర్వాత ఖర్చులు పెరిగాయని 30 శాతం వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. వీటితోపాటు బుక్స్‌, డ్రెస్‌లకు అధి కంగా తీసుకుంటున్నారు. తమ ఇద్దరు పిల్లలకు గత సంవత్సరం కంటే 30 శాతం అధి కంగా ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ప్రైవేట్‌లో ఫీజులు ఇలా పెంచితే చదివించే పరిస్థితి లేదు.

అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం..

- దుర్గప్రసాద్‌, డీఈవో

జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు చేపడుతున్నాం. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు సంస్థలకు నోటీసులు ఇచ్చాం. కొన్ని సంస్థలపై చర్యలు చేపట్టాం, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ విద్యాసంస్థల పరిధిలో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.

ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం డీఈవో దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకముందు డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బోడ అనిల్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి ప్రైవేట్‌ పాఠశాలలు నిబంధనలు తుంగలో తొక్కుతూ ఫీజులు యథేచ్ఛగా పెంచుతున్నారని జీవో ఎంఎస్‌ 1 ప్రకారం ఎటువంటి పుస్తకాలు, యూనిఫాంలు అమ్మవద్దనే నిబంధన ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ పాఠశాల ఆవరణలోనే విక్రయాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-06-25T05:36:16+05:30 IST