పశువైద్యుల ప్రైవేటు దందా!

ABN , First Publish Date - 2022-04-26T04:30:35+05:30 IST

ఇన్నాళ్లు జిల్లా కేంద్రంలో రిమ్స్‌ వైద్యులే, ప్రైవేటు వైద్యం వైపు పరుగులు తీస్తున్న విషయం బహిరంగ రహస్యమే, కానీ కొందరులు పశువైద్యులు కూ డా మేమేమీ తక్కువ కాదంటూ పోటీ పడిమరి ప్రైవేటు వైద్యానికి తెరలేపుతూ రెండు చేతులా సంపాదనకు ఎగబడుతున్నారు.

పశువైద్యుల ప్రైవేటు దందా!
జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం

 జిల్లా కార్యాలయం ముందే మెడికల్‌ దుకాణం, క్లినిక్‌ నిర్వహణ 

ముగ్గురు వైద్యుల ఇష్టారాజ్యం, విధులకు ఎగనామం

వైద్యం కోసం సొంత క్లినిక్‌కే రెఫర్‌ 

అత్యవసర మందుల పేరిట అడ్డగోలు వసూలు  

చోద్యం చూస్తున్న జిల్లా ఉన్నతాధికారులు 

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ఇన్నాళ్లు జిల్లా కేంద్రంలో రిమ్స్‌ వైద్యులే, ప్రైవేటు వైద్యం వైపు పరుగులు తీస్తున్న విషయం బహిరంగ రహస్యమే, కానీ కొందరులు పశువైద్యులు కూ డా మేమేమీ తక్కువ కాదంటూ పోటీ పడిమరి ప్రైవేటు వైద్యానికి తెరలేపుతూ రెండు చేతులా సంపాదనకు ఎగబడుతున్నారు. పశుపోషణలో రైతులకు సలహాలు, సూచనలు అందిస్తూ వారిని ముం దుకు నడిపించాల్సిన పశువైద్యులే అడ్డదారి సంపాదనపై మోజు పడుతూ విధులకు ఎగనామం పెడుతున్నారు. జిల్లాలో 37 పశువైద్యశాలలు ఉండగా వీ టి పరిదిలో 17 మంది వైద్యులు మాత్రమే పని చే స్తున్నారు. అసలే పశుసంవర్ధక శాఖలో వైద్యుల కొ రత తీవ్రంగా వేధిస్తున్న కొందరు వైద్యులు మాత్రం ఆదనపు ఆదయం కోసం ఆరాట పడడం విమర్శలకు దారి తీస్తోంది. నోరులేని మూగజీవాలు అడగవన్న అక్కసుతో ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. అసలే వేసవి కాలం. తీవ్రమైన పశుగ్రాసం కొరత, సీజనల్‌ వ్యాధుల బారిన పడి పశువులు మృత్యువాట పడుతున్న జిల్లా అధికారులకు పట్టిం పే లేకుండా పోవడంతో తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదంతా మామూలేనట..

అదనపు సంపాదనపై కన్నేసిన ముగ్గురు పశువైద్య అధికారులు ఏకంగా జిల్లా కార్యాలయం ఎదుటే మెడికల్‌ షాపుతో పాటు క్లినిక్‌ను నిర్వహిస్తున్నా అధికారులు మాత్రం తేలికగానే తీసుకుంటున్నారు. విధులు నిర్వహించే సమయంలో సొంత క్లినిక్‌లో వైద్యులు సేవలు అందించడంపై ప్రశ్నిస్తే ఇదంతా మామూలు విషయమేనంటూ  సమాదానం ఇవ్వడం గమనార్హం. ప్రైవేటు దందాలో అర్బన్‌ ల్యాబ్‌ వైద్యుడు సతీష్‌తో పాటు తాంసి మండల వైద్యాధికారి శ్రీకాంత్‌, వాగాపూర్‌ సబ్‌సెంటర్‌ వెటర్నరి అసిస్టెంట్‌ సాయిల్‌ ఈ ముగ్గురు వైద్యులు కలిసి మెడికల్‌ షాపుతో పాటు అక్కడే క్లినిక్‌ను ప్రారంభించి పెంపుడు కుక్కలు, మేకలు, గొర్రెలు, ఇతర పశువులకు వైద్య సేవలను అందిస్తూ అదనపు సంపాదనకు ఎగబడుతున్నారన్నా ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. 

వంతుల వారీగా విధులు 

ముగ్గురు వైద్యుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు దందాను వంతుల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో ఒక రోజు మెడికల్‌, క్లినిక్‌ విధులను నిర్వహించే, మిగిలిన రెండు రోజులు మాత్రమే ప్రభుత్వ విధులకు అడపాదడపాగా హాజరు అవుతున్నట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కోసం సంప్రదిస్తే సొంత క్లినిక్‌కే రావాలంటూ ఆదేశిస్తున్నారని రైతులు చెపుతున్నారు. నిరంతరంగా వైద్య సేవలు అందించాల్సిన పశువైద్యులు విధులకు ఎగనామం పెండుతూ సొంత పనులకే పరిమితమవుతున్నారన్నా ఫిర్యా దు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న దళిత బంధు పథకం కింద ఎక్కువ మంది లబ్ధిదారులు డెయిరీ ఫాం, గొర్రెలు, మేకల యూనిట్‌లను ఎంచుకున్నారు. వీరికి సలహాలు, సూచనలు కూడా కరువవుతున్నాయి. మేలు రకమైన పశువుల ఎంపిక, పాటించాల్సిన మెళకుల గురించి అవగాహనే లేకుండా పోయిందంటున్నారు. నిరంతరం రైతులతో మమేకమై విధులు నిర్వహించాల్సిన పశువైద్యులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెళ్లు వెత్తుతున్నాయి. 

మందుల పేరిట దండుకుంటూ..

అవసరమైన మందులు ప్రభుత్వం నుంచి సరఫరా కావడం లేదంటూ మందుల కొరతను సృష్టిం చి మరీ దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పశువులు అనారోగ్య బారిన పడిన సమయంలో అత్యవసర మందులంటూ రైతులకు అంటగడుతున్నారు. పశువులపై ప్రేమతో రైతులు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదు. జిల్లాలోని అన్ని మండలాలలో పని చేస్తున్న పశువైద్యులతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ వైద్యులు తమ సొంత క్లినిక్‌కు వచ్చేలా దగ్గర చేసుకుంటున్నారు. అలాగే జిల్లా పశువైద్య శాలకు వచ్చే పశువులు, ఇతర జంతువులను సొంత క్లినిక్‌కే తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ సేవలు అందితే ఉచితంగానే నయమయ్యే జబ్బులకు రూ.వేల కొద్దీ ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అమాయక రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని అందినకాడికిదండుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 


పరిశీలించి చర్యలు తీసుకుంటాం..

- రంగారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అఽధికారి

జిల్లా కార్యాలయం ఎదుట కొందరు వైద్యులు కలిసి మెడికల్‌ షాపుతో పాటు ప్రైవేటుగా క్లినిక్‌ను నిర్వహిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం, కార్యాలయ పని వేళల్లో ప్రైవేటు క్లినిక్‌లో విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవు. ఇప్పటి వరకు వైద్యులపై పిర్యాదులు రాలేదు. అయిన పరిశీలిస్తాం. రైతులకు ఇబ్బందులు కల్గకుండా వైద్య సేవలను అందిస్తున్నాం. దళిత బందు లబ్ధిదారులకు కూడా సరైన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. 


Updated Date - 2022-04-26T04:30:35+05:30 IST