పర్మిట్లు లేకుండానే ప్రైవేటు బస్సులు!

ABN , First Publish Date - 2020-02-14T10:25:36+05:30 IST

ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు.. 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బెదరగొట్టింది గుర్తుందా? అదే జరిగితే... ఆర్టీసీ చరిత్ర

పర్మిట్లు లేకుండానే ప్రైవేటు బస్సులు!

నగరాల్లో అనుమతించేందుకు కేంద్రం యోచన

అన్ని రాష్ట్రాలకూ ముసాయిదా నోటిఫికేషన్‌

కేంద్ర నిర్ణయాన్ని నిరాకరించే యోచనలో రాష్ట్రం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు.. 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బెదరగొట్టింది గుర్తుందా? అదే జరిగితే... ఆర్టీసీ చరిత్ర క్రమేణా మసకబారేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలోని నగరాలు, పట్టణాల్లో ఎలాంటి పర్మిట్లూ లేకుండా ఏసీ లగ్జరీ బస్సులను నడుపుకొనే వీలు ప్రైవేటు వ్యక్తులకు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ.. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది. దానిపై అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఈ ప్రతిపాదనను అంగీకరించాలా వద్దా అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పర్మిట్లు లేకుండా ప్రైవేటు బస్సులను నడుపుకొనే వీలు కల్పిస్తే.. ఆర్టీసీ బస్సులపై దెబ్బ పడుతుందని భయపడుతోంది.


ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనైనా ప్రైవేటు బస్సులు రాష్ట్ర రవాణా శాఖల నుంచి ‘కాంట్రాక్టు క్యారేజీ’లుగా పర్మిట్లు పొందుతున్నాయి. టీఎస్‌ ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా సంస్థల ద్వారా నడిచే బస్సులకు మాత్రమే ప్రభుత్వాలు ‘స్టేజీ క్యారేజీ’లుగా పర్మిట్లు ఇస్తున్నాయి. కానీ నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ‘ఏసీ డీలక్స్‌ బస్సు’లను మరింత పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రైవేటు ఆపరేటర్లు ముందుకొచ్చి ఇలాంటి బస్సులను నడుపుతామంటే వారికి ‘ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్ల’ నిబంధనను విధించవద్దన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అది స్టేజీ క్యారేజీగానైనా, కాంట్రాక్టు క్యారేజీగానైనా నడవడానికి వీలు కల్పించాలని చెబుతోంది.  22 కంటే ఎక్కువ సీట్లున్న ఏసీ డీలక్స్‌ బస్సులను ఎలాంటి పర్మిట్లూ తీసుకోకుండానే నడుపుకొనే వీలు కల్పించాలనుకుంటోంది. అయితే.. ఇప్పటివరకూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యుత్తరం రాయలేదు.


రెండు రకాలుగా నష్టమే...

ప్రైవేటు ఏసీ లగ్జరీ బస్సులకు పర్మిట్లు లేకుండా నడుపుకొనే వీలు కల్పిస్తే రాష్ట్రం రెండు రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకటి.. ఆర్టీసీపరంగా నష్టం కాగా, మరొకటి రవాణా శాఖకు వచ్చే రాబడిని కోల్పోవడం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్టీసీ 130 వరకూ ఏసీ లగ్జరీ బస్సులను నడుపుతోంది. ఇటీవలే మరో 40 ఏసీ బ్యాటరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ శంషాబాద్‌ విమానాశ్రయం, ఇతర ప్రాంతాలకు వెళ్లే ఖరీదైన ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటు బస్సులు రోడ్లపైకి వస్తే ఆర్టీసీ బస్సులు మూలన పడాల్సిందే. ఇప్పటికే.. కాలం చెల్లిన 660 దాకా డొక్కు బస్సులను ఆర్టీసీ పక్కన పెట్టింది. ఏసీ బస్సులను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే హైదరాబాద్‌లో ఆర్టీసీకి మరింత నష్టమే. అంతేకాదు.. రాష్ట్ర రవాణా శాఖ వివిధ రకాల పర్మిట్ల ద్వారా వసూలు చేస్తున్న ఫీజుల రాబడి కూడా పోతుంది.


ఇదీ లెక్క..

ప్రస్తుతం రాష్ట్రంలో 4114 వరకూ ప్రైవేటు బస్సులున్నాయి. వీటిలో 1000 వరకూ ఏసీ డీలక్స్‌ బస్సులున్నాయి. వీటన్నింటికీ రవాణా శాఖ కాంట్రాక్టు క్యారేజీలుగానే పరిట్లు ఇస్తోంది. ఒక్క జిల్లాలో మాత్రమే తిరిగే ప్రైవేటు బస్సుల్లో ఒక్కో సీటుకు రూ.900, రెండు జిల్లాల పర్మిట్లకు సీటు ఒక్కింటికి రూ.1210, రాష్ట్ర పర్మిట్లకు సీటు ఒక్కంటికి రూ.2625, ఆల్‌ ఇండియా పర్మిట్లకు సీటు ఒక్కంటికి రూ.3675 చొప్పున త్రైమాసిక పన్నును వసూలు చేస్తోంది. రవాణా శాఖ రాబడిలో ఈ పద్దు కిందే ఎక్కువ వసూలవుతోంది. ప్రైవేటు ఏసీ బస్సులకు పర్మిట్ల సిస్టంను తీసేస్తే... రవాణా శాఖ ఈ ఆదాయాన్ని కోల్పోక తప్పదు. పైగా పర్మిట్ల విధానం లేకపోతే ప్రైవేటు బస్సులపై ప్రభుత్వ నియంత్రణ అనేది ఉండదు. ఇష్టమొచ్చినట్లు నడుపుతుంటారు. చార్జీలను కూడా ఇష్టానుసారంగా పెంచి వసూలు చేస్తారన్న అభిప్రాయాలున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర నిర్ణయాన్ని తిరస్కరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.


నిర్ణయం తీసుకోలేదు

ప్రైవేటు ఏసీ బస్సులకు పర్మిట్ల విధానాన్ని రద్దు చేయాలన్న కేంద్ర నోటిఫికేషన్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని గురించి రవాణా మంత్రికి, ముఖ్యకార్యదర్శికి వివరించాం.  పర్మిట్ల విధానాన్ని రద్దు చేస్తే రాష్ట్రానికి రాబడి తగ్గుతుంది. ఇది ఆర్టీసీకీ గండమే.

రమేష్‌, జేటీసీ

Updated Date - 2020-02-14T10:25:36+05:30 IST