ఆర్టీసీ నైనై... ప్రైవేట్‌ రైరై

ABN , First Publish Date - 2020-10-19T07:16:50+05:30 IST

దసరా పండుగ ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలకు వరంగా మారుతోంది. కరోనా నష్టాలను డబుల్‌ ఢమాకాతో భర్తీ చేసుకునే అవకాశం వారికి లభించింది. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఆర్టీసీ హైదరాబాద్‌ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

ఆర్టీసీ నైనై... ప్రైవేట్‌ రైరై
ప్రైవేటు బస్సు

  • జిల్లా నుంచి 150కి పైగా నడుస్తున్న ట్రావెల్‌ బస్సులు  
  • దసరా పండగ వేళ ‘డబుల్‌ బొనాంజా’
  • రద్దీని బట్టి డబ్బులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు 
  • డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

దసరా పండుగ ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలకు వరంగా మారుతోంది. కరోనా నష్టాలను డబుల్‌ ఢమాకాతో భర్తీ చేసుకునే అవకాశం వారికి లభించింది. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఆర్టీసీ హైదరాబాద్‌ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రోజురోజుకూ నష్టాలు పెరిగిపోతున్నప్పటికీ ఉభయ రాషా్ట్రల ప్రభుత్వాలు మౌనం వహించడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెల చివరి వారం నుంచి ముఖ్యంగా ఏపీ నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. హైదరాబాద్‌కు అత్యధికంగా ఆర్టీసీ, ప్రైవేటు సర్వీసులు జిల్లా నుంచి అను నిత్యం 125 నుంచి 150 వరకు నడిచేవి. దసరా, సంక్రాంతి సీజన్లలో ఈ సంఖ్య రెట్టింపుపైనే ఉండేది. అయితే గత ఏడు నెలలుగా జిల్లాకు చెందిన బస్సులు తెలంగాణలో అడుగుపెట్టలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఉదాహరణకు కోనసీమ కేంద్రమైన అమలాపురం డిపో నుంచి ప్రతిరోజు పదహారుకు పైగా బస్సు  సర్వీసులు హైదరాబాద్‌ వెళ్లేవి. అదే దసరా సీజనలో అయితే అప్‌ అండ్‌ డౌనలో 90 సర్వీసుల వరకు నడిచేవని డిపో మేనేజర్‌ టీవీఎస్‌ సుధాకర్‌ చెప్పారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం మాత్రమే అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నామని, ప్రభుత్వ అనుమతి లేని కారణంగా తెలంగాణకు సర్వీసులు నడపడం లేదని చెప్పారు. పూర్తిగా బస్సుల రవాణాపైనే కోనసీమవాసులు ఆధారపడతారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో హైదరాబాద్‌కు వ్యాపార, ఉద్యోగ, విద్య, వైద్యం, ఇతర పనుల నిమిత్తం నిత్యం వేల సంఖ్యలోనే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. రైళ్ల సదుపాయం కూడా పెద్దగా లేకపోవడంతో ఇప్పుడు ప్రయాణికులంతా ప్రైవేటు బస్సుల్లోనే వెళ్తున్నారు. సాధారణ ట్రావెల్స్‌కు రూ.1,200, స్లీపర్‌ కోచ అయితే రూ.2వేలు పైనే పలుకుతోంది. అయినా సరే వాటికి మంచి డిమాండు ఉంది. కరోనా కష్టాలను ప్రత్యక్షంగా చవిచూసిన ‘ప్రైవేట్‌’ యాజమాన్యాలు ఇప్పుడు ఇరు ప్రభుత్వాలు ఇచ్చిన పరోక్ష సహకారంతో సొమ్ములు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ సిబ్బంది మాత్రం ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-10-19T07:16:50+05:30 IST