ప్రైవేట్‌ బస్సు బోల్తా

ABN , First Publish Date - 2021-04-12T04:52:48+05:30 IST

వారంతా వలస కార్మికులు. స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో స్వగ్రామాలకు చేరుకుంటారనగా.. డ్రైవర్‌ నిద్ర మత్తు ప్రమాదానికి దారి తీసింది. బస్సు బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రైవేట్‌ బస్సు బోల్తా
పెద్దినాయుడుపేట వద్ద బోల్తాపడిన బస్సు

ఎనిమిది మందికి గాయాలు

నందిగాం మండలం పెద్దినాయుడుపేట వద్ద ఘటన

క్షతగాత్రులంతా పశ్చిమ బెంగాళ్‌, ఒడిశా వాసులు

నందిగాం, ఏప్రిల్‌ 11: వారంతా వలస కార్మికులు. స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో స్వగ్రామాలకు చేరుకుంటారనగా.. డ్రైవర్‌ నిద్ర మత్తు ప్రమాదానికి దారి తీసింది. బస్సు బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నందిగాం మండలంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిగాం మండలం పెద్దినాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒడిశా, పశ్చిమ బెంగాళ్‌కు చెందిన 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు శనివారం పశ్చిమబెంగాళ్‌కు చెందిన 35మంది కేరళలో, ఒడిశాకు చెందిన 14మంది తమిళనాడులో ఈ ప్రైవేటు బస్సులో బయలుదేరారు. ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పెద్దినాయుడుపేటకు వచ్చేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళన చెందారు. ఈ ఘటనలో పశ్చిమబెంగాళ్‌ రాష్ట్రం ముషీరాబాద్‌ జిల్లాకు చెందిన సుధీర్‌ మండల్‌, అముల్‌ చౌదరి, దిలీప్‌ మండా, ప్రశాంత్‌ మండా, విభూషన్‌ మండా, మనోజల్‌ మండల్‌, దిలీప్‌ మండల్‌తో ఒడిశాకు చెందిన సమరసింగ్‌ గాయపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్తు బోల్తా పడిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో పెద్దినాయుడుపేటతో పాటు కొత్తగ్రహారం, పెద్దబాణాపురం తదితర గ్రామాలకు చెందిన పలువురు ఏమైందోనన్న ఆందోళనతో సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. క్షతగాత్రులను వజ్రపుకొత్తూరు, పలాస 108 అంబులెన్స్‌లతో పాటు హైవే అంబులెన్స్‌ ద్వారా పలాస సామాజిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్‌ సీఐ డి.రాము సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సపర్యలు చేశారు. బోల్తాపడిన బస్సును ప్రొక్లెయినర్‌  సహాయంతో సరిచేశారు. అముల్‌ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఏఎస్‌ఐ మురళీకృష్ణ ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన వారంతా స్వగ్రామాలకు వెళ్లేందుకు మరో వాహనం కోసం సాయంత్రం వరకూ వేచిచూశారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుకుంటామనగా.. ఊహించని ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. 


క్షతగాత్రులకు డీఎస్పీ పరామర్శ

పలాస : పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి పరామర్శించారు. ముందుగా బస్సు బోల్తా పడిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వద్దకు చేరుకున్నారు. భాషా సమస్య వల్ల క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి బెంగాళి మాట్లాడేవారికి రప్పించి వారి నుంచి వివరాలు సేకరించారు. వారు ఉదయం నుంచీ ఆకలితో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించి  అల్ఫాహారం అందజేశారు. మధ్యాహ్నం  భోజన సౌకర్యం  కల్పించాలని సీఐ రాముకు డీఎస్పీ ఆదేశించారు. 

  


Updated Date - 2021-04-12T04:52:48+05:30 IST