ప్రైవేటు బస్సు ఆపరేటర్ల పండగ దందా!

ABN , First Publish Date - 2021-01-12T06:47:27+05:30 IST

సంక్రాంతి పండగ రద్దీని ప్రైవేటు బస్‌ ఆపరేటర్లు ఎన్‌‘క్యాష్‌’ చేసుకునే పని ప్రారంభించారు.

ప్రైవేటు బస్సు ఆపరేటర్ల పండగ దందా!

ఉత్తరాంధ్ర డిమాండ్‌ను ఎన్‌‘క్యాష్‌’ చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు 

విశాఖపట్నం నాన్‌ ఏసీ రూ.1000

ఏసీ రూ.1500, స్లీపర్‌ రూ.2000 

చేతులెత్తేసిన రవాణా శాఖ


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

సంక్రాంతి పండగ రద్దీని ప్రైవేటు బస్‌ ఆపరేటర్లు ఎన్‌‘క్యాష్‌’ చేసుకునే పని ప్రారంభించారు. వారం రోజులుగా పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పండగ దందాకు తెర తీశారు. ఉత్తరాంధ్రకు పోటెత్తుతున్న ప్రయాణాలను చూసి ప్రైవేటు ఆపరేటర్లు ఒక్కసారిగా రేట్లను పెంచేశారు. విశాఖపట్నం రూట్‌లో నాన్‌ ఏసీ బస్సులో రూ. 1000, ఏసీ బస్సులో రూ. 1500, స్లీపర్‌ బస్సులో రూ.2000 చొప్పున ప్రైవేటు ఆపరేటర్లు చార్జీ వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌లో కూడా కొన్ని సంస్థలు చార్జీలను పెంచి చూపిస్తున్నాయి. మాన్యువల్‌గా టిక్కెట్లు ఇచ్చే ప్రైవేటు ఆపరేటర్లు కొందరు టిక్కెట్‌ మీద అధిక ధరలను రాస్తుండగా, మరికొందరు టిక్కెట్ల మీద సాధారణ చార్జీలు చూపిస్తూ.. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా రవాణా శాఖ అధికారులకు స్పందించకపోవటం గమనార్హం. ప్రతి సంవత్సరం ప్రైవేటు ట్రావెల్స్‌ దందాపై దాడులు చేసే రవాణా శాఖ అధికారులు ఈసారి ఎందుకో వదిలేశారు. 


ఉత్తరాంధ్ర రూట్‌లో విశాఖపట్నం వరకు ప్రైవేటు ఆపరేటర్ల మోనోపలీ ఎక్కువగా నడుస్తోంది. హైదరాబాద్‌కు ఆదరణ అంతగా లేకపోవటంతో.. ఆ బస్సులను కూడా విశాఖపట్నం నడుపుతున్నారు. ఆర్టీసీ ఇప్పటికే ఉత్తరాంధ్ర రూట్‌లో బస్సులను నడుపుతోంది. ఉన్నత వర్గాలు ప్రైవేటు బస్సులనే ఆదరిస్తుండడంతో ఆపరేటర్లు చార్జీలను పెంచేశారు. మరీ ఇంత కాకపోయినా ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల్లో కూడా అధిక చార్జీలను వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సుల్లో టిక్కెట్‌ 534 కాగా, స్పెషల్‌ బస్సులో రూ.730 వసూలు చేస్తున్నారు. ఏసీ బస్సుల్లో రూ.700 చార్జీ కాగా, రూ.1000 స్పెషల్‌ చార్జీని వసూలు చేస్తున్నారు.  

Updated Date - 2021-01-12T06:47:27+05:30 IST