అమ్మో.. ఫీజులు!

ABN , First Publish Date - 2022-06-17T04:57:58+05:30 IST

రెండేళ్లపాటు కరోనాతో బడులన్నీ నడిచి నడవనట్టుగా కొనసాగాయి.

అమ్మో.. ఫీజులు!

  • ఫీజుల పేరిట దోచుకుంటున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు 
  • 20నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచేసిన ప్రైవేట్‌ స్కూళ్లు
  • డొనేషన్లు, యూనిఫాం, బుక్స్‌ పేరిట దండుకుంటున్న యాజమాన్యం
  • ఫీజుల నియంత్రణపై సర్కారు సైలెంట్‌.. 
  • ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
  • కార్పొరేట్‌ మాఫియా చేతుల్లో ప్రైవేట్‌ విద్య
  • చితికిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు 


రెండేళ్లపాటు కరోనాతో బడులన్నీ నడిచి నడవనట్టుగా కొనసాగాయి. ఎక్కువ శాతం విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే పాఠాలు విన్నారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో రెండేళ్ల తర్వాత విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. ఇదే మంచి తరుణమని ప్రైవేట్‌ విద్యాసంస్థలు నష్టాలను పూడ్చుకునేందుకు విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్నాయి.  అడ్డగోలుగా ఫీజులు పెంచి దోపిడీకి తెరలేపాయి. డబ్బే ధ్యేయంగా విద్యా విలువలను తుంగలోకి తొక్కుతూ తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. 


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 16 : బడిగంటలు మోగటంతో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌ యాజమాన్యం ఫీజుల పేరిట అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. డబ్బే ధ్యేయంగా విద్యా విలువలను తుంగలోకి తోస్తూ తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఏటా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు పెంచుతూ పోవడంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. రెండేళ్లపాటు కరోనాతో బడులన్నీ నడిచి నడవనట్టుగా కొనసాగాయి. ఆన్‌లైన్‌ తరగతులకే తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో రెండేళ్లుగా వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు విద్యార్థులపై భారం మోపుతున్నాయి. 2022-23 సంవత్సరానికి సంబంధించి ఫీజులు ఇష్టానుసారంగా పెంచేశాయి. కొన్ని స్కూళ్లు ఏకంగా 20 నుంచి 50 శాతం వరకు పెంచి వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లు ఫస్ట్‌ టర్మ్‌ ఫీజులు వసూలు చేయగా, మరికొన్ని స్కూళ్లు ఇంటర్నేషనల్‌, టెక్నో, ఐఐటీ, ఒలంపియాడ్‌ అంటూ చివర్లో తోకపేర్లు తగిలించుకుని ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నాయి. ఏటేటా విద్యా ఖర్చు మోతెక్కిపోతుంది. ఫీజులతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, బుక్స్‌బ్యాగ్‌, క్యారేజీ బ్యాగ్‌, బూట్లు, యూనిఫామ్‌, బస్సు రవాణాకు చెల్లించాల్సిన సొమ్ము అదనం. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల క్రమబద్ధీకరణకు గతంలో ఓ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలోకి తీసుకురాలేదు. సర్కారు బడులు పిల్లల తల్లిదండ్రులను ఆకర్షించకపోవడతో సామాన్యులు సైతం ప్రైవేట్‌ స్కూళ్లవైపే మొగ్గుచూపుతున్నారు. మారిన సామాజిక పరిస్థితుల్లో అప్పు చేసైనా తమ పిల్లలకు మంచి విద్య అందించాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచేశాయి. ఒకప్పుడు ఎల్‌కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ. 3 వేలు ఫీజు ఉంటే ప్రస్తుతం 13 వేలకుపైగా గుంజుతున్నారు. టెక్నో, ఇ-టెక్నో, ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులకు కూడా కలిపి ఫీజులు చెబితే కళ్లు తిరగాల్సిందే. ప్రాథమిక విద్యకే సాధారణంగా ఒక్కో విద్యార్థికి ఏటా సుమారు రూ.25 వేలు వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లలో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ. 70 వేల నుంచి రూ. లక్ష మధ్యలో వసూళ్లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఫీజుల నియంత్రణపై స్పష్టత లేకుండా పోయింది. ఎంత వసూలు చేయాలో? లేదో అనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్‌ అసోసియేషన్స్‌, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.


అడ్డగోలుగా బిల్లులు

యూనిఫామ్స్‌, బుక్స్‌, నోట్‌ పుస్తకాలకు ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వేస్తున్నారు. ఇవన్నీ తమ వద్దనే కొనాలని హుకూం జారీ చేస్తున్నాయి. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా చాలావరకు కార్పొరేట్‌ స్కూళ్లు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలను కాకుండా వారు రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారా బోధన చేస్తున్నారు. వాటిని తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారు. మరికొన్నిచోట్ల నోటుపుస్తకాలు, యూనిఫాం తమ వద్దనే కొనాలని ఆదేశిస్తూ చివరకు ఫీజుకట్టడం తప్పనిసరి చేస్తున్నాయి. 


రవాణా మరింత భారం

డీజిల్‌ ధరలు పెరిగాయంటూ రవాణా ఫీజులను పాఠశాలలు పెంచేశాయి. గతంలో 5 కిలో మీటర్ల పరిధిలో రూ.15 వేలు వసూలు చేయగా ఇప్పుడు ఏకంగా రూ. 20-25 వేలకు పెంచాయి. పాఠశాలలు సొం తంగా నిర్వహించే రవాణాతోపాటు ప్రైవేట్‌ వాహనదారులు ఫీజులు అధికంగా తీసుకుంటున్నారు. పిల్లల ఫీజులకు తోడు రవాణా ఫీజుల భారంతో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. 


ఫీజులు తగ్గించకపోతే ఆందోళన తప్పదు

ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు ప్రతీఏడాది ఫీజులు పెంచుతు న్నాయి. దీంతో తమ పిల్లలను బాగా చదివించాలన్న తల్లిదండ్రులకు ఫీజుల చెల్లింపుల్లో తిప్పలు తప్పడం లేదు. ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జీవో నెంబర్‌-1, సెక్షన్‌ 11 ప్రకారం ప్రభుత్వం గవర్నింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ నిర్ణయించిన ఫీజులు వసూలు చేయాలి. కానీ.. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని, దోపిడీని అరికట్టాలి. లేదంటే పోరాటం తప్పదు. 

- శంకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి 


ఫీజుల పెరుగుదలతో ఇబ్బందులు

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కరోనాతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయాం. పాఠశాలల యాజమాన్యాలు మళ్లీ 20-40 శాతం ఫీజులు పెంచడంతో మోయలేని భారం పడింది. ఇద్దరు పిల్లలను చదివించేందుకు రూ.70 వేలకుపైగా ఖర్చు అవుతుంది. ఏడు, ఎనిమిదో తరగతికి ఇంత ఫీజు ఉంటే.. పదో తరగతి వరకు చదివిస్తానో లేదో తెలియడం లేదు. ప్రభుత్వం స్పందించి ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలి. 

- జగదీశ్వర్‌గౌడ్‌, నిర్ధవెల్లి గ్రామం, కేశంపేట మండలం


ఫీజులు చెల్లించడంలో అవస్థలు తప్పడం లేదు

ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రతీ యేడాది ఫీజులు పెంచుతున్నాయి. అయితే ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటుందని, ఇంగ్లీష్‌ బాగా రావాలని, మా పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలకు పంపిస్తున్నాం. ఈ క్రమంలో ప్రతీ యేటా ఫీజులు పెంచుతున్నారు. ఫీజుల మోత భరించలేక పోతున్నాము. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- నక్క ఆంజనేయులు, కొత్తపేట, కేశంపేట మండలం 


2022-23 ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు (రూ.)

(ఈసారి 20-50 శాతం పెంచారు)

తరగతి సాధారణ ప్రైవేట్‌ కార్పొరేట్‌ 

పాఠశాలలో స్కూల్‌లో

నర్సరీ 13,000 70,000

ఎల్‌కేజీ 14,000 70,000

యూకేజీ 16,000 70,000

ఒకటి 18,000 85,000

రెండు 20,000 85,000

మూడు 22,000 85,000

నాలుగు 24,000 90,000

ఐదు 26,000 90,000

ఆరు 28,000 90,000

ఏడు 30,000 95,000

ఎనిమిది 32,000 95,000

తొమ్మిది 34,000 95,000

పది 36,000 95,000

Updated Date - 2022-06-17T04:57:58+05:30 IST