Abn logo
Mar 4 2021 @ 00:37AM

బ్యురోక్రసీకి ప్రైవేటు ప్రత్యామ్నాయం

ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించవలసిన అవసరం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి లోక్‌సభలో వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు ఇప్పుడు బ్యూరోక్రాట్ల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్‌లో మాట్లాడుతూ ప్రధాని ‘‘ప్రతి విషయాన్ని ఐఎఎస్‌లకే అప్పగించడం గొప్ప అలవాటుగా మారిపోయింది, ఐఎఎస్‌ లేమైనా సర్వరోగ నివారిణి లాంటివారా?!’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ ప్రధాని మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐఎఎస్‌ అధికారులను కలవరపాటుకు గురిచేశాయి. ఎక్కడ ఇద్దరు అధికారులు కలుసుకున్నా, వాట్సాప్‌ గ్రూపులలోనూ దీని గురించే చర్చ నడుస్తోంది.


ప్రధాని చేసిన వ్యాఖ్యలలో అతిశయోక్తి గానీ అసత్యం గానీ లేదనేది వాస్తవం. లిబరలైజేషన్‌–ప్రైవేటైజేషన్‌–గ్లోబలైజేషన్‌ మొదలైన 1991 నుంచి దేశంలోని అత్యున్నత మేధో వర్గానికి చెందిన విద్యార్థులు సివిల్‌ సర్వీసులకు దూరం జరుగుతూ వస్తున్నారు. ప్రైవేటు రంగం అందించే విదేశీ ఉద్యోగాలు, వేతనాలు, సౌకర్యాలు అలాంటివి మరి. ఇక కేవలం ఐఎఎస్‌ మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో చదివి సులువుగా ఉద్యోగం సాధించే సాధారణ గ్రాడ్యుయేట్లు ఈ మధ్య పెరుగుతున్నారు. అంటే వారు అంతకుముందు ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌/ సిఏ వంటి అకడమిక్‌ పరీక్షలను ఎదుర్కొని ఉండరు. కేవలం సివిల్‌ సర్వీసుల పరీక్షల కోసం చదువుకొని చాయిస్‌ సహాయంతో తాము చదివిన లిమిటెడ్‌ సిలబస్‌తో గట్టెక్కగలిగారు. ఎలాగూ యుపిఎస్సీ వారు తక్కువ వయస్సు వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.


ఇలాంటి ఐఎఎస్‌ అధికారులను పబ్లిక్‌ రంగ సంస్థలకు, ఆర్థిక సంస్థలకు, పరిశ్రమలకు అధిపతులుగా నియమించడం వలన ప్రొఫెషనలిజం కొరవడుతోంది. ఆయా సంస్థలకు సంబంధించిన అనుభవం, వ్యాపార మెళకువలు వీరికి ఏమాత్రం లేకపోవడం వలన వందలాది పిఎస్‌యులు దేశవ్యాప్తంగా ఇప్పటికే మూతబడడం లేదా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడడం గమనిస్తూనే ఉన్నాం. అదే మాటను మోదీ కాస్త కటువుగానే చెప్పారు. ‘‘బాబులు (ఐఎఎస్‌లను హిందీవారు ఆవిధంగా అంటారు) ఏమాత్రం దేశ పౌరులో.. ప్రైవేటు రంగంలో పనిచేసే నిపుణులు కూడా అంతకు తీసిపోని ఈ దేశ పౌరులే’’ అని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ నేపథ్యంలో నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్న చందాన ఉన్న ప్రభుత్వరంగ సంస్థల అజమాయిషీ కోసం ప్రైవేటురంగ నిపుణులను lateral entry ద్వారా ఆహ్వానించే అవకాశం ఉంది. 1991కి ముందు ఉద్యోగార్థులు కేవలం ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల మీద మాత్రమే ఆధారపడుతూ ఉండేవారు. కానీ ప్రైవేటీకరణ/ సరళీకరణ/ ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగాల శాతం, వేతనాల రేట్లు, విదేశీ ఉద్యోగాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. కాబట్టి ప్రైవేటీకరణను మరింత వేగవంతంగా, ఎక్కువగా అమలుచేయడం వలన ప్రజలకు మేలు జరగబోతోంది గానీ ఎలాంటి కీడును శంకించవలసిన అవసరం లేదు.


త్రాగునీరు, పరిశుభ్రత లాంటి సాధారణ అంశాల్లో కూడా మన బ్యూరోక్రసీ విఫలమయిందన్నది కఠోర వాస్తవం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ మంచినీరు అందించడం, లెట్రిన్లు కట్టించడం వంటివి ప్రభుత్వాల ప్రధాన ఎజెండాగా ఉండడమే దీనికి నిదర్శనం. రాజకీయ నాయకులు అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం వల్లనే అధికారులు విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నారనే అపోహలో చాలామంది ఉంటారు. కానీ రాజకీయ నాయకులు, మంత్రులు వారికి మంచి పేరు వచ్చే అవకాశం ఉన్న అంశాలలో మాత్రమే వేలు పెడతారు. అంతేతప్ప, ఏదన్నా జిల్లా కలెక్టర్‌ ప్రతి ఊరికీ, ప్రతి స్కూల్‌కూ తాగేనీరు, లెట్రిన్‌ ఏర్పాటు చేసే దిశలో నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటే ఆటంకం కలిగించరు. 


దేశ సాంఘిక విషయాల్లో మార్పుకు దోహదం చేయాల్సిన ఐఎఎస్‌ అధికారులు ఆ విషయంలో నిర్ద్వంద్వంగా విఫలమయ్యారని చెప్పక తప్పదు. కులమతాలకతీతంగా పని చేయవలసిన వారు కులాల గొడుగులతో, మతాల సెంటిమెంట్లలో మునిగిపోతున్నారు. కట్నాల నిషేధిత చట్టాలను అమలుచేయవలసిన వారే నిస్సిగ్గుగా తాము ఎంత కట్నం తీసుకున్నారో స్నేహితులతో చర్చిస్తున్నారు. మరీ విస్తుగొలిపే విషయమేమిటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 ప్రకారం అస్పృశ్యత నివారణ చేయవలసినవారే అంటరానితనమనేదే లేదన్నట్లుగా, తెలియదన్నట్లుగా వ్యవహరించడం. విపరీతమైన అధికారాలు కలిగి, లక్షలాదిమంది జీవితాల్లో వెలుగు నింపవలసిన వారే చిన్న చిన్న అవసరం లేని పనులు చేస్తూ నిరంతరం సోషల్‌ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం రివాజుగా మారింది. అంతా సవ్యంగా జరిగితే తన గొప్ప, విఫలమయితే కిందివారి మీద, పక్కవారి మీద తోయడం పరిపాటి అయింది. 


ఒక్కసారి పరీక్ష పాసయితే చాలు మనదే రాజ్యం అన్న చందంగా వ్యవహరిస్తూ తోటి సర్వీసు అధికారులను కూడా నిస్సంకోచంగా అణచివేస్తున్న ఈ సర్వీసు అధికారుల తీరును గమనించి బేరీజు వేసిన మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా ఐఎఎస్‌లతో పాటు యుపిఎస్‌సి ద్వారా సెలెక్ట్‌ అయిన అన్ని రకాల అధికారులకు జాయింట్‌ సెక్రటరీ అయ్యే అవకాశం కల్పించింది. రాబోయే సంవత్సరాల్లో వీరిలో కొంతమంది ఆయా శాఖల సెక్రటరీలుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. తద్వారా ఆయా అధికారుల మధ్య సమున్నత పోటీ పెరిగి ప్రజలకు చక్కని పాలన ఫలాలు అందే అవకాశం ఉంది. ఎప్పటికీ సెక్రటరీ అవ్వలేమేమో అన్న నిరాశలో ఉన్న ఇతర సర్వీసుల అధికారులకు ఇది ఆశాకిరణం.


ఇప్పటికే శాస్త్రవేత్తలు నిపుణులు, సెక్రటరీలుగా ఉన్న ఆటమిక్‌ ఎనర్జీ, స్పేస్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్లు చక్కని ఫలితాలనిస్తున్నాయి. విదేశాంగ విధానాన్ని కనుసొంపుగా తయారుచేసి అమలుచేస్తున్నారు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు. విదేశాంగ శాఖకు ఐఎఫ్‌ఎస్‌ అధికారులే కార్యదర్శులుగా ఉండడం గమనార్హం. గతంలో రక్షణ కార్యదర్శికి ఉన్న విపరీతమైన అధికారాలకు కట్టడి వేస్తూ మోదీ ప్రభుత్వం చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌కు విశేష అధికారాలను కట్టబెట్టింది. ఆర్థిక శాఖను కూడా ఆ రంగంలో నిపుణత సాధించిన ఐఆర్‌ఎస్‌ అధికారులు తామే స్వయంగా నిర్వహించుకోవాలని ఎన్నో ఏళ్ళుగా ఉవ్విళ్ళూరుతున్నారు. అన్ని శాఖలకు నిధులను సమన్వయం చేస్తూ విశేష ప్రాధాన్యత కలిగి ప్రత్యేక జ్ఞానం కావలసిన ఆర్థిక/ రెవెన్యూ శాఖలను ఇండియన్‌ రెవెన్యూ అధికారులకే అప్పగించడం ఉత్తమం. అటవీ, పర్యావరణ శాఖలను కూడా ఆయా రంగాల్లో విశేష అనుభవమున్న ఐఎఫ్‌ఓఎస్‌ అధికారులనే శాఖాధిపతులుగా చేయడం వలన ఆయా శాఖల్లో ఉత్తమ ఫలితాలను చవిచూడవచ్చు.


ఇప్పటికే యుపిఎస్సీ, నీతి ఆయోగ్‌ లాంటి సంస్థల్లో ఆయా రంగాల నిపుణులు, ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. ఆయా రంగ నిపుణులను ఐఐఎం నుంచి పాసయి ఆయా పరిశ్రమల్లో, విదేశాల్లో నిపుణులుగా విశేష అనుభవం గడించిన వారిని పరిశ్రమలు, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో సలహాదారులుగా, సమన్వయకర్తలుగా నియమించి వారి అనుభవం, జ్ఞానం దేశానికి ఉపకరించేలా చూడాలి. Lateral entry ద్వారా ప్రభుత్వం అధికార వర్గంలో ప్రవేశించినవారు అద్భుతాలు సృష్టిస్తారని చెప్పడానికి టెలికాం రంగంలో విశేష సంస్కరణలకు ఆద్యుడైన శ్యామ్‌ పిట్రోడా ప్రబలమైన ఉదాహరణ. పైపైకి సులువుగా తేలిగ్గా కనబడుతున్న ప్రభుత్వ వ్యవస్థలో బయట నుంచి వచ్చి చేరినవారు కుదురుకోవడం అంత ఆషామాషీ కాదు. ఆర్‌బిఐలో lateral entry ద్వారా ప్రవేశించి టర్మ్‌ పూర్తవ్వకుండానే బయటకు వెళ్ళిన ఊర్జిత్ పటేల్‌, విరళ్ ఆచార్యలే దీనికి ఉదాహరణ. కాబట్టి lateral entry ద్వారా తమ అవకాశాలకు గండికొడుతున్నారని ఐఎఎస్‌లు గుర్రుగా ఉండడం అనవసరం.


మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖలు, సర్వీసుల మధ్య డిప్యుటేషన్‌లను ప్రోత్సహిస్తుండడం ముదావహం. చాలాకాలం నుంచి పనిచేస్తున్న శాఖలో బోర్‌ కొట్టి, మార్పు కోరుకుంటున్న వారికి డెప్యుటేషన్‌ ఒక మంచి అవకాశం. దీని వల్ల నూతన శాఖలో అత్యంత ఉత్సాహంతో పనిచేసే అవకాశం కలుగుతుంది. రాబోయే సంవత్సరాల్లో బ్యూరోక్రసీలో విపరీతమైన మార్పులను చూడబోతున్నాం. ముఖ్యంగా ఐఎఎస్‌ అధికారుల ఏకఛత్రాధిపత్యానికి క్రమేణా తెరపడనున్నదనేది కాలగమన పరిస్థితులను బట్టి ఎవరికయినా అర్థమవుతుంది. ప్రైవేట్‌ రంగానికి కూడా అవకాశాలు విపరీతంగా పెరగనున్నాయని ప్రధాని చెప్పకనే చెప్పారు.

నేలపట్ల అశోక్‌ బాబు (ఐఆర్‌ఎస్‌)

Advertisement
Advertisement
Advertisement