Prithvi Shaw: టీమిండియాలో దక్కని చోటు.. బీసీసీఐ, సెలక్టర్లపై విమర్శలు!

ABN , First Publish Date - 2022-10-04T02:33:23+05:30 IST

సౌతాఫ్రికాతో ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై

Prithvi Shaw: టీమిండియాలో దక్కని చోటు.. బీసీసీఐ, సెలక్టర్లపై విమర్శలు!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీషా(Prithvi Shaw) తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. తన అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు. బీసీసీఐ, సెలక్టర్లను ఉద్దేశించి చేసి చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి. దక్షిణాఫ్రికా కోసం ప్రకటించిన 16 మంది జట్టులో పృథ్వీషా(Prithvi Shaw) పేరు కనిపించలేదు. రజత్ పటీదార్, ముకేశ్ కుమార్‌లకు తొలిసారి సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. వీరితోపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్, స్టార్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠిలకు కూడా జట్టులో చోటు దక్కింది.


 ఫామ్ కోల్పోయి గత కొన్నాళ్లుగా తంటాలు పడుతున్న షా(Prithvi Shaw).. దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ఆడుతూ పరుగులు వాన కురిపించి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీషా(Prithvi Shaw) నార్త్-ఈస్ట్ జోన్‌పై సెంచరీ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ నుంచి తనకు పిలుపు వస్తుందని భావించాడు. అయితే, బీసీసీఐ ప్రకటించిన 16 మందితో కూడిన జట్టులో అతడి పేరు లేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యాడు.


దీంతో బీసీసీఐ, సెలక్టర్లపై అసహనం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్ చేశాడు. ‘‘వారి మాటలు నమ్మొద్దు, వారి చర్యలను మాత్రమే విశ్వసించండి. ఎందుకంటే వారు చెప్పే మాటలు అర్థం లేనివని వారి చర్యలు రుజువు చేస్తాయి’’ అని తన అసహనాన్ని వెళ్లగక్కాడు. ఈ పోస్టులో ప్రత్యేకంగా ఎవరి పేర్లను ప్రస్తావించనప్పటికీ బీసీసీఐ, సెలక్టర్లపై అతడు అసంతృప్తిగా ఉన్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.  కొందరు అతడికి అండగా నిలిచారు. షా(Prithvi Shaw)ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిని జట్టులోకి తీసుకోకపోవడం ఉన్న కారణాన్ని వెల్లడించాలని కోరుతున్నారు. అతడి ప్రదర్శన మాత్రం అందుకు కారణమై ఉంటుందని తానైతే అనుకోవడం లేదని, వేరే ఏదో కారణం ఉందని మరో అభిమాని కామెంట్ చేశాడు. పృథ్వీషా(Prithvi Shaw) చివరిసారి గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కనిపించాడు.  

Updated Date - 2022-10-04T02:33:23+05:30 IST