పైపై మెరుగులకే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-08-11T05:42:11+05:30 IST

భువనగిరి పెద్ద చెరువు కట్ట సుందరీకరణకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కట్ట భద్రతను విస్మరిస్తున్నారు.

పైపై మెరుగులకే ప్రాధాన్యం
భువనగిరి పెద్దచెరువు

భువనగిరి పెద్ద చెరువు కట్ట బలహీనం

మరమ్మతు ప్రతిపాదనలకు ఏడాదిన్నర 

ఇప్పటికీ పెండింగ్‌లోనే పనులు 

చెరువు సుందరీకరణకు ప్రాధ్యామిస్తున్న వైనం  

భువనగిరి టౌన్‌, అగస్టు 10: భువనగిరి పెద్ద చెరువు కట్ట సుందరీకరణకే ప్రాధాన్యం  ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కట్ట భద్రతను విస్మరిస్తున్నారు. చెరువు కట్టకు ఏర్పడిన లీకేజీలు అలాగే ఉన్నాయి. వర్షాలు కురుస్తున్నా లీకేజీల కారణంగా చెరువును నింపలేని పరిస్థితి. పైగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ దిగువ ప్రాంతంలోని చెరువుల్లో సంవత్సరం పాటు నీళ్లు ఉండేలా రూపొందించిన మెయిన్‌ కెనాల్‌ పనులు ప్రారంభం కాగా ఆ నీటితోనే నిండాల్సిన భు వనగిరి పెద్ద చెరువు కట్ట మరమ్మతులు మాత్రం ఏడాదిన్నర నుంచి ప్రభుత్వంవద్ద ప్రతిపాదనలకే పరిమితమమ్యాయి. దీంతో చెరువు కట్ట క్రమేపీ బలహీనపడుతోంది. రెండేళ్ల క్రితంలా సద్దుల బతుకమ్మకు ముందు కట్టకు గండిపడే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఆది నుంచి నిర్లక్ష్యమే

సుమారు 220 ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద చెరువు నిర్వహణపై మొదటి నుంచీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకవైపు చెరువు ఎఫ్‌టీఎల్‌ భూ ములన్నీ రియల్‌ వెంచర్లుగా మారుతుండగా, మరోవైపు బలహీనపడిన కట్టతో చెరువును నింపలేని పరిస్థితి నెలకొంది. రెండు దశాబ్దాల క్రితం చెరువు కట్టకు ఏర్పడిన మరమ్మతుకోసం అప్పటి తెలంగాణ అభివృద్ధి బోర్డు చైర్మన్‌ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి మంజూరు చేయించిన సు మారు రూ.10లక్షలతో అప్పట్లో కొద్దిమేర మరమ్మతులు చేశారు. అనంత రం మిషన్‌ కాకతీయలో భాగంగా సుమారు రూ.15లక్షలతో చెరువు పూడి క తీసి కట్టను పటిష్టం చేశారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం చెరువులోని బంకమట్టి తరలింపు కోసం బలహీనంగా ఉన్న చెరువు కట్ట కు అదనంగా కొద్దిమేర నూతన కట్ట నిర్మించారు. రూ.3.46కోట్లతో మినీట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా సుందరీకణతో పాటు కట్టకు కూడా మరమ్మతులు చేశారు. ఈ క్రమంలోనే కట్ట దిగువ ప్రాంతాన మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌, గేట్‌వాల్‌ను నిర్మించడంతో కట్ట భద్రత కు మరింత ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో బస్వాపూర్‌ ప్రాజెక్ట్‌ నిర్మా ణం కోసం చెరువు నుంచి రోజువారీగా వందలాది హెవీ లోడ్‌ టిప్పర్ల ద్వారా ఒండ్రు మట్టిని తరలించడంతో కట్ట మరింత దెబ్బతిన్నది. అప్పటి కే బలహీనంగా ఉన్న చెరువు కట్టపై టిప్పర్ల ఒత్తిడి పెరుగడంతో 22 అక్టోబరు 2020లో (సద్దుల బతుకమ్మకు రెండు రోజుల ముందు) అర్థరాత్రి గండి పడడంతో సుమారు పుష్కరం కాలం తర్వాత నిండిన చెరువంతా ఖాళీ అయ్యింది. ప్రమాద నివారణకు అధికారులు అర్థరాత్రి హడాహుడి గా చెరువు రెండు కత్వల ఎత్తును కూడా తగ్గించారు. 


పటిష్టతను మరిచి సుందరీకరణ పనులు 

దశాబ్ధాలుగా బలహీనంగా ఉన్న కట్టకు పలుమార్లు చేసిన మరమ్మతులన్నీ తాత్కాలికంగానే ఉపయోగపడ్డాయి. 22అక్టోబరు 2020న సంఘటనతో అప్రమత్తమైన అధికారులు శాశ్వత మరమ్మతులకు కార్యచరణ రూపొందించారు. ఈ మేరకు సుమారు 1.25కిలోమీటర్ల పొడవునా చెరు వు కట్టకు ప్రమాదకరంగా ఉన్న 600మీటర్ల పాటు మరమ్మతు చేసేందు కు రూ.2కోట్ల అంచనాతో ఇరిగేషన్‌ అధికారులు ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. అ ప్రాతిపాదనలపై నేటికీ ఉలుకూ పలుకూ లేదు. చెరువు కట్ట భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్న మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ కూడా తరలించాలని అప్పట్లోనే సంబంధిత ఉన్నతాధికారులకు ఇరిగేషన్‌ అధికారులు సాంకేతిక నివేదిక ఆధారంగా లేఖ రాసినప్పటికీ ఫలితం లేదు. చెరువులను నింపే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించిన మెయిన్‌ కెనాల్‌ పనుల్లో  లైనింగ్‌ పనులు ఇటీవలె ప్రారంభమయ్యాయి. ఆ మెయిన్‌ కెనాల్‌తో పెద్ద చెరువును కూడా నింపనున్నారు. మెయిన్‌ కెనాల్‌ అమల్లోకి వస్తే 365రోజుల పాటు పెద్ద చెరువు నిండు కుండలా ఉండనుంది. కట్టకు ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదించిన మరమ్మతులు చేయాలంటే చెరువును కొద్దికాలం పాటు ఖాళీగా ఉంచాల్సి ఉంచాలి. చెరువులో ఆనే మీటర్ల లోతుతో 600మీటర్ల పొడవుతో కట్ట పటిష్ట పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టని ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం కోట్లాది రూపాయలతో సుందరీకరణ పనులు కొనసాగిస్తుండడం గమనార్హం. 

ఆమోదం లభించిన వెంటనే పనులు చేపడతాం 

 ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన వెంటనే పెద్ద చెరువు కట్ట మరమ్మత్తు పనులు చేపడుతాము. ఇప్పటికిప్పుడు  చెరువు కట్టకు ప్రమాదం ఏమీ  లేదు.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మెయిన్‌ కెనాల్‌  లైనింగ్‌ పనులు కొనసాగినందునే ఇటీవలి వర్షాలతో చెరువును నింపడంలో కొద్ది ఆలస్యం జరిగింది. కట్ట పటిష్టంగా ఉన్నది. కొద్దిపసాటి లీకేజీలు  సర్వసాధారణమే.  ప్రతిపాదించిన పనులు పూర్తయితే ఒక్క చుక్క నీరు కూడా లీకేజీ కాదు. 

- యూ. భరత్‌, ఇరిగేషన్‌ ఏఈ, భువనగిరి 

Updated Date - 2022-08-11T05:42:11+05:30 IST