ప్రైవేట్‌ ప్రాక్టీ్‌సకే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-05-01T05:30:00+05:30 IST

ప్రభుత్వాసుపత్రిలో పేదలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలు అందించాల్సిన వైద్యులు ప్రైవేటు ప్రాక్టీ్‌సకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రైవేట్‌ ప్రాక్టీ్‌సకే ప్రాధాన్యం

కాలేజీ డాక్టర్లు ఆసుపత్రిలో.. ఆసుపత్రి డాక్టర్లు ప్రైవేట్‌ క్లినిక్‌లలో..

రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తున్న వైద్యులు!!

రోగులను తమ క్లినిక్‌లకు పంపాలని సిబ్బందికి సూచిస్తున్న వైనం!


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, మే1: ప్రభుత్వాసుపత్రిలో పేదలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలు అందించాల్సిన వైద్యులు ప్రైవేటు ప్రాక్టీ్‌సకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి జనరల్‌ ఆసుపత్రిగా ఏర్పడి మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా మారడంతో కాలేజీ బోధనా సిబ్బంది కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన వైద్యవిధాన పరిషత్‌ డాక్టర్లు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 400 పడకలున్న ఈ ఆసుపత్రిలో ఔట్‌ పేషంట్లు సగటున రోజుకు వెయ్యి మంది పరీక్షలు, ప్రాథమిక చికిత్సలు చేయించుకుని వెళ్తుంటారు. పేషంట్లకు సేవలు అందించడానికి ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీకి కలిపి వంద పైగా డాక్టర్లు ఉన్నారు. 

సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్‌కు చెందిన సుమారు 38 మంది రెగ్యులర్‌ డాక్టర్లు, 15 మంది కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. మెడికల్‌ కాలేజీ బోధనా సిబ్బంది వచ్చే వరకు వీరే ఈ ఆసుపత్రిలో వివిధ వ్యాధులతో వచ్చిన పేషంట్లకు చికిత్స అందించారు.  ఇక మెడికల్‌ కాలేజీలో బోధనా సిబ్బందిగా నియమితులై, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్‌ డాక్టర్ల సంఖ్య 79. ఈ కాలేజీకి 41 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కాగా 27 మంది నియమితులై పనిచేస్తున్నారు. 51 అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు  నలుగురు కాంట్రాక్టు కింద విధులు నిర్వహిస్తున్నారు. 139 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు 48 మంది జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వీరందరూ గతేడాది నవంబరు నుంచి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పేషంట్లకు చికిత్స అందిస్తున్నారు. 


డాక్టర్లు ఎక్కువే..

ఆసుపత్రిలో మెడికల్‌ కాలేజీకి నియమితులైన 79 మంది డాక్టర్లు చికిత్సలు కొనసాగిస్తుండడంతో వైద్య విధాన పరిషత్‌ ద్వారా నియమితులై విధులు నిర్వహిస్తున్న సుమారు 53 మంది డాక్టర్లకు సరిగ్గా పని లేకుండాపోయింది. ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు చికిత్స చేయడం, అవసరమైన ఆపరేషన్లు అన్ని కూడా మెడికల్‌ కాలేజీ డాక్టర్లు రెగ్యులర్‌గా, సమయానుసారం చేస్తుండడంతో వైద్యులకు పనిభారం తగ్గింది. దాదాపు వీరిలో చాలా వరకు ఏదో ఒక సమయంలో ఆసుపత్రికి వచ్చి హాజరుపట్టికలో సంతకాలు చేసి ఓ గంట గడిపి వెళ్తున్నారు. ఇక మిగిలిన సమయాన్ని వారు నిర్వహిస్తున్న నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లలో పూర్తిసమయం వెచ్చిస్తున్నారు. ఇక ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ప్రభుత్వాసుత్రికి వచ్చిన రోగులను నర్సింగ్‌హోంకు వెళ్లాలని వైద్యులకు ఆసుపత్రి సిబ్బంది ద్వారా పురమాయిస్తున్నారు. 


ఏరియా ఆసుపత్రులకు బదిలీ చేస్తే...

వైద్య విధాన పరిషత్‌కు అనుసంధానంగా జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, జోగిపేట, పటాన్‌చెరు, సదాశివపేటలో ఏరియా ఆసుపత్రులున్నాయి. ఈ ఆసుపత్రులన్నీ ఇక్కడి వైద్యవిధాన పరిషత్‌ సూపరింటిండెంట్‌ ఆధీనంలోనే ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వ వైద్య విద్యా విభాగం ఆధ్వర్యంలోని జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యవిధాన పరిషత్‌ డాక్టర్లను ఆయా ఏరియా ఆసుపత్రులకు బదిలీ చేస్తే అక్కడి పెషంట్లకు పూర్తిస్థాయిలో చికిత్స అందించే వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Updated Date - 2022-05-01T05:30:00+05:30 IST