జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-08-16T06:16:11+05:30 IST

కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.

జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం
స్వాతంత్య్ర దినోత్సవ సభలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాజన్నదొర


వ్యవసాయ రంగానికి పెద్దపీట

రైతు భరోసా మొదటి విడత 2.44 లక్షల మందికి రూ.183.26 కోట్లు పంపిణీ

ఆర్‌బీకేల ద్వారా పలురకాల సేవలు

మహిళల ‘స్వయం’ సమృద్ధికి వడ్డీ రాయితీపై రుణాలు

ఉపాధి పథకం కింద 75.17 లక్షల పనిదినాలు

జిల్లాలో 5.25 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు

అమ్మఒడి, నాడు-నేడుతో విద్యా ప్రగతి

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ కొళాయి

44,133 మంది పేదలకు పక్కా ఇళ్లు మంజూరు

స్వాతంత్య్ర దినోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు

205 మంది ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత



అనకాపల్లి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి త్యాగాలు చేసిన మహనీయులను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు సుమారు 500 రకాల సేవలను చేరువ చేశామన్నారు. గ్రామీణ ప్రాంతం అధికంగా వున్న అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రైతు భరోసా పథకం కింద 2022-23లో మొదటి విడత 2.44 లక్షల మంది రైతులకు రూ.183.26 కోట్లు అందజేశామని మంత్రి చెప్పారు. 466 రైతు భరోసా కేంద్రాల ద్వారా కర్షకలకు పలురకాల సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో 10,244 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.10.24 కోట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. జిల్లాలో 38,671 స్వయం సహాయక సంఘాల్లో 3.34 లక్షల మంది సభ్యులు వున్నారని, వీరు స్వయం సమృద్ధి సాధించడానికి వడ్డీరాయితీపై రుణాలు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 75.17 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అధిక పోషక విలువలుగల ఆహారాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఆర్థికాభివృద్ధికి పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం 5.25 లక్షల కుటుంబాలకు కార్డులు అందించామని, వీరికి వైద్య సేవల కోసం రూ.186.97 కోట్లు ఖర్చు చేశామని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా జిల్లాలో 12.31 లక్షల మందికి మొదటి డోసు, 13.67 లక్షల మందికి రెండో డోసు, 2.57 లక్షల మందికి ప్రికాషనరీ వ్యాక్సిన్‌ డోసులు వేశామన్నారు. 

విద్యా ప్రగతికి అనేక పథకాలను అమలు చేస్తున్నామని, అమ్మఒడి కింద జిల్లాలో 1.58 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.238 కోట్లు జమ చేశామని మంత్రి రాజన్న దొర చెప్పారు. ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమం కింద పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, 1,448 పాఠశాలల్లో 1.25 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద ఇంటింటికీ కొళాయిల ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో 44,133 మందికి పక్కా ఇళ్లు మంజూరు చేశామన్నారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను మంత్రి తిలకించారు. ఉత్తమ సేవలు అందించిన 205 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, జేసీ కల్పనాకుమారి, ఎస్పీ గౌతమి శాలి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు


స్వాతంత్య్ర వేడుకల్లో అనకాపల్లికి చెందిన వాసవి బాల విహార్‌, డీఏవీ, చోడవరం జ్యోతిరావుఫూలే బాలికల గురుకుల పాఠశాల,  సబ్బవరం కేజీబీవీ, కశింకోట సెయింట్‌ జాన్స్‌, అగనంపూడి ఏబీఎస్‌ పాఠశాలలకు చెందిన బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ‘వందే భారత్‌ హమ్‌’ గీతానికి నృత్యం చేసి అలరించిన కశింకోట సెయింట్‌ జాన్స్‌ హైస్కూల్‌ విద్యార్థులకు ప్రథమ బహుమతి, హిందుస్థానీ గీతానికి నృత్యం చేసిన సబ్బవరం కేజీబీవీ బాలికలకు ద్వితీయ బహుమతి, ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా...’ గేయానికి నృత్యం చేసిన అగనంపూడి ఏబీఎస్‌ హైస్కూల్‌ విద్యార్థులకు తృతీయ బహుమతి అందజేశారు.  


సంక్షేమ పథకాలపై శకటాల ప్రదర్శన


జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల సంక్షేమ పథకాలపై 19 శకటాలను ప్రదర్శించారు. పశుసంవర్థక శాఖ శకటానికి ప్రథమ బహుమతి, డీఆర్‌డీఏ శకటానికి ద్వితీయ బహుమతి, ఐసీడీఎస్‌ శకటానికి తృతీయ బహుమతిని ప్రకటించి మంత్రి, ఎంపీ చేతుల మీదుగా అయా శాఖల విభాగాధిపతులకు అందజేశారు. 


Updated Date - 2022-08-16T06:16:11+05:30 IST