ఆ ముగ్గురి ఆశలపై నీళ్లు

ABN , First Publish Date - 2022-04-11T06:33:54+05:30 IST

జగన్‌ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వైసీపీలోని ఓ వర్గంలో నిరుత్సాహం మిగిలిస్తే.. మరో వర్గంలో ఆనందం నింపింది.

ఆ ముగ్గురి ఆశలపై నీళ్లు

శిల్పా, సాయి, కాటసానిలకు మొండి చేయి 

పాత మంత్రులకే మళ్లీ చాన్స్‌ 

బుగ్గనకు కలిసొచ్చిన సీనియారిటీ 

సామాజికవర్గంతో గుమ్మనూరుకు బెర్తు ఖరారు 

ఆదోనికి అందని ద్రాక్షగానే మంత్రి పదవి 

ఆత్మకూరులో శిల్పా వర్గం కౌన్సిలర్ల రాజీనామా


కర్నూలు-ఆంధ్రజ్యోతి: జగన్‌ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వైసీపీలోని ఓ వర్గంలో నిరుత్సాహం మిగిలిస్తే.. మరో వర్గంలో ఆనందం నింపింది. మెజారిటీ వర్గీయులు జగన్‌ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి పదవి ఆశించిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌లకు జగన్‌ మొండి చేయి చూపారు. సామాజిక, కుల సమీకరణలు, సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త వాళ్లకు చోటు దక్కలేదు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌లను మళ్లీ కొనసాగించారు. శ్రీశైలం, పాణ్యం, ఆదోని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల వర్గీయులు నిర్వేదంలో మునిగిపోతే.. డోన్‌, ఆలూరులో మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. నేడు అమరావతిలో జరిగే మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి బుగ్గన, గుమ్మనూరు వర్గీయులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. శిల్పాకు మంత్రి పదవి రాకపోవడంతో నిరుత్సాహానికి గురైన ఐదుగురు ఆత్మకూరు మున్సిపల్‌ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 


 తొలి నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిన ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌ రెడ్డి, బాలనాగిరెడ్డిలో ఒకరికి రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి అవకాశం ఇస్తానని నాడు జగన్‌ హామీ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు అంటున్నారు. జగన్‌ చెప్పారంటే.. చేస్తారన్న విశ్వాసంతో రెండున్నరేళ్లుగా ఎదురు చూసిన సాయి వర్గీయులకు చివరకు నిరాశే మిగిలింది. అదే క్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా వర్గీయులకు సైతం నిరాశ తప్పలేదు. కాగా.. రాష్ట్రంలో ఏకైక వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు మరోసారి అవకాశం ఉంటుందని మొదటి నుంచే సంకేతాలు ఉన్నాయి. బుగ్గన స్థానంలో శిల్పాకు అవకాశం ఉంటుందని అందరూ భావించగా సీనియారిటీ ప్రాతిపదికన తిరిగి బుగ్గనకే చాన్స్‌ దక్కింది.


 శిల్పాకు మొదటి నుంచి ఆశాభంగమే


శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి 1989లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. మొదటి నుంచి వైఎస్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. 2009లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణానంతరం జగన్‌కు చేదోడుగా నిలిచారు. నల్లకాలువలో జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్ర ప్రారంభ సభ దగ్గరుండి పర్యవేక్షించారు. 2011లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో జగన్‌ శ్రీశైలం టికెట్‌ ఇవ్వకుండా మొండి చేయి చూపడంతో టీడీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచారు. 2017లో రెండోసారి ఎమ్మెల్సీగా గెలిచి వంద రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ సమయంలో నంద్యాల ఉప ఎన్నికలు రావడంతో శిల్పా కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరింది. నాటి సీఎం చంద్రబాబు శిల్పా చక్రపాణిరెడ్డికి శాసన మండలి చైర్మన్‌ పదవి ఇస్తానని హామీ ఇచ్చినా ఆ పదవిని త్యాగం చేసి ఎమ్మెల్సీకీ రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో శ్రీశైలం నుంచి విజయం సాధించారు. తాజా మంత్రివర్గ విస్తరణలో శిల్పాకు బెర్తు ఖాయమని గత మూడు, నాలుగు నెలలుగా విస్తృత ప్రచారం జరిగింది. ఆదివారం కూడా శిల్పా పేరే ప్రచారంలో ఉంది. ఆఖరి క్షణంలో బుగ్గనకు అవకాశం ఇవ్వడంతో శిల్పా అవకాశం కోల్పోయారు. ఇది ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు మంత్రిగా ప్రమాణం చేస్తున్న శిల్పా చక్రపాణిరెడ్డికి శుభాకాంక్షలు అంటూ ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఆయన  ఆశలపై జగన్‌ నీళ్లు చల్లడంతో నిర్వేదంలో మునిగిపోయారు. 


సాయికి అడ్డు వచ్చిన సామాజిక సమీకరణ


తొలి విడతలోనే మంత్రి పదవి కోసం ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిలు చివరి వరకు ప్రయత్నం చేశారు. నాడు.. సామాజిక సమీకరణల దృష్ట్యా రెండో విడతలో అవకాశం ఇస్తానని జగన్‌ హామీ ఇవ్వడంతో ఆ నమ్మకంతోనే ఎదురు చూశారు. చివరకు సామాజిక సమీకరణల కూర్పు నేపథ్యంలో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డికి చాన్స్‌ చేజారింది. 2004 ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి నాడు వైఎస్‌ఆర్‌ ఆశీస్సులతో ఆదోని ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓటమిని చవిచూశారు. 2011 వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌కు తోడుగా ఆయన పాదయాత్రలో అడుగులో అడుగులు వేశారు. 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న సాయికి ఈ తాజా విస్తరణలో మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు భావించారు. అయితే.. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన గుమ్మనూరు జయరామ్‌కు మరోసారి అవకాశం ఇవ్వడంతో సాయి, బాలనాగిరెడ్డిలకు మంత్రి పదవి దక్కకుండా పోయినట్టు తెలుస్తోంది.


బుగ్గనకు కలిసొచ్చిన సీనియారిటీ

డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి మరో దఫా మంత్రివర్గంలో చోటు దక్కింది. సీనియారిటీ ఆయనకు కలిసొచ్చింది. బేతంచెర్ల సర్పంచు ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన బుగ్గన 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన మరణానంతరం జగన్‌ వెంట నడిచారు. 2011 నుంచి వైసీపీలో కొనసాగుతూ వైసీపీ అభ్యున్నతికి, జగన్‌కు కీలక సలహాలు ఇస్తూ వచ్చారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీ ప్రభుత్వంలో పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్‌ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించడంలో ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో బుగ్గనకు అవకాశం ఉండకపోవచ్చని మొదట నుంచి ప్రచారం జరిగినా సీనియర్‌ మంత్రులకు అవకాశం కల్పించాలని జగన్‌ తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసొచ్చింది. అయితే.. మళ్లీ ఆర్థిక శాఖ ఇస్తారా.. మరో శాఖ అప్పగిస్తారా అన్నది వేచి చూడాలి. బుగ్గన మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి డోన్‌ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.


గుమ్మనూరుకు కలిసొచ్చిన వాల్మీకి కార్డు

ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు వాల్మీకి సామాజికవర్గం బలంగా పని చేసింది. 2019లో తొలివిడత మంత్రివర్గ కూర్పులో చివరి వరకు గుమ్మనూరు పేరు పరిశీలనలో లేదు. అయితే.. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బలమైన వాల్మీకి సామాజికవర్గం వ్యక్తి కావడం, ఆ వర్గానికి చెందిన రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే కావడంతో చివరి క్షణంలో గుమ్మనూరుకు క్యాబినెట్‌లో అవకాశం కల్పించారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో గుమ్మనూరుకు మళ్లీ అవకాశం ఉంటుందని మొదటి నుంచి ప్రచారం ఉంది. అందుకు అనుగుణంగానే మళ్లీ అవకాశం కల్పించారు. టీడీపీలో కొనసాగిన గుమ్మనూరు జయరాం, చిప్పగిరి జడ్పీటీసీ ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్లో అడుగులు పెట్టారు. టీడీపీ జడ్పీటీసీగా విజయం సాధించారు. 2009లో ఆలూరు టీడీపీ టికెట్‌ ఆశించారు. నాడు చంద్రబాబు టికెట్‌ ఇవ్వకపోవడంతో ప్రజారాజ్యంలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన గుమ్మనూరు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. తాజాగా జగన్‌ మంత్రివర్గంలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. నేడు అమరావతిలో జరిగే మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ కార్యకర్తలు, గుమ్మనూరు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. 


ఎమ్మెల్యే శిల్పా వర్గం కౌన్సిలర్ల రాజీనామా


ఆత్మకూరు, ఏప్రిల్‌ 10: మంత్రివర్గంంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి చోటు కల్పించకపోవడంతో ఆత్మకూరు మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. పట్టణానికి చెందిన 1వ వార్డు కౌన్సిలర్‌ నూర్జహా, 3వ వార్డు కౌన్సిలర్‌ నీర్‌యూనూస్‌, 5వ వార్డు కౌన్సిలర్‌ మోమొన్‌ గౌస్‌ లాజం, 9వ వార్డు కౌన్సిలర్‌ సుల్తాన్‌ బాషా, 21వ వార్డు కౌన్సిలర్‌ బోయ లక్ష్మమ్మ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారిలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయ నోటీస్‌ బోర్డులో తమ రాజీనామా పత్రాలను అంటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఎన్నో త్యాగాలు చేసి పార్టీకి సేవలందిస్తే అధి నాయకత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఇంత కాలం ఎమ్మెల్యే శిల్పాకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని తాము ఎదురు చూశామని, చివరి క్షణాల్లో సీఎం జగన్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని అన్నారు. వైసీపీ అధి నాయకత్వం వైఖరిపై మనస్తాపంతో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 

Updated Date - 2022-04-11T06:33:54+05:30 IST