జొకోను వదిలేయండి!

ABN , First Publish Date - 2020-07-01T08:46:24+05:30 IST

ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌కు సెర్బియా ప్రధాని అనా బనబిక్‌ మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో దేశంలో టోర్నీల నిర్వహణకు ..

జొకోను వదిలేయండి!

సెర్బియా ప్రధాని అనా విజ్ఞప్తి

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌కు సెర్బియా ప్రధాని అనా బనబిక్‌ మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో దేశంలో టోర్నీల నిర్వహణకు అనుమతించిన తనది తప్పని.. జొకోది కాద న్నారు. కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు జొకోవిచ్‌, అతడి సోదరుడు కలసి ఆడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌ నిర్వహించారు. అయితే, ఇందులో పాల్గొన్న జొకోతో సహా నలుగురు టాప్‌ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో నొవాక్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటించకుండా డ్యాన్స్‌లు వేయడం, పార్టీలు చేసుకొనే వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఎక్కువ మంది కొవిడ్‌ బారినపడ్డారు. దీనిపై జొకో క్షమాపణలు కూడా కోరాడు. ఈ నేపథ్యంలో నొవాక్‌ను ఒంటరిగా వదిలేయమని అనా అన్నారు. ‘అతడు మంచి చేయాలని చూశాడు. మానవతా దృక్పథంతో కొవిడ్‌ బాధితుల కోసం విరాళాలు సేకరించాలనుకున్నాడు. ఎదైనా తప్పు జరిగితే అది నావల్లే. జొకోను వదిలేయండి’ అని అనా విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-07-01T08:46:24+05:30 IST