పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ రాజకీయభవితవ్యం దాదాపుగా తేలిపోయినట్టే. రాజీనామా చేయననీ, చివరిబంతివరకూ ఆడతానంటూ ఆయన తన పదవి కాపాడుకోవడానికి విఫలయత్నాలేవో చేసుకుంటున్నారు. ఆదివారంనాటి అవిశ్వాస తీర్మానంలో ఫలితం ఏమిటన్నది తెలుసు కనుక మనసులో ఉన్నదంతా వరుసపెట్టి కక్కేస్తున్నారు. నిజాలా నిందలా అన్నది అటుంచితే, ఆయన మాటలు మాత్రం వినసొంపుగానే ఉన్నాయి.
దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చాలామంది వీడ్కోలు ప్రసంగంగానే చూశారు. తాను రాజకీయాల్లోకి రావడం వెనుక ఎన్నో ఆశయాలూ త్యాగాలూ ఉన్నాయని చెప్పుకోవడం నుంచి విపక్షనేతలను శపించడం వరకూ ఆయన చాలా విన్యాసాలు చేశారు. ప్రసంగంలో ఆయన ‘నేను’ అన్న మాటని 143 సార్లు అంటే నిముషానికి మూడుసార్లు వాడారట. ఇక, తన సర్వస్వతంత్ర సర్వసత్తాక వైఖరి నచ్చని కారణంగా ఒక విదేశీ దుష్టశక్తి తనను వెన్నుపోటు పొడిచిందని విస్పష్టంగా తేల్చేయడంతో పాటు ఆ శక్తి ఏమిటన్నది కూడా చెప్పేశారు. సర్వసాధారణంగా పాక్ నేతలంతా తమకు కష్టం వచ్చినప్పుడల్లా భారత్‌ను బూచిగా చూపించి రాజకీయంగా నెగ్గుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇమ్రాన్ కూడా ఈ అవసానదశలో అదేపనిచేస్తారని అనేకులు ఊహించారు. కానీ, మిగతా పాక్ పాలకులతో పోల్చితే ఇమ్రాన్ తన పదవీకాలంలో ఏవో కొన్ని విసుర్లు తప్ప భారత్‌ను ఆడిపోసుకున్నదీ, రాజకీయ మనుగడ కోసం తూలనాడిందీ తక్కువే. సర్జికల్ దాడులు, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వంటి కీలక సందర్భాల్లో సైతం ఇమ్రాన్ పొరుగుదేశంతో మెతకగా వ్యవహరించారన్న విమర్శ లేకపోలేదు. ఇప్పుడు ఆయన వెన్నుపోటుదారుడు ఎవరన్నది చెబుతూ ఏదో నోరుజారినట్టుగా అమెరికా పేరు ఉచ్చరించిన దృశ్యానికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పులేదని కొందరు జోకులువేస్తున్నారు. తనమీద కక్షకట్టి, విపక్షాలతో చేతులు కలిపి అమెరికా ఈ మొత్తం రాజకీయ కల్లోలానికి కారణమైందని ఇమ్రాన్ వాదన. అవిశ్వాస తీర్మానం తరువాత ఇమ్రాన్ అధికారంలో కొనసాగితే పాకిస్థాన్‌కు కష్టాలూ తప్పవనీ, ఆయన దిగితేనే ఇరుదేశాల సంబంధాలూ బాగుంటాయని అమెరికా ఒక లేఖలో అధికారికంగా హెచ్చరించిందనీ, దానిని పాక్ రాయబారికి అందించిందనీ ఆరోపణ. ఇదిగో ఆ లేఖ అని ఆయన ప్రదర్శించినప్పటికీ, సదరు పాక్ రాయబారి కూడా ఈ హెచ్చరికలు, కుట్రల మాట నిజం కాదంటున్నాడు. ఇక అమెరికా సహజంగానే దీనిని ఖండించింది. ఇమ్రాన్ ప్రభుత్వం మాత్రం పాక్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకు అమెరికా రాయబారికి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా పేరు నిర్భయంగా బయట పెట్టినందుకు తన ప్రాణం ప్రమాదంలో పడిందని ఇమ్రాన్ అంటున్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం ఆరంభమైన రోజునే రష్యాలో ఇమ్రాన్ కాలూనిన విషయం తెలిసిందే. ఈ పర్యటనను అంతా కలసికట్టుగా నిర్ణయిస్తే, ఇప్పుడు అమెరికాకు భయపడి తనను బలిచేస్తున్నారని ఇమ్రాన్ ఆవేదన. పుతిన్‌తో కరచాలనం చేసినందుకు తనను ఇలా శిక్షిస్తున్న అమెరికా మరోపక్క భారతదేశాన్ని మాత్రం వీసమెత్తు కదిలించలేకపోతున్నదని ఇమ్రాన్ గుర్తుచేస్తున్నారు. రష్యా చమురు సహా చాలా విషయాల్లో భారతపాలకులు అమెరికాను ఎదిరిస్తూ సర్వస్వతంత్రంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా వ్యవహరిస్తున్నారనీ, పాకిస్థాన్ మాత్రం అమెరికా మీద ఆధారపడి, దానికి భయపడుతూండటంతో శక్తిమేరకు ఎదగలేకపోతున్నదని ఇమ్రాన్ అంటున్నారు. చివరకు బ్రిటన్ కూడా భారతదేశానికి వంతపాడుతున్నదని ఆయన గుర్తుచేస్తున్నారు. ఏతావాతా ఇమ్రాన్ తనను తాను ఒక బలమైన, స్వతంత్రమైన, ఏ రాజకీయాపేక్షాలేని దేశ ప్రయోజనాలకోసం నిలబడే నాయకుడిగా ప్రదర్శించుకొనే ప్రయత్నం ఒకటిచేశారు. డాలర్లకు అమ్ముడుపోని, అమెరికా సైనికస్థావరాలను అనుమతించని తమ మహానాయకుడిని హత్యచేసే యత్నాలు జరుగుతున్నాయని ఆయన పార్టీ నాయకులు అంటున్నారు. అధికారంలో కొనసాగడానికి వారు ముందుకు తెస్తున్న కుట్రసిద్ధాంతాలను ప్రజలు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఈ దశలో చేయగలిగేదేమీ ఉండదు. ఇమ్రాన్ ముందు సైన్యం పెట్టిన ప్రతిపాదనలో ఎన్నికలు కూడా ఉన్నాయని అంటున్నారు. విపక్షం మాత్రం మిగతావేవీ కుదరదనీ, ఇమ్రాన్ ఆ కుర్చీ ఖాళీచేయగానే తాను కూచోవాల్సిందేనని అంటోంది. అష్టకష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ప్రయాణం ఇకపై ఎటువైపో తెలియదు కానీ, ఈ పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో జోకులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.