75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఎన్నో సాధించాం : మోదీ

ABN , First Publish Date - 2020-08-15T13:31:42+05:30 IST

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఎన్నో సాధించాం : మోదీ

ఢిల్లీ : దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మునుపటిలాగా కాకుండా ఈ ఏడాది అతిథులల్లో ఐదవ వంతు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కేవలం 150 మంది వీఐపీలకు మాత్రమే ఆహ్వానం అందింది. ఎర్రకోటపై జాతీయజెండాను ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు.


ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన వారందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న సైనికులకు.. అంతర్గత భద్రతను కాపాడుతున్న పోలీసులకు వందనం చేశారు. ఎందరో వీరుల త్యాగఫలం.. ఈ స్వాతంత్ర్యం అని ప్రధాని తెలిపారు. ప్రపంచంతో పాటు దేశం విపత్కర పరిస్థితుల్లో పయనిస్తోందని మోదీ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.


ఎన్నో సాధించాం..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తోంది. మనందరం కరోనాపై పోరాటం చేస్తున్నాం. కరోనా వారియర్స్ సేవలు మరువలేనివి. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారు. కరోనాతో పాటు దేశ వ్యాప్తంగా వరదలు, ప్రకృతి విపత్తులు చుట్టుముట్టాయి. దేశంలోని చాలా ప్రాంతాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై విపత్తులను ఎదుర్కొంటున్నాయి. 75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఎన్నో సాధించాం. ప్రాణ త్యాగం చేసి మన పూర్వీకులు స్వాతంత్ర్యం సాధించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రపంచానికి ఒక దీపశిఖ. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో అడుగు వేయడానికి సిద్ధం’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 


ఈ వేడుక సందర్భంగా ఎర్రకోట త్రివర్ణ శోభితమైంది. కరోనా దృష్ట్యా వేడుకల్లో వ్యక్తిగత దూరం ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట ప్రాంగణంలో కుర్చీల మధ్య 2 గజాల దూరం ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగింది.



Updated Date - 2020-08-15T13:31:42+05:30 IST