కాళీ వివాద వేళ ప్రధాని కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-10T19:14:56+05:30 IST

న్యూఢిల్లీ: కాళీ వివాద వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని చెప్పారు.

కాళీ వివాద వేళ ప్రధాని కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కాళీ వివాద వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని చెప్పారు. ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందన్నారు. తన ఆధ్యాత్మిక గురువు స్వామి ఆత్మస్థానంద శతజయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించారు. స్వామి ఆత్మస్థానందతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆత్మస్థానంద ఆశీస్సులు లభించడం తన భాగ్యమన్నారు. స్వామి ఆత్మస్థానంద చివరి క్షణాల్లో కూడా తాను ఆయన వద్దే ఉన్నానని మోదీ గుర్తు చేసుకున్నారు. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి విజ్ఞానానంద... స్వామి ఆత్మస్థానందకు మంత్ర దీక్ష ఇచ్చారని ప్రధాని తెలిపారు.


భారత్‌లో అనాదిగా సన్యాస మార్గం ఉందని,  ఈ మార్గం ద్వారా సాధు సన్యాసులు లోక కళ్యాణం కోసం పనిచేస్తూ వచ్చారని మోదీ చెప్పారు. ప్రతి ఆత్మలోనూ శివుడిని చూసే సంస్కృతి సాధు సంతులకుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను గుర్తు చేసుకున్నారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ అనే పవిత్ర సంప్రదాయాన్ని వారు పాటించారని ప్రధాని గుర్తు చేశారు. ప్రస్తుతం రామకృష్ణ మిషన్ కూడా అదే సంప్రదాయం కోసం పనిచేస్తోందని చెప్పారు. దేశం నలుమూలలా నేడు శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ప్రభావం ఉందని ప్రధాని చెప్పారు. 






కాళీ మాతను తాను మాంస భక్షకిగా, మద్యపానాన్ని సేవించే వ్యక్తిగా ఊహించుకునే హక్కు తనకు ఉందంటూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువ మొయిత్రా (Mahua Moitra) వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దీంతో బీజేపీ నేత జితేన్ ఛటర్జీ ఫిర్యాదు మేరకు మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఓట్ల కోసం హిందువుల మనోభావాలను గాయపరచడం టీఎంసీ అధికారిక వైఖరని బీజేపీ ఆరోపించింది. వివాదం పెద్దదవుతుండటంతో మహువా మొయిత్రా వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. ఆమె తన వ్యక్తిగత హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారని, ఆమె చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని పేర్కొంది. 


దీనికి తోడు ఫిలిం మేకర్‌ లీనా మణిమేఖలై (leena manimekalai) ఇటీవలే ఓ డాక్యుమెంటరీలో కాళీ మాతను చిత్రీకరించిన తీరు వివాదాస్పదమైంది. కాళీ మాత ధూమపానం చేస్తున్నట్లు, ఓ చేతితో స్వలింగ సంపర్కుల జెండాను ధరించినట్లు వివాదాస్పద రీతిలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను.. ట్విటర్‌ భారత్‌లో కనపడకుండా చేసింది. 


వివాదాస్పద ‘కాళి’ (Kaali) పోస్టర్‌పై కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ (Dakshineswar) ఆలయ కమిటీ స్పందించింది. పోస్టర్‌పై కాళి మాతను చూపిన తీరు హిందువుల మనోభావాలను కించపరిచిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.  

Updated Date - 2022-07-10T19:14:56+05:30 IST