Delhi: ప్రధానితో సీఎం భేటీ

ABN , First Publish Date - 2022-08-18T13:13:25+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(State Chief Minister MK Stalin) ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. ఆ

Delhi: ప్రధానితో సీఎం భేటీ

- ప్రాచీన ధాన్యాల పేటిక అందజేత

- నీట్‌ మినహాయింపు, నిధులు కోరుతూ వినతిపత్రం 


చెన్నై, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(State Chief Minister MK Stalin) ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. ఆ సందర్భంగా చెన్నైలో చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవానికి హాజరైన మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. స్టాలిన్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ఎంపీ టీఆర్‌ బాలు కూడా ప్రధానితో భేటీ అయ్యారు. మోదీని శాలువతో సత్కరించిన స్టాలిన్‌ రాష్ట్రంలో పండిస్తున్న ప్రాచీన వంగడాలకు చెందిన తొమ్మిది రకాల ధాన్యాల పేటికను, చెస్‌ ఒలంపియాడ్‌ విశేషాలతో కూడిన ‘హోమ్‌ ఆఫ్‌ చెస్‌’ అనే ఆంగ్ల పుస్తకాన్ని కానుకగా అందజేశారు. అరగంటకు పైగా వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీట్‌ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా చర్యలు చేపట్టాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కావేరి నదిపై మెకెదాటు వద్ద కర్ణాటక(Karnataka) ప్రభుత్వం కొత్త ఆనకట్ట నిర్మించే ప్రయత్నాలను అడ్డుకోవాలని, పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని కోరుతూ వినతి పత్రాన్ని కూడా ప్రధాని మోదీకి స్టాలిన్‌ అందించారు. వాటిని పరిశీలిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 


రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపా: స్టాలిన్‌

ప్రధాని మోదీని కలుసుకునేందుకు ముందుగా తమిళనాడు హౌస్‌ వద్ద ముఖ్యమంత్రి స్టాలిన్‌ విలేఖరులతో మాట్లాడుతూ... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపానని వివరించారు. చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) క్రీడలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తూ రాష్ట్రపతి తనకు అల్పాహారం ఇచ్చారంటూ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి కలుసుకున్నందుకుగాను రాష్ట్రపతి తనకు అల్పాహారం ఇచ్చారనే భావిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక రెండుసార్లు ప్రధాని మోదీని ఢిల్లీలో కలుసుకుని రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళానని గుర్తు చేశారు. కొన్ని సమస్యలు పరిష్కారమైనా ఇంకా ప్రధాన సమస్యలు మిగిలి ఉన్నాయన్నారు. వాటిపై మళ్ళీ చర్చించేందుకే వెళుతున్నానని చెప్పారు. 

Updated Date - 2022-08-18T13:13:25+05:30 IST