ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన Cm Bommai

ABN , First Publish Date - 2022-06-19T17:04:13+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన నేపథ్యంలో బెంగళూరు రహదారులు ముస్తాబయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి

ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన Cm Bommai

బెంగళూరు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన నేపథ్యంలో బెంగళూరు రహదారులు ముస్తాబయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి మోదీ బెంగళూరుకు వస్తున్నారు. సాయంత్రం దాకా పలు కార్యక్రమాల్లో పాల్గొని మైసూరుకు వెళతారు. ప్రధానమంత్రి రాక నేపథ్యంలో నగర వ్యాప్తంగా రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుదీర్ఘ కాలంగా గుంతలుగా ఉండే బళ్లారి రోడ్డుకు మరమ్మతులు చేశారు. రద్దీ ప్రాం తం కావడంతో నాలుగు రోజులుగా రాత్రివేళల్లో పనులు సాగుతున్నాయి. బెంగళూరు విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ను ప్రారంభించేందుకు వెళుతున్న తరుణంలో నాణ్యతగా పనులు చేపట్టారు. ప్రధానమంత్రి కార్యక్రమాలను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ ఎస్‌పీజీ మార్గదర్శకాలకు అనుగుణంగా నే ఏర్పాట్లు చేశామన్నారు. కొమ్మఘట్టలో ప్రధాని కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు. బెంగళూరు సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉండేదని ఎట్టకేలకు పూర్తి అవుతోందన్నారు. తాజాగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున సభాప్రాంగణంలో పాల్గొనేవారు కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని, సభకు హాజరయ్యేవారు అవసరం లేదన్నారు. తనతో సహా మంత్రులు, అధికారులందరికి ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. మైసూరులో సోమవారం సుత్తూరుమఠంతోపాటు చాముండేశ్వరి కొండలను సందర్శించనున్న తరుణంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. యూనివర్సిటీలో సభకు అధ్యక్షత వహిం చే మంత్రి సోమణ్ణ పేరు లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. కార్యక్రమం కేంద్రానిదైనా, రాష్ట్రానిదైనా ప్రోటోకాల్‌ లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఆదివారంలోగా శిలాఫలకం మారలేదంటే స్వయంగా ధ్వంసం చేస్తానని ఆ శాఖ కమిషనర్‌ ప్రదీప్‌పై విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-06-19T17:04:13+05:30 IST