ఆ కుటుంబం కోసమా బలిదానాలు?

ABN , First Publish Date - 2022-05-27T08:06:34+05:30 IST

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది బలిదానం చేసింది ఒక ఆశయం కోసం.. ఉజ్వల భవిష్యత్తు కోసం కానీ.. ఒక కుటుంబం

ఆ కుటుంబం కోసమా  బలిదానాలు?

అమరుల ఆశయాలు నెరవేరడం లేదు

కుటుంబ పాలన చేతిలో తెలంగాణ బందీ

అవినీతి తీవ్రతను ప్రత్యక్షంగా చూస్తున్నారు

స్వప్రయోజనాలు, సొంత ఖజానా 

నింపుకోవడమే ఆ కుటుంబ పాలన పరమావధి

దాని నుంచి విముక్తి కల్పించడమే మా లక్ష్యం

కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు

మా పథకాల పేరు మార్చి అమలు చేయడం 

దుర్మార్గం.. కేసీఆర్‌ పాలనపై మోదీ ధ్వజం

బేగంపేట ఎయిర్‌పోర్టులో పార్టీ 

కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగం


కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి, యువతకు ప్రధాన శత్రువులు. కుటుంబ పార్టీలు లేని చోటే దేశంలో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో కూడా కుటుంబ పార్టీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే మా లక్ష్యం.


మూఢ నమ్మకాలపై విశ్వాసం ఉన్నవారు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించలేరు. మూఢ నమ్మకాలతో వాళ్లు రాష్ట్రానికి ఎంత నష్టం చేయడానికైనా దిగజారతారు. ఇలాంటి వాళ్లు తెలంగాణకు న్యాయం చేయలేరు. వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. 


తెలంగాణలో అధికార మార్పిడి పక్కా. బీజేపీ అధికారంలోకి రాబోతోంది. ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే సిద్ధమైపోయారు. ఇక్కడ జెండా ఎగరేస్తాం.. చరిత్ర సృష్టిస్తాం.

- ప్రధాని నరేంద్ర మోదీ


హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది బలిదానం చేసింది ఒక ఆశయం కోసం.. ఉజ్వల భవిష్యత్తు కోసం కానీ.. ఒక కుటుంబం కోసం కాదు. కుటుంబ పాలనలో అమరుల ఆశయాలు నెరవేరడం లేదు. తెలంగాణ బందీ అయింది. ఒకే కుటుంబం అధికారంలో ఉంటే అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సొంత ప్రయోజనాలు చూసుకోవడం.. సొంత ఖజానా నింపుకోవడం తప్ప ఆ కుటుంబానికి పేదల కష్టాలు పట్టవు’’ అంటూ కేసీఆర్‌ పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐఎ్‌సబీ ద్వి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి ప్రధాని ప్రసంగించారు. ‘తెలంగాణ ప్రజలకు నమస్కారం’ అంటూ తెలుగులో ప్రారంభించిన మోదీ.. సుమారు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరును ప్రస్తావించకుండానే ఆయన పాలన, అవినీతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అధికారంలో కొనసాగడం.. రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యం. ఈ కుటుంబ పార్టీల కారణంగానే దేశంలో యువకులు, ప్రతిభావంతులు రాజకీయాల్లోకి రావడం లేదు. కుటుంబ పార్టీల పాలన అంతా అవినీతిమయం. ఇందువల్ల అత్యధికంగా నష్టపోయేది పేదలే. కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యం’’ అని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ప్రకటించారు.

టెక్నాలజీని నమ్ముతా.. మూఢవిశ్వాసాలను కాదు

టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన 21వ శతాబ్దంలో కూడా ఇక్కడ తెలంగాణలో కొంతమంది మూఢ నమ్మకాలకు బానిసలయ్యారంటూ పరోక్షంగా కేసీఆర్‌ను ప్రధాని మోదీ విమర్శించారు. ఈ మూఢ నమ్మకాలతో వారు రాష్ట్రానికి ఎంత నష్టం చేయడానికైనా దిగజారతారని, ఇలాంటి వాళ్లు తెలంగాణకు న్యాయం చేయలేరని మండిపడ్డారు. ‘‘నేను విజ్ఞానాన్ని, టెక్నాలజీని నమ్ముతాను. మూఢ విశ్వాసాలను కాదు. నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నగరాల్లో పర్యటిస్తే పదవి పోతుందని ప్రచారం చేశారు. దానిని తిప్పి కొడుతూ నేను పదే పదే ఆ నగరాలకు వెళ్లాను. ఏమైంది..!? యూపీలో కూడా ఇంతే! కొన్ని నగరాల్లో పర్యటిస్తే పదవి పోతుందని సీఎం యోగికి కొంతమంది చెప్పారు. వాటిని తిప్పికొడుతూ పదే పదే ఆయా నగరాల్లో పర్యటించారు. ఏమైంది..!? ఆయన రెండోసారి సీఎం అయ్యారు’’ అని వివరించారు. తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తోందని, ఇక్కడ అధికారంలోకి వచ్చి తీరుతామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయడానికి యువతతో కలిసి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పారు. ప్రతి పేదకూ వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం, జన్‌ధన్‌ యోజన, పేద మహిళలకు పక్కా ఇల్లు, ముద్ర యోజన, స్వరోజ్‌గార్‌ యోజన తదితరాలను అమలు చేస్తున్నామని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆయా పథకాల పేర్లు మార్చడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. పథకాల పేర్లు మార్చగలరేమోగానీ, వారి మనసుల్లో నుంచి బీజేపీని తొలగించలేరని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ ప్రజల సమర్థత, ఇక్కడి అవకాశాలు నాకు తెలుసు. ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా, స్టార్ట్‌ప్సల్లో దేశం ముందుకెళుతోంది. స్టార్ట్‌ప్సలో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఆర్థికంగా కూడా ఎదుగుతున్నాం. ఈ మొత్తం ప్రక్రియలో టెక్నాలజీదే కీలక పాత్ర. ఇందులో తెలంగాణ యువత భాగస్వామ్యం అత్యంత కీలకం. ఇది కొనసాగాలంటే నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం అవసరం. ఇది బీజేపీకి మాత్రమే సాధ్యం’’ అని స్పష్టం చేశారు. తెలంగాణను మరింత వేగంగా అభివృద్ధి చేయడం, టెక్నాలజీ హబ్‌ చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ఓ పార్టీకి కొమ్ముగాస్తోందంటూ మజ్లి్‌సనుద్దేశించి మోదీ ఆరోపించారు. ‘‘దేశ ఐక్యత కోసం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి చేశారు. కానీ, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు స్వాతంత్య్రం రావడానికి ముందూ ఉన్నాయి. అప్పట్లోనూ వాటి ప్రయత్నాలు ఫలించలేదు. అలాంటి శక్తులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటి ప్రయత్నాలు ఫలించబోవు’’ అని ప్రకటించారు. బీజేపీ కార్యకర్తలు పారిపోయే వాళ్లు కాదని, పోరాటం చేసే వాళ్లు.. గెలిపించే వాళ్లని అన్నారు.

పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలు

పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మారు పేరు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల అభిమానానికి రుణపడి ఉంటానన్నారు. ‘‘2013లో నా హైదరాబాద్‌ పర్యటనను మరచిపోలేను. అప్పట్లో నేను గుజరాత్‌లో పార్టీ కార్యకర్తను మాత్రమే. దేశ ప్రజలకు చాలామందికి నేను తెలియదు. ఆ సమయంలో నేను వచ్చినప్పుడు ఇక్కడ లభించిన ఆదరణ దేశమంతా గుర్తించింది. నా ప్రసంగం వినడానికి సొంత ఖర్చులతో సభకు వచ్చారు. వారి ఆదరణను మరచిపోలేను. ఆ ఘటనే దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించింది’’ అని చెప్పారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ తనకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2022-05-27T08:06:34+05:30 IST