ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి

ABN , First Publish Date - 2022-05-28T05:56:49+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ వ్యతిరేకి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు.

ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి
సమావేశంలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌

- సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై ఆయన చేసిన వాఖ్యలను ఖండిస్తున్నాం...

- బీజేపీ ఎంపీలో వంద మంది కుటుంబసభ్యులను చూపిస్తాం

- సంజయ్‌.. ఎంపీగా మూడేళ్లలో మూడు రూపాయలు తెచ్చావా....

- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ 

కరీంనగర్‌ టౌన్‌, మే 22: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ వ్యతిరేకి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై చేసిన వాఖ్యలను టీఆర్‌ఎస్‌ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  2005లో టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ కోసం దేశంలోని 32 రాజకీయ పార్టీలను ఒప్పించడంతోనే రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని గుర్తు చేశారు. 1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలపై చేసిన తీర్మానాన్ని విస్మరించిన బీజేపీకి తెలంగాణపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీకి తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేదని, తెలంగాణాలోని ఏడు మండలాలను, సీలేరు విద్యుత్పుత్తి కేంద్రాన్ని ఏపీలో విలీనంచేశారని, ఆ సమయంలో తాను పార్లమెంట్‌లో గర్జించి ఒక రోజు సభను వాయిదా వేయించామని చెప్పారు. తెలంగాణలో కుటుంబపాలన అని మోదీ వాఖ్యానించారని, బీజేపీ ఎంపీల్లో 100 మంది తాతలు, తండ్రులు, వారి కొడుకులు గెలిచిన వారంతా కుటుంబపాలన కిందికి వస్తారా .. వంద మంది పేర్లను బయటపెట్టాలా అని అన్నారు. కుటుంబపాలనలో తెలంగాణ అభివృద్ధి చెందడం లేదని మోదీ చెప్పడం సరికాదని, స్వచ్చభారత్‌లో దేశంలోని 20 గ్రామాలు అభివృద్ధి చెందితే అందులో 19 గ్రామాలు తెలంగాణాలోనివేనని,  విద్యుత్‌ వాడకంలోనే కాకుండా రోడ్లు, విద్య, వైద్యంతోపాటు అనేక రంగాల్లో తెలంగాణా మొదటి, రెండు స్థానాల్లో ఉందని అన్నారు. దీన్ని ఎస్‌ఐబీ విద్యార్థులకు ఎందుకు వివరించలేదని మోదీని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించారని,  రైళ్లను కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో బేటీ సందర్భంగా మోదీ అక్కడికి ఆహారధాన్యాలను పంపిస్తామని చెప్పారని, అసలు దేశంలో ఎంత నిలువలు గోదాముల్లో ఉన్నాయనే విషయం కూడా మోదీకి తెలియదని అన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో 70 కోట్ల మంది 25 ఏళ్ల వయసులోపు వాళ్లే ఉన్నారని, వారి కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. కేవలం రెచ్చగొట్టే ఉపన్యాసాలతో వైషమ్యాలను కలిగిస్తున్నారని విమర్శించారు. జన్‌ధన్‌ కార్యక్రమం ద్వారా కోటి మంది చిరువ్యాపారులకి 10వేల నుంచి లక్ష రూపాయల అప్పు ఇస్తామని చెప్పి 36 వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దేశంలో నీటి సంపద పుష్కలంగా ఉన్నప్పటికి  ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదని, తెలంగాణాలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్‌ కాలేజీలను ఇస్తే తెలంగాణాకు ఒక్కటి కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వానికి  విమర్శించే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. బ్రిటీష్‌ వాళ్లలాగా విభజించు.. పాలించు అనే విధంగా బీజేపీ వెళ్తుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు,  ఎంపీ బండి సంజయ్‌ మూడేళ్లలో కరీంనగర్‌కు మూడు రూపాయలు కూడా తేలదని, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నప్పటికి కరీంనగర్‌కు ఏమి తెచ్చారో చెప్పాలని నిలదీశారు. తాను కరీంనగర్‌ ఎంపీగా అనేక సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఈరోజు కరీంనగర్‌లో జరుగుతున్న వేయి కోట్ల పనులు కూడా తన ప్రాతినిధ్యం మేరకు జరుగుతున్నవేనని చెప్పారు. కరీంనగర్‌ జిల్లాను జాతీయ రహదారుల కూడలిగా మార్చితే ఇప్పుడు ఆ కార్యాలయానికి తాళం పడిందని, తీగలగుట్టపల్లి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ఫైల్‌ ఎక్కడ ఆగిందో కూడా సంజయ్‌కి తెలియదని అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి కరీంనగర్‌ను మరో భైంసాగా మార్చి రాజకీయంగా లబ్దిపొందేందుకు సంజయ్‌ రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన మాటలపై అప్రమత్తంగా ఉండాలని, ముస్లిం యువకులు ట్రాప్‌లో పడవద్దని సూచించారు. ఏక్తా యాత్రలో సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విధ్వంసకర వ్యాఖ్యలు చేస్తూ వైషమ్యాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం సరికాదని, వీరి వ్యాఖ్యలతో అభివృద్ధికి తిరుగోమనం పడుతుందని, సత్తా ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని, ట్రిపుల్‌ ఐటీ తీసుకురావాలని సంజయ్‌కి సూచించారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్లు వాల రమణారావు, దిండిగాల మహేశ్‌, కంసాల శ్రీను, ఐలేందర్‌యాదవ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T05:56:49+05:30 IST