యోధుల వారసులకు ప్రధాని సత్కారం

ABN , First Publish Date - 2022-07-05T08:19:12+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా సన్మానించారు. అల్లూరి, ఆయన అనుచరుల వారసులను ప్రత్యేకంగా పరామర్శించి, సత్కరిం

యోధుల వారసులకు ప్రధాని సత్కారం

పసల కృష్ణభారతికి పాద నమస్కారం చేసిన మోదీ


భీమవరం, జూలై 4: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా సన్మానించారు. అల్లూరి, ఆయన అనుచరుల వారసులను ప్రత్యేకంగా పరామర్శించి, సత్కరించారు. తొలుత అల్లూరి సోదరుడు సత్యనారాయణరాజు పెద్ద కుమారుడు శ్రీరామరాజు (83)ను మోదీ సన్మానించారు. నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి అనుచరుడు గంటందొర మనవడు గాం బోడిదొర (90)ను చక్రాల కుర్చీలో తీసుకువచ్చారు. ఆయనను ప్రధాని మోదీ శాలువాతో సత్కరించి, నమస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులను కొద్దిమందిని ప్రధాని విడిగా కలిశారు. వారిలో తాడేపల్లిగూడెంకు చెందిన ప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుమార్తె కూడా ఉన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో ప్రారంభించి, స్వాతంత్ర్యోద్యమంలో ఆ దంపతులు చరుకుగా పాలుపంచుకున్నారు.


ఆ సమయంలో అంజలక్ష్మిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అరెస్టు సమయానికి గర్భవతి అయిన ఆమె జైలులో ఉండగా పాపకు జన్మనిచ్చారు. శ్రీకృష్ణుని మాదిరిగా జైలులో జన్మించినందుకు కృష్ణ... దేశం కోసం జైలుకు వచ్చినపుడు జన్మించిందనడానికి గుర్తుగా భారతి... కలిపి కృష్ణభారతిగా నామకరణం చేశారు. ఈ విశేషాలను సభలో వివరించారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కృష్ణభారతి చక్రాల కుర్చీలో వచ్చారు. ఆమెను ప్రధాని మోదీ శాలువాతో సత్కరించారు. అనంతరం కాళ్లకు నమస్కారం చేసి, ఆమె ఆశీర్వచనం తీసుకున్నారు.


ఆద్యంతం ఉత్సాహం..

ఈ ఉత్సవాల్లో అల్లూరి, మన్యం వీరుల వారసులు ఆకర్షణగా నిలిచారు. మన్యం జిల్లా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా ఆహ్వానించి తీసుకొచ్చారు. వీఐపీ గ్యాలరీలో వారికి ప్రత్యేకంగా కూర్చునే ఏర్పాటు చేశారు. సభ ఆద్యంతం వారిలో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా వారిని ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది.   


గర్వంగా ఉంది

మా తాత సత్యనారాయణ రాజు. సీతారామరాజుకు సోదరుడు. కోట్ల సంపాదన ఉన్నా తెలుగుజాతి అభిమానానికి సాటిరాదు. అంత పెద్ద మన్ననలు పొందుతున్న అల్లూరి వారసులుగా గర్వపడుతున్నాం. 

- రామచంద్రవర్మ, అల్లూరి సోదరుడి మనవడు


ఎంతో సంతృప్తిగా ఉంది..

మా అమ్మ నాగరామలక్ష్మి. ఆమె తండ్రి, మా తాత సుబ్బరాజు అల్లూరి సీతారామరాజుకు సోదరుడు. అల్లూరి వారసులు కావడం ఎంతో సంతృప్తిగా ఉంది. 

- ఉషారాణి, అల్లూరి సోదరుడి మనవరాలు 


సంతోషంగా ఉంది

మా ముత్తాత గంటం దొర బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అల్లూరికి చేదోడు, వాదోడుగా ఉన్నారని కథలుగా చెప్పుకుంటారు. అవి విన్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం అల్లూరి జయంతి ఉత్సవాలు నిర్వహించడం, మమ్మల్ని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది.

- రాజబాబు, గంటం దొర మునిమనవడు 

Updated Date - 2022-07-05T08:19:12+05:30 IST