ప్రాథమిక విద్యపై పిడుగు

ABN , First Publish Date - 2022-05-17T06:49:14+05:30 IST

ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు.

ప్రాథమిక విద్యపై పిడుగు

దశల వారీగా పాఠశాలల ఎత్తివేతకు సర్కారు యత్నం

నూతన విద్యా విధానం పేరిట చర్యలు 

ఉన్నత పాఠశాలల్లో విలీనంతో నష్టమే

పిల్లల మధ్య వయస్సు తేడాతో తీవ్ర ఇబ్బందులు

డ్రాపౌట్స్‌ శాతం పెరిగే ప్రమాదం 

ఇక నుంచీ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన 

ఉపాధ్యాయులపై పెరగనున్న పనిభారం

ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న టీచర్లు

నేడు టెన్త్‌ మూల్యాంకన కేంద్రాల్లో నిరసనలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. నూతన విద్యా విధానంతో ఏదో సాధించాలనుకునే పాలకులు...అసలుకే ఎసరు పెడుతు న్నారని మండిపడుతున్నారు. 

విలీనంలో భాగంగా రాష్ట్రంలో ఇక నుంచి తెలుగు మాధ్యమం ఉండదు. అంతా ఆంగ్ల మాధ్యమమే...దీంతో ఆంగ్లంలో చదవడానికి భయపడే విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యే ప్రమాదముంది. ఇది భవిష్యత్తులో పెను సమస్యకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన జరుగుతుండడం వల్ల వేర్వేరుగా టీచర్లు ఉండేవారని, ఇక నుంచీ ఒకటే మాధ్యమం చేస్తుండడంతో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల నుంచి టీచర్లను బదిలీ చేస్తారని, దీనివల్ల పనిభారం పెరుగుతుందని చెబుతున్నారు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా ఉన్నత పాఠశాలలకు సమీపంలో గల ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతుల పిల్లలను తరలిస్తున్నారు. తొలి విడతగా ఉమ్మడి జిల్లాలో 170 ప్రాథమిక పాఠశాలలు విలీనం చేసిన విద్యా శాఖ, వచ్చే ఏడాది 310 ప్రాఽథమిక పాఠశాలల విలీనానికి నిర్ణయించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం నూతన విద్యా విఽధానం అమలుచేయనున్నది. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలలను దశల వారీగా ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. దీనివల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయని టీచర్లు పెదవి విరుస్తున్నారు.

ఉన్నత పాఠశాలలపై ఒత్తిడి 

ప్రాథమిక పాఠశాలల విలీనంతో ఉన్నత పాఠశాలలపై ఒత్తిడి పెరుగుతుంది. 3,4,5 తరగతుల పిల్లలు ఉన్నత పాఠశాలలకు వెళితే అక్కడ వసతి సమస్య ఎదురవుతుంది. ఇదే సమయంలో మిగులు పేరిట ప్రాథమిక పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేస్తారు. అయినప్పటికీ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పనిభారం పెరగనున్నది. ఉన్నత పాఠశాలల్లో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు ఉంటారు. 61 మంది విద్యార్థులుంటేనే రెండో సెక్షన్‌ ఇస్తారు. ఇప్పటివరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు వేర్వేరుగా సబ్జక్టు టీచర్లు ఉన్నారు. ఇక నుంచి ఒక్క ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని టీచర్‌ పోస్టులు కేటాయించనున్నారు. 9,10 తరగతులకు సంబంధించి రెండు మాధ్యమాలను ఒక్కరే బోధన చేయాలి. దీనివల్ల టీచర్లపై పనిభారం పెరిగి నాణ్యమైన బోధన అందదు. ఇప్పటివరకు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వారానికి 30 నుంచి 32 పీరియడ్లు బోధన చేస్తున్నారు. కొత్తగా 3,.4,5 తరగతులు రావడంతో వారానికి 40 నుంచి 42 పీరియడ్లు బోధించాల్సి ఉంటుందని అంచనా.


ఆంగ్ల మాధ్యమంపై మోజు  

నూతన విద్యా విఽధానంతో కేవలం ఆంగ్ల మాధ్యమం మాత్రమే బోధిస్తారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల పిల్లలకు ఆంగ్లంలోనే తరగతులు నిర్వహిస్తు న్నారు. కానీ 9, 10 తరగతుల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో తరగతులున్నాయి. విలీనం తరువాత ఒకటే మాధ్యమం ఉంటున్నందున ఒక మాధ్యమం బోధించే టీచర్‌ పోస్టులు రద్దు చేస్తారు. కానీ 9,10 తరగతులకు రెండు మాధ్యమాలను బోధించడానికి టీచర్ల కొరత ఏర్పడనున్నది. 


మానసిక అంతరం 

ప్రాఽథమిక, ఉన్నత పాఠశాలల పిల్లల మధ్య మానసిక వ్యత్యాసం ఉంటుంది. ప్రాఽథమిక పాఠశాలల పిల్లలను ఒక పీర్‌ గ్రూపుగా, ఉన్నత పాఠశాలల పిల్లలకు ఒక పీర్‌ గ్రూప్‌గా పరిగణిస్తారు. ఒకే వయస్సు పిల్లలు కలిసి మెలిసి చదువుకుంటారు. వారిని ఎక్కువ వయస్సుండే పిల్లలతో కలిపితే వారి మధ్య మానసిక అంతరం బయటపడుతుంది. ఇంకా ప్రాథమిక విద్య బోధించే పిల్లలకు డైట్‌లో శిక్షణ పొందిన సెకండరీగ్రేడ్‌ అభ్యర్థులను టీచర్లుగా నియమి స్తున్నారు. అదే ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు బోధనకు బీఈడీ శిక్షణ పొందిన అభ్యర్థులను స్కూల్‌ అసిస్టెంట్లుగా నియమిస్తున్నారు. పాఠశాలల విలీనంతో ప్రస్తుత పాఠశాల ల్లో స్కూలు అసిస్టెంట్లు ప్రాఽథమిక పాఠశాల పిల్లలకు తరగతులు తీసుకోవాల్సి వస్తే వారికి అర్థమయ్యే రీతిలో బోధించడం కష్టమవుతుంది. దీనివల్ల టీచర్‌, విద్యార్థి మఽధ్య అంతరం పెరిగిపోతుంది. 


17న మూల్యాంకన కేంద్రాల వద్ద నిరసన

ప్రాఽథమిక పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో మంగళవారం పదో తరగతి మూల్యాంకంనం నిర్వహించే కేంద్రాల వద్ద నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. ప్రాథమిక విద్యకు ముప్పు కలిగించేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని భావిస్తోంది. 


విలీనంతో పిల్లలు చదువుకు దూరం

- రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ

ప్రాథమిక పాఠశాలల విలీనం వల్ల మేలు కంటే కేడు ఎక్కువ. గ్రామంలో చదువుకునే 3,4,5 తరగతుల పిల్లలు కిలోమీటరు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులుంటాయి. రోడ్లు, చెరువులు గట్లు దాటుకుంటూ వెళ్లడానికి ఇష్టపడరు. ప్రధానంగా ఆడపిల్లలను పంపడానికి తల్లిదండ్రులు విముఖత చూపుతారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతారు. అంతేకాక ఉన్నత పాఠశాలల్లో టీచర్లకు పనిభారం పెరుగుతుంది, సెక్షన్‌ల వారీగా టీచర్ల నియామయం ఉంటుంది తప్ప సబ్జక్టు వారీగా పోస్టులు ఉండవు.  వసతి సమస్య ఏర్పడుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. 


బోధనపై తీవ్ర ప్రభావం

- గోపినాథ్‌, పీఆర్‌టీయూ నాయకుడు

ఉన్నత పాఠశాలల్లో ప్రాఽథమిక పాఠశాలల విలీనం వల్ల కొత్త సమస్యలు తలెత్తనున్నాయి. నూతన విద్యా విధానం వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ, ప్రాథమిక విద్యకు ఇబ్బంది కలిగించే అంశాలు మంచివి కావు. మూడు నుంచి పదో తరగతి వరకు ఎనిమిది తరగతులు ఒకే ప్రాంగణంలోకి తీసుకురావడంతో బోధనపై తీవ్ర ప్రభావం పడుతుంది.  టీచర్ల కొరత, వసతి సమస్యలు, పిల్లల వయస్సు మధ్య తేడాలతో సమస్యలు పెరుగుతాయి. 

Updated Date - 2022-05-17T06:49:14+05:30 IST