నిర్వీర్యమౌతున్న ప్రాథమిక పరపతి సంఘాలు!

ABN , First Publish Date - 2022-03-05T07:03:17+05:30 IST

రైతాంగానికి అందుబాటులో ఉండేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. మొదట ఎటువంటి రుసుము చెల్లించకుండానే గ్రామ రైతులు ఈ సంఘాల ద్వారా పంట రుణాలు, ఎరువులు పొంది, పంటలు వచ్చిన తర్వాత తిరిగి చెల్లించేవారు. కొంతకాలం గడిచిన తర్వాత పది రూపాయలు ఇచ్చి సంఘంలో సభ్యులుగా చేరి ఆ సంఘం ద్వారానే ప్రాంతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేవారు....

నిర్వీర్యమౌతున్న ప్రాథమిక పరపతి సంఘాలు!

రైతాంగానికి అందుబాటులో ఉండేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. మొదట ఎటువంటి రుసుము చెల్లించకుండానే గ్రామ రైతులు ఈ సంఘాల ద్వారా పంట రుణాలు, ఎరువులు పొంది, పంటలు వచ్చిన తర్వాత తిరిగి చెల్లించేవారు. కొంతకాలం గడిచిన తర్వాత పది రూపాయలు ఇచ్చి సంఘంలో సభ్యులుగా చేరి ఆ సంఘం ద్వారానే ప్రాంతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేవారు.


గ్రామ సొసైటీ ఎరువులు, విత్తనాలు తీసుకొచ్చి సంఘ సభ్యులకు అందించేది. ప్రస్తుతం పరపతి సంఘాల్లో సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. సభ్యత్వ రుసుం 300 రూపాయలైంది. ఈ సంఘాల ఎన్నికలు కూడా పంచాయతీ ఎన్నికల మాదిరిగా తయారయ్యాయి. గెలుపు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా ఈ సంఘాల్లో కూడా అవినీతి తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉన్నవారు తమకు ఇష్టమైన వారినే కొత్తగా సభ్యులుగా చేర్చుకుంటున్నారు.


భారతదేశంలో సహకార ఉద్యమం 19వ శతాబ్దం చివరలో ప్రారంభమైంది. గ్రామాల్లో అధిక వడ్డీలను దండుకునే వారికి వ్యతిరేకంగా సహకార వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైతాంగానికి రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర సహకార బ్యాంకులకు నాబార్డు నిధులు కేటాయిస్తే, దాని నుంచి జిల్లా సహకార బ్యాంకులకు, అక్కడి నుంచి ప్రాంతీయ బ్యాంకులకు నిధులు విడుదల అయ్యేవి. సహకార బ్యాంకులు ప్రాథమికంగా రైతులకు, చిన్న మొత్తాల రుణ గ్రహీతలకు రుణ సహకారం అందించాలి. ఈ బాధ్యతను నేడు సహకార సంఘాలు, సహకార బ్యాంకులు సరిగా నెరవేర్చలేక పోతున్నాయి.


1980 వరకు రైతాంగానికి రుణాలు అందించటంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషించాయి. వాణిజ్య బ్యాంకుల వద్దకు వెళ్లే రైతులు చాలా తక్కువగా ఉండేవారు. నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచ వాణిజ్య ఒప్పందం, పాలకుల ప్రైవేటీకరణ విధానాల వల్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల, బ్యాంకుల వ్యవస్థ బలహీనపడి సేద్య రుణాల్లో వాణిజ్య బ్యాంకుల ఆధిపత్యం ఏర్పడింది.


2015 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 92,789 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉండగా 12.11 కోట్ల సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2,051 ప్రాథమిక సంఘాలున్నాయి. వీటిలో అధిక శాతం పంట రుణాలకే పరిమితమయ్యాయి. ఇతర రుణాల్లో అధికార పార్టీల రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రాజకీయ పరపతి కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ సంఘాల్లో అవినీతి పేరుకుపోతున్నది. పెద్ద నోట్ల రద్దు సమయంలో సహకార బ్యాంకులు కుంభకోణాలకు నిలయంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం లొసుగులను ఉపయోగించుకుని రైతుల పేరుతో సంపన్న వర్గాలు కోట్లాది రూపాయలు సహకార బ్యాంకుల్లో జమ చేయటం వాటి అవినీతికి నిదర్శనం. రాష్ట్రంలోని ప్రాథమిక సంఘాల్లో 45శాతం నష్టాల్లో ఉన్నాయి. నాబార్డు జాతీయ సమ్మిళిత అధ్యయనం (2016–17) ప్రకారం దేశంలో సంస్థాగత రుణాలు  పొందుతున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య చాలా తక్కువ ఉంది.


చత్తీస్‌గఢ్‌లో 26, మధ్యప్రదేశ్‌లో 35, రాజస్థాన్‌లో 31 శాతం గ్రామీణ కుటుంబాలకే రుణాలు అందగా, వీరిలో సంస్థాగత రుణాలు పొందిన వారు వరుసగా 16, 21, 19శాతంగా ఉన్నారు. వాస్తవంగా పొలం దున్ని పంటలు పండించే రైతులకు బ్యాంకులు రుణాల ఇవ్వటం లేదు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు భూ యజమానులకు ఇస్తున్నట్లుగానే పంట రుణాలు సైతం వారికే ఇస్తున్నాయి. కౌలు రైతులకు రుణాలు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా లక్షన్నర వరకు పంట రుణాలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు సూచనలను బ్యాంకులు పాటించటం లేదు.


క్రమక్రమంగా రైతాంగానికి సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలు తగ్గిపోతున్నాయి. 2015–16లో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చిన రుణాలు 17 శాతం అయితే, 2018 నాటికి 12 శాతానికి తగ్గిపోయాయి. ఇదే కాలంలో వ్యవసాయ రుణాలు 3.39 లక్షలకు పెరిగాయి. దీన్ని గమనిస్తే సహకార బ్యాంకుల రుణాలు తగ్గి, వాణిజ్య బ్యాంకుల రుణాలు పెరిగాయి. 2020లో 76% రుణాలు వాణిజ్య బ్యాంకులే రైతులకు ఇచ్చాయి. వాణిజ్య బ్యాంకుల రుణ నిర్ణయం, వడ్డీ విధానం రైతాంగానికి నష్టదాయకంగా ఉంది. రైతుల పేరుతో సంపన్న కుటుంబాలు బ్యాంకుల నుంచి రుణాలు  పొందుతున్నాయి. ఇంతకు ముందు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉండేది.


నేడు మూడు లేక నాలుగు సంఘాలను ఒకే సంఘంగా, అలాగే బ్యాంకులను ఒకే బ్యాంకు పరిధిలోకి మార్చారు. ఫలితంగా అనేక ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య బ్యాంకుల కన్నా గ్రామీణ ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, బ్యాంకులు రైతాంగానికి అందుబాటులో ఉంటాయి. సంఘ సభ్యులందరూ పంట రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల వ్యాపార సరళి వలన అత్యధిక రైతాంగానికి పంట రుణాలు అందడం లేదు. సహకార బ్యాంకుల, సంఘాల అవినీతిని అరికట్టి, సంఘాల్లో విస్తృతంగా సభ్యులు చేరే విధంగా సభ్యత్వ రుసుము తగ్గించి, కౌలు రైతులను కూడా సభ్యులుగా చేర్చుకోవాలి. నాబార్డు ద్వారా సహకార బ్యాంకులకు ఎక్కువ నిధులు కేటాయించాలి. ఆవిధంగా సహకార సంఘాలను, బ్యాంకులను పటిష్టపర్చాలి. ఇందుకోసం రైతాంగం ఆందోళన చేయాలి.

 బొల్లిముంత సాంబశివరావు

రైతు కూలీ సంఘం

Updated Date - 2022-03-05T07:03:17+05:30 IST