గుడిలో కొబ్బరికాయను అసలు ఎందుకు కొడతారు..? లోపల కుళ్లిపోయి ఉంటే అర్థమేంటి..?

ABN , First Publish Date - 2021-10-01T02:01:37+05:30 IST

ఆలయాలకు వెళ్లినప్పుడు ఏది మరచిపోయినా.. టెంకాయ తీసుకెళ్లడం మాత్రం మరచిపోరు. ఎందుకంటే గుడికి వెళ్తున్నామంటేనే విధిగా టెంకాయ కొట్టడమనేది మన హిందూ సంప్రదాయం. అయితే ఇప్పటి యువత.. గుడికి వెళ్లామా, దేవుడికి దండం

గుడిలో కొబ్బరికాయను అసలు ఎందుకు కొడతారు..? లోపల కుళ్లిపోయి ఉంటే అర్థమేంటి..?

ఆలయాలకు వెళ్లినప్పుడు ఏది మరచిపోయినా.. టెంకాయ తీసుకెళ్లడం మాత్రం మరచిపోరు. ఎందుకంటే గుడికి వెళ్తున్నామంటేనే విధిగా టెంకాయ కొట్టడమనేది మన హిందూ సంప్రదాయం. అయితే ఇప్పటి యువత.. గుడికి వెళ్లామా, దేవుడికి దండం పెట్టుకున్నామా, టెంకాయ కొట్టామా.. ఇదే ఆలోచనలోనే ఉంటారు. టెంకాయ కొట్టాక.. అది కుళ్లితే భయపడడం, అందులో పువ్వు వస్తే సంతోష పడడం మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. అయితే దేవుడికి.. అసలు టెంకాయ ఎందుకు కొడతారు, లోపల కుళ్లితే అర్థం ఏంటి.. అనేది చాలామందికి తెలియదు. 


టెంకాయను మనిషితో పోల్చుతారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కొబ్బరి కాయ మీద ఉండే పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అలాగే గుండ్రంగా ఉండే కాయను ముఖంతో, లోపల ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక కాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసు అని భావిస్తారు. టెంకాయ కొడితే.. మనసులోని కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్నీ తొలగిపోతాయని వేద పండితులు సూచిస్తున్నారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని ధర్మబద్ధమైన కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళయిన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుందని నమ్మకం. అదేవిధంగా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుక్కు గానీ సంతానం సిద్ధిస్తుందని భావిస్తుంటారు.


టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే చాలామంది ఆందోళన చెందుతారు. అయితే ఎలాంటి భయమూ అవసరం లేదని పండితులు చెబుతున్నారు. మనసులోని కుళ్లు బయటికి పోయిందని భావించాలని సూచిస్తున్నారు. అయితే ఇంట్లో గానీ, ఆలయంలో గానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే.. కుళ్ళిపోయిన భాగాన్ని తీసేసి చేతులు, కాళ్ళు కడుక్కుని మళ్ళీ పూజ చేయాలి. అదేవిధంగా వాహన పూజ సమయంలో టెంకాయ కుళ్ళిపోతే, ఆ వాహనానికి దిష్టి పోయిందని అర్థం చేసుకోవాలి. అయితే దేవుడికి టెంకాయ, పువ్వు, పండు.. ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. వస్తువు ఏదనేది ప్రధానం కాదని, నిర్మలమైన మనస్సుతో ఏదిచ్చినా దేవుడు స్వీకరిస్తాడని వేద పండితులు చెబుతున్నారు.

Updated Date - 2021-10-01T02:01:37+05:30 IST