పేదలపై ప్రతాపం

ABN , First Publish Date - 2022-05-24T06:05:55+05:30 IST

కడప నగరంలో ప్రస్తుతం సుమారు 4 లక్షల జనాభా ఉంది. నగరంలో చెరువులు, కుంటలు ఉండేవి. ఇవి నగరం నడిబొడ్డున ఉండడంతో వాటిని పెద్దలు ఆక్రమించేశారు. కాలువలు, కుంటల ఆక్రమణతో కడప నగరం మూడేళ్లుగా మునకకు గురవుతోంది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి అనేకమార్లు కథనాలుగా వెలువరించింది.

పేదలపై ప్రతాపం
రామాంజనేయపురంలోని వడ్డెర కాలనీలో సోమవారం ఎక్సకవేటర్‌తో ఇళ్లను కూల్చుతున్న దృశ్యం

వరద కాలువ ఆక్రమణ పేరిట పేదల ఇళ్లు కూల్చివేత 

నోటీసులు ఇవ్వకుండానే అధికారుల దాష్టీకం 

ప్రభుత్వం కట్టించిన ఇళ్లు కూడా అక్రమమేనట..! 

గడువు ఇస్తే ఖాళీ చేస్తామన్నా ఒప్పుకోకుండా కూలగొడుతున్న వైనం 

అర్ధరాత్రి కూల్చేస్తే మేము ఎక్కడుండాలి : బాధితుల ఆవేదన 

ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపు

మీ కథ చూస్తామని హెచ్చరిక

ఆపన్న హస్తం కోసం పేదల ఎదురుచూపులు


అది నిన్నా... మొన్న వెలసిన కాలనీ కాదు... అది పేదల మాటున పెద్దలు ఆక్రమించేసిన ఏరియా కాదు. ఇక్కడి స్థలం ఆక్రమిస్తే మరో 40 ఏళ్లకు లక్షాధికారులం అవుతామన్న దూరదృష్టి ఉన్న రియల్టర్లూ కాదు. వారంతా పేదలు.. పొద్దస్తమానం కష్టపడడం ఆ సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకోవడం మాత్రమే తెలిసిన వారు. పట్టణంలో అద్దె కట్టలేక శివారు ప్రాంతంలోనే గుడిసెలు వేసుకొని బతుకుబండి సాగిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారికి ఇంటి స్థలం కేటాయించి 20 ఏళ్ల క్రితమే ఇళ్లను నిర్మించి ఇచ్చాయి. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకున్నారని.. ఇది దురాక్రమణ అంటూ ప్రస్తుత ప్రభుత్వంలో ఇళ్లకు ఇళ్లే కొట్టేస్తున్నారు. వచ్చేది వర్షాకాలం.. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చేస్తే మేమెక్కడుండాలి అని బాధితులు ప్రశ్నిస్తే.. స్టేషన్‌కు రావాలంటూ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్లు... ప్రభుత్వమే ఇళ్లు కట్టించింది. పన్ను కడుతున్నాం. ఇప్పుడు ఎలా కూలుస్తారు అని అడిగితే... మీ కథ చెబుతాం అంటూ రెవెన్యూ నుంచి బెదిరింపులు.. అన్ని విధాలుగా న్యాయం చేస్తామంటూ ఓట్లు వేయించుకుని గెలిచిన వ్యక్తి వద్దకు వెళ్లి.. సార్‌ మాకు అన్యాయం జరుగుతోంది న్యాయం చేయండంటే ఆ నేత రెండు చెవుల్లో వేళ్లు పెట్టుకొని నాకు డిస్టర్బెన్స్‌గా ఉంది. మీరు కోర్టుకు వెళ్లండంటూ ఉచిత సలహా... అటు ఓట్లు వేయించుకున్నోళ్లు కరుణించక.. ఇటు పట్టాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలే పట్టించుకోకుండా కూల్చేస్తున్నారు. మా గోడు వినే నాధుడు ఎవరంటూ ఆ పేదలు విలపిస్తున్నారు. ఈ దాష్టీకం ఎక్కడో జరగడం లేదు. కడప నగరం నడిబొడ్డున జరుగుతోంది. వరద కాలువల ఆక్రమణ పేరిట, కడప అధికార యంత్రాంగం పేదలపై సాగిస్తున్న దుర్మార్గమిది.


కడప, మే 23 (ఆంధ్రజ్యోతి):  కడప నగరంలో ప్రస్తుతం సుమారు 4 లక్షల జనాభా ఉంది. నగరంలో చెరువులు, కుంటలు ఉండేవి. ఇవి నగరం నడిబొడ్డున ఉండడంతో వాటిని పెద్దలు ఆక్రమించేశారు. కాలువలు, కుంటల ఆక్రమణతో కడప నగరం మూడేళ్లుగా మునకకు గురవుతోంది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి అనేకమార్లు కథనాలుగా వెలువరించింది. నగరం మునకకు కారణం ఏంటి.? ఎక్కడెక్కడ ఆక్ర మణలు.? అన్నింటిని సవివరంగా విశదపరిచింది. ముంపు బాధితుల అవస్థలను కూడా కళ్లకు కట్టినట్లు వివరించింది. అయితే లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఒక ప్రకణాళిక లేకుండా వర్షాకాలం నాటికి ఏదో పూర్తి చేయాలన్న హడావిడితో అధికార యంత్రాంగం బడుగుల కాలనీలపై పడింది. ఎలాంటి సమాచారం లేకుండానే ఈ ఇళ్లను కూల్చివేయడం మొదలు పెట్టింది. ప్రశ్నించిన వారిపై పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం బెదిరింపులకు దిగుతోంది.

ప్రభుత్వమే ఇల్లు కట్టించింది

కడప నగరంలో ఆక్రమణల తొలగింపునకు అధికార యంత్రాగం నాలుగు టీములను ఏర్పాటు చేసుకుంది. రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌, కార్పొరేషన్‌ అధికారులు టీములుగా ఏర్పడ్డారు. ఆక్రమణ తొలగింపులకు సిద్ధమయ్యారు. తొలుత ఆక్రమణల తొలగింపుపై అధికారుల ప్రయత్నాన్ని అందరూ ఆహ్వానించారు. అయితే అధికార యంత్రాంగం ఆచరణలో పేదల ఇళ్లనే కూల్చడం విమర్శలకు తావిస్తోంది. అధికారులకు పేదలు తప్ప పెద్దలు కానరారా అంటూ విమర్శలు వస్తున్నాయి. మూడవ డివిజన్‌లోని వడ్డెర కాలనీ, నిరంజన్‌నగర్‌, యానాది కాలనీలలో ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఓ కాలువ ఆక్రమణకు గురైందని పోలీసు బందోబస్తుతో రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులు తొలగిస్తున్నారు. ఎక్సకవేటర్లతో ఇళ్లను కూలగొడుతున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే ఇక్కడ చాలా మటుకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే ఇచ్చింది. స్థోమత లేనివారికి ప్రభుత్వమే గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో ఇళ్ల్లు కట్టించింది. వడ్డెర కాలనీ ఒకప్పుడు కడప నగరానికి శివారుల్లో ఉండేది. 1973-74 మధ్య అక్కడ చిన్న చిన్న గుడిసెలతో కాలనీ ఏర్పడింది. అక్కడంతా పేదలే. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. 1999 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అక్కడ ఇళ్లులేని పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చింది.

23 ఏళ్ల తరువాత వచ్చి.. 

వ్యక్తులు ముఖ్యం కాదు... వ్యవస్థలు శాశ్వితం. 1999లో పేదలకు ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది. అప్పట్లోనే పలువురికి గృహ నిర్మాణశాఖ ఇళ్లను నిర్మించింది. అయితే ఇప్పుడు ఈ కాలువ ఆక్రమణకు గురైందంటూ వడ్డెర కాలనీ, నిరంజన్‌నగర్‌, యానాది కాలనీలలో కాలువ చుట్టు పక్కల ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. ఇల్లు నిర్మించి ఇచ్చింది. మాదెక్కడ ఆక్రమణలు సార్‌.. అంటే వారిపై విరుచుకుపడుతున్నారు. పట్టాలు చూపిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. సార్‌ నోటీసు ఇవ్వకుండా ఇళ్లు కూల్చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమంటూ అడిగినవారిపై అధికార జులుం చూపిస్తున్నారు. ఈ గొడవంతటికీ కారణం నువ్వేనంటూ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ చేయిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం సార్‌ అని రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే నీ కథ చూస్తా నీ ఇల్లు పడగొడతా అంటూ రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఓట్లు వేయించుకున్న ఓ పాలకవర్గ ప్రజానేత వద్దకు బాధితులు వెళితే.. తమగోడు వినకుండా చెవుల్లో రెండు వేళ్లు పెట్టుకొని నిస్సిగ్గుగా వ్యవహరిచారంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఇళ్లు కూలగొట్టేది ఆపాలని, తమకు నిలువ నీడ లేకుండా చేయొద్దని వేడుకుంటున్నారు. ‘‘జగనన్నా.. నేను విన్నాను.. నేను కన్నాను అన్నావు.. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దారుణం నీకు కనిపించడం లేదా’’ అని వీరు ప్రశ్నిస్తున్నారు.


ఇదెక్కడి న్యాయం

- గండికోట వెంకటసుబ్బయ్య, వడ్డెర కాలనీ 

వడ్డెర కాలనీలోని పేదలకు 1999లో అప్పటి ప్రభుత్వమే ఇంటి స్థలాలు ఇచ్చింది. కొందరికి గృహ నిర్మాణశాఖ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. 23 ఏళ్ల తరువాత ఇప్పుడు వచ్చి మీరు స్థలాలు ఆక్రమించారంటూ ఇళ్లను కూలగొడుతున్నారు. సార్‌ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని చెప్పినా.. మా మాట వినకుండా బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వం స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు కట్టించినా ఇప్పుడు మా బాధ వినకుండా కూల్చేస్తున్నారు. 


ఎక్కడికెళ్లాలి..?

- ఓరు చిన్నక్క, వడ్డెర కాలనీ 

సుమారు 50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది. ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్థలం ఆక్రమణ అంటూ మా ఇళ్లను కూలగొడుతున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. ఉన్నట్లుండి ఇల్లు కూలగొడితే మేమె ఎక్కడుండాలి. ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు.


వానాకాలంలో ఎక్కడుండాలి

- గండికోట సుమలత 

ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టించింది. కూలీ నాలీ చేసుకుంటూ మా బతుకులు మేము బతుకుతున్నాం. అయితే ఇప్పుడు ఆక్రమణలు అంటూ ఇల్లు కూలుస్తున్నారు. ఇదెక్కడి న్యాయం సార్‌ అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇల్లు పడగొడితే చిన్న పిల్లలు, గర్భిణీలు ఉన్నారు. ముందు గా సమాచారం ఇవ్వకుండా ఇల్లు పడగొడుతున్నారు. ఇల్లు పడగొడితే వానాకాలంలో ఎక్కడుండాలి.


పేదల ఇళ్లు కూల్చడం లేదు 

- శివరామిరెడ్డి, తహసీల్దార్‌, కడప 

రెండేళ్ల క్రితం వచ్చిన వరద లతో కడప నగరం జలమయం అయింది. ముంపు నుంచి కడపను కాపడుకునేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నాం. ఏడు టీములు ఏర్పాటు చేశాం. చెరువులు, వంకల్లో ఉన్న ఆక్రమణలు తొలిస్తున్నాం. పేదల ఇళ్లను కూల్చడం లేదు.





Updated Date - 2022-05-24T06:05:55+05:30 IST