ధరలు! ధరలు! ఆకాశాన్నంటే ధరలు!

ABN , First Publish Date - 2022-01-21T09:34:08+05:30 IST

చాలా ఇళ్ళల్లో ధరల గురించిన రోదనలు కూడా వింటూనే వుంటాం. లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ, పెద్ద పెద్ద జీతాలూ, వచ్చి పడే ఇళ్ళల్లో తప్ప!...

ధరలు! ధరలు! ఆకాశాన్నంటే ధరలు!

‘‘ఇండియాలో ధరలు, గత 5 నెలల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి.’’ (ఒక దిన పత్రిక)

‘‘అమెరికాలో ధరల పెరుగుదల, గత 39 ఏళ్ళలో లేనంత ఎక్కువగా వుంది.’’ (ఇంకో దిన పత్రిక)

చాలా ఇళ్ళల్లో ధరల గురించిన రోదనలు కూడా వింటూనే వుంటాం. లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ, పెద్ద పెద్ద జీతాలూ, వచ్చి పడే ఇళ్ళల్లో తప్ప!

ఆ మధ్య, 75ఏళ్ళాయన ఒకరు, చాలా బాధగా మాట్లాడారు. ఏమని? ‘‘నేను అరవైయేళ్ళ కిందట, సికిందరాబాదులో, తాజ్ మహల్ హోటల్లో ఒక్క పావలాతో, రెండు ఇడ్లీలు, కొబ్బరి చట్నీతో, సాంబారుతో తినేవాణ్ణి. ఆ ఇడ్లీల ప్లేటుకే ఇప్పుడు ‘అరవై’ రూపాయల ధర! ఏమిటీ ఈ వింత? ఇడ్లీ ధర ఇంతగా ఎందుకు పెరిగింది?’’

ఆ ఇడ్లీ ప్రియుడే కాదు, వేరే పెద్ద వాళ్ళు కూడా, ‘‘నా చిన్నప్పుడు కొబ్బరి కాయ పావలాయే! ఇప్పుడా? మొన్న కొబ్బరి కాయని ముప్పయ్‌తో, కొబ్బరి బొండాన్ని యాబైతో కొన్నాం’’ అన్నారు. 


చాలా కాలంగా సరుకుల్ని కొనే శ్రామికులకు తెగ విచారాలు! ‘ధర’ అంటే, ‘మారకం విలువ’ అని చదివాం. పైగా ‘టెక్నాలజీ’ అనేది పెరుగుతోంటే, సరుకు తయారీకి పట్టే, ‘శ్రమ కాలం’ తగ్గుతుందనీ; శ్రమ కాలం తగ్గి, ధర తగ్గుతుందనీ; మార్క్సు ‘కాపిటల్’ పుస్తకంలో చదివాం. మరి, ఇప్పుడు అదే సరుకుల తయారీలకు, శ్రమ కాలాలు పెరిగి పోతున్నాయా?


ప్రతీ దేశంలోనూ ‘‘ద్రవ్యోల్బణం! ద్రవ్యోల్బణం!’’ అని పత్రికల్లో చదువుతూ వుంటాం. ‘‘ద్రవ్యోల్బణం!’’ అంటే, చలామణీలో వుండవలిసిన ద్రవ్యం (డబ్బు లెక్క), సమాజంలో తయారవుతోన్న సరుకుల విలువల్ని బట్టి ఉండడం గాక, దాన్ని మించిపోయి వుండడం! చలామణీలో తిరగవలిసిన మొత్తం డబ్బు 100 రూపాయిలే అయితే, దాన్ని మించిపోయి, 200 రూపాయలు వుంటే? ఆ సరుకు విలువ తగ్గిందా? తగ్గినది సరుకు విలువ కాదు. రూపాయి విలువ తగ్గి సగం అవుతుంది. ఒక రూపాయితో కొనే సరుకు, రెండు రూపాయలు ఇచ్చి కొనవలిసి వస్తుంది! ఆ సరుకు విలువ ఎలా మారిందో,  దాన్ని కొన్నవాళ్ళకి తెలీదు. చలామణీలో, 200 గాక, 500 రూపాయలు వుంటే? రూపాయి విలువ ఇంకా తగ్గి, సరుకు ధర ఇంకా ఎక్కువ అవుతుంది.


దీని మీద 100 ప్రశ్నలు రావాలి. చలామణీలో వుండే డబ్బు మొత్తం, ఎందుకలా పెరుగుతుంది? ఎవరు దాన్ని పెంచుతారు? అలా పెంచితే, ప్రతీ సరుకుకీ, ధర పెరిగి పోతుందని వాళ్ళకి తెలీదా? తయారైపోయివున్న సరుకుకి శ్రమ కాలమే పెరిగి, ధర పెరిగినట్టా? అది ‘మారకం విలువ సూత్రానికి’ వ్యతిరేకం కాదా? సరుకుల్ని అమ్మేవాళ్ళు, వాళ్ళకి కావలిసినట్టే ధరల్ని పెంచేసి, అమ్మెయ్యగలరా? కొనేవాళ్ళు కొనెయ్యగలరా? మరి, పరిపాలన చేసే ప్రభుత్వం బాధ్యత ఏమిటి? డబ్బు రాసి పెరిగి పోతోంటే, ధరలు పెరిగి పోతోంటే, అదంతా చూస్తూ వుండడమేనా? అసలు, అదంతా చేసేది ఎవరు? ఎవరో కాదు, ప్రభుత్వమే! డబ్బుని విడుదల చేసే ప్రభుత్వపు రిజర్వ్ బ్యాంకుకి అంతకన్నా దారి వుండదు.


ఏ దేశంలో అయినా, పాతకాలంనాటి గానీ, ఈ ప్రస్తుత కాలంనాటి గానీ, ప్రభుత్వ పాలనల్ని తీసుకుంటే, వాటికి రెండు పద్ధతులు ఉంటాయి. తెలియకే తప్పు చేసే పద్ధతి ఒకటీ; తెలిసినా, తమకేదో ప్రయోజనం కోసం, తప్పునే పాటించే పద్ధతి ఇంకొకటీ! ప్రభుత్వాలకు, ‘డబ్బూ, విలువా’ వంటి వాటి గురించి తెలియనిదంతా పాత పద్ధతి! ‘విలువ’ అనేది, సరుకుల తయారీల కోసం అవసరమైన శ్రమకాలాన్ని బట్టి, తక్కువ గానో, ఎక్కువ గానో, వుంటుందని; ఇదంతా మార్క్సు రాసిన ‘కాపిటల్’ రాకముందు, ఏ దోపిడీ వర్గ ప్రభుత్వానికీ, ఆ ప్రభుత్వ సేవల్లో వుండే ఏ ఆర్థికవేత్తకీ తెలీదు.


పోనీ, మార్క్సు రాసిన తర్వాతైనా, ‘విలువ’ గురించీ, ‘డబ్బు’ గురించీ, ప్రస్తుత ప్రభుత్వాలకైనా, తెలిశాయా? తెలిసే వుంటాయి. తెలిసినా ఒప్పుకోరు. వాళ్ళ వర్గ ప్రయోజనాలు, స్వంత శ్రమలు లేకుండా బ్రతకెయ్యడం కదా?


ఆ గొడవలన్నీ చాలు! ‘ధరల’ పెరుగుదలల గురించే చెప్పుకుందాం. ఏ సరుకుకైనా దాన్ని తయారు చేసే శ్రమకాలం పెరిగితే, అందువల్ల దాని విలువ పెరిగితే, అది సరైనదే. కానీ, 50–60 ఏళ్ళ కిందట, ఒక పావలా విలువ గల సరుకుకి, ఇప్పుడు 60 రూపాయల ధర ఏర్పడిందంటే, ఆ నాటి పావలా విలువా, ఈ నాటి 60 రూపాయల విలువా, రెండూ సమానమా? ఎలా సమానం? తయారైపోయి వున్న ఆ సరుకుకి పట్టిన శ్రమ కాలం పెరిగిందనా? అలా కాదు.


అసలు, వెనకటి పావలా ధర కూడా తగ్గాలి. ఉత్పత్తి స్తలాల్లోకి, కొత్త కొత్త ఉత్పత్తి పనిముట్లూ, వాటి నైపుణ్యాలూ వచ్చి, శ్రమ కాలాల్లో సుళువులు ఏర్పడి, పాత శ్రమ కాలం కూడా తగ్గుతుంది. నిజానికి, పని స్తలాల్లో అదే జరుగుతుంది! ఇప్పుడు పాత రకం సరుకులన్నిటికీ పాత శ్రమ కాలాలు తగ్గి, పాత ధరలన్నీ తగ్గిపోవాలి! ఇడ్లీ ప్లేటు ధర పావలా కన్నా తగ్గాలి. ఏ సరుకుకైనా అలాగే జరగాలి. కానీ, అలా జరగడం లేదెందుకు?

అసలు, ధరలు ఏర్పడడంలో సరైన, హేతుబద్ధ ఆర్ధిక సూత్రం ఏమిటో తెలుసా? ‘డబ్బు’ అంటే, బంగారమే. సరుకుకి, ‘అమ్మకం’ జరిగి డబ్బు రావడం అంటే, ఆ మారకం జరిగేది బంగారానికి వున్న విలువతోనే! కొత్త బంగారం గని దొరికి, ఒక బంగారం బిళ్ళకి బదులు, అదే శ్రమ కాలంతో రెండు బంగారం బిళ్ళల్ని చెయ్యగలిగితే? బంగారం బిళ్ళకి బదులుగా తిరిగే ఒక రూపాయి నోటు విలువ, సగంగా మారుతుంది. రూపాయితో కొనేదానికి బదులు, రెండు రూపాయి నోట్లు ఇవ్వవలిసి వస్తుంది. ఎందుకంటే, ఒక రూపాయి విలువే, రెండు రూపాయల్లో కలిసి వుంటుంది. ఇది, విలువలో మార్పు కాదు. డబ్బు లెక్కలో మార్పు! ఈ మార్పుకి తగ్గట్టే ‘అదనపు విలువ’ అయితే, ఎప్పటిలాగే వస్తుందనుకోండి.


పెట్టుబడిదారుల ఆలోచన ఎప్పుడూ, అదనపు విలువని (వడ్డీ, లాభాల వంటి 10 అంశాల కోసం) పెంచుకోవాలనే వుంటుంది. గనుల్లో కొత్త బంగారం దొరక్కపోయినా, దాని ‘విలువ’లో మార్పులేకపోయినా, పెట్టుబడిదారీ ప్రభుత్వ ఫ్యాక్టరీలూ, ప్రైవేటు ఫ్యాక్టరీలూ, అదనపు విలువని పెంచుకోవాలనే దృష్టితోనే ఎల్లప్పుడూ వుంటాయి. దాని కోసం ఏం చేస్తాయి? తమ ఫ్యాక్టరీలన్నీ అమ్మే సరుకుల ధరల్ని, నిష్కారణంగానే పెంచే పద్ధతులు అవలంబిస్తాయి.


కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా, ప్రభుత్వాలు హఠాత్తుగా కరెంటూ, డీజిలూ, వంట గ్యాసూ, ఇంకా అనేకమైన వాటి ధరల్ని పెంచేస్తాయి. 10గా వున్న ధర, 20గానో, 40గానో పెరిగితే, దానివల్ల తమకు మిగిలే ‘లాభం’ వంటిది పెరగాలని, ఆ కంపెనీలు ఆశిస్తాయి! ధరల పెరుగుదలలు, సమాజంలో అన్ని శాఖల్లోనూ కచ్చితంగా ఒకే రోజున ప్రారంభం కాకపోయినా, కొన్ని విరామాలతో, అన్ని సరుకుల ధరలూ క్రమంగా పెరిగిపోతాయి. ఇడ్లీ ధర పెరిగి, పూరీ ధర పెరగకపోతే, పాపం హోటళ్ళు ఎలా నడవాలి? ఇక్కడ మనకి మారకం విలువ సంగతే ముఖ్యం.


10 రూపాయల సరుకు ధర, దాన్ని తయారుచేసే శ్రమ కాలంలో మార్పు లేకుండానే, 20గా పెరిగితే, ఆ సరుకు విలువ ఏమైనట్టు? విలువ కూడా పెరిగినట్టు కాదు కదా? 10 రూపాయల విలువే, 20 రూపాయలంతకీ కూడా చేరుతుంది కదా? ప్రతీ రూపాయి నోటు విలువా, సగమే అవుతుంది కదా?

ఒక గ్లాసు చిక్కటి పాలల్లో, ఇంకో గ్లాసుడు నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఆ చిక్కటి పాల రుచీ, శక్తీ, రెండు గ్లాసుల పాలల్లోకీ విస్తరిస్తాయి. ఒక గ్లాసుడు నీళ్ళ పాలలో, పాల విలువలు సగం దాకా నశిస్తాయి! శ్రమ కాలం, పాల వంటి, భౌతిక పదార్ధం కాదు. అది, అనేక రూపాయిల్లోకి లెక్కకు వచ్చినా, అది నశించడం కాదు. 


అయితే, ఈ ధరల్ని పెంచడాలు, ఎందుకు? ఈ ధరల వల్ల అదనపు విలువ ఎలా పెరుగుతుంది? శాఖల్లో ధరల మార్పుల్లో అనేక విరామాల వల్ల, కొన్ని కంపెనీలు, తమ సరుకుల్ని ఎక్కువ ధరలతో అమ్ముకోవడమూ, ధరలు ఇంకా పెరగని సరుకుల నించీ తాము కొనడమూ– వంటి తేడాలతో ఆ కంపెనీలు కొన్ని కొత్త లాభాలు సంపాదించగలుగుతాయి. పెరిగిన ధరల్లో నించి అదనపు విలువలు పెరగడం ఎక్కువగా లేకపోయినా, కొంత పెరగడం లెక్కల్లో కనపడుతుంది.    


ఒకప్పుడు పావలాతో కొన్న సరుకుని ఇప్పుడు 60 రూపాయలతో కొన్న మనిషి, ఒక కార్మికుడే అయితే, అతనికి పాత జీతం కూడా ఆ లెక్కతోనే పెరుగుతుందా? అలా జరగదు. జీతం పెరిగితే, అతి తక్కువ శాతమే పెరుగుతుంది. జీతాలు కూడా ధరల రకంగానే పెరిగితే, అదనపు విలువలో పెరుగుదలకి అర్ధం వుండదు.


కార్మిక జనాలు తమ చిన్న స్తాయి జీతాలతో, ధరలు పెరిగిన సరుకుల్ని ఎలా కొంటారు? అంతగా కొనలేరు, తినలేరు. ఈ వర్గం ప్రజలు కొనేదంతా చాలా తగ్గిపోతుంది! కొనలేకే, తగిన సదుపాయాలు లేకే, ఆరోగ్యాలు నాశనమై, ఆస్పత్రుల్ని నింపుతారు. అయితే, ధరలు పెరిగినా, కొనే వాళ్ళలో, పెట్టుబడిదారీ వర్గమూ, ఉన్నత మేధా శ్రమల సెక్షన్లూ వుంటాయి. సరుకుల్ని అమ్మేవాళ్ళ మధ్యే, ఈ కొనడాలన్నీ ఎక్కువగా జరుగుతాయి.


ప్రభుత్వం, ధరల్ని పెంచడానికి చలామణీలోకి అవసరమైన ఎక్కువ డబ్బుని ఎలా తెస్తుంది? 10 రూపాయల నోట్లకి బదులు, 20 రూపాయల నోట్లని ప్రింటు చేయించడమే దానికుండే మార్గం. ఆ డబ్బు, ఫ్యాక్టరీల వారికే అప్పులుగా వెళ్తే, అక్కడ కార్మికులు శ్రమలు చెయ్యగా, సరుకులు తయారై, వాటికి అమ్మకాలు జరిగి డబ్బు వెనక్కి వస్తే, అప్పుడే కార్మికులకు జీతాలు! వారి శ్రమల నించే! ఆ జీతాలతోనే ధరలు పెరిగిన సరుకుల్ని కొనడం తప్పనిసరైతే, జీతాల నించీ పొదుపులు చేసుకోవడాలేమీ వుండవు.


విలువలు తగ్గిపోయిన ఆ రూపాయి నోట్ల వల్ల కూడా, అదనపు విలువలు వస్తాయా? తప్పకుండా వస్తాయి! 10 రూపాయల్లో నించీ 5 రూపాయలు అదనపు విలువగా వచ్చినట్టే, 40 రూపాయలతో అమ్మకం అయిన అదే సరుకు నించీ, 20 రూపాయల అదనపు విలువ రావడం కనపడుతుంది. అదే, వడ్డీ లాభాలుగా పంపకాలవుతుంది. సరుకులకు ‘ధరలు’ పెరగడం, శ్రామిక ప్రజలకే ఘోరమైన నష్టం. తమకు వచ్చే జీతం కూడా అదే స్తాయిలో పెరిగితే, కొనే సరుకుల ధరలు పెరగవచ్చని కాదు. ధరలూ, జీతాలూ ఒకే స్తాయిలో పెరిగితే, డబ్బు లెక్కలు సరిపోతాయి గానీ, దానివల్ల శ్రామిక ప్రజలకు కొత్త ప్రయోజనం ఏమీ వుండదు.


అయితే, ధరలు పెరిగే ‘ద్రవ్యోల్బణం’ సమస్యకి పరిష్కారం ఏమిటి? దేశంలో వున్న ‘ఉత్పత్తుల విలువ’కీ, ‘డబ్బు సప్లై’కీ పొంతన కుదరాలి. దాన్ని సాధించాలంటే, ఉత్పత్తి శాఖల మధ్య ఖచ్చితమైన ప్లానింగూ, నల్ల డబ్బూ, దొంగ డబ్బూ లేని నిజమైన డబ్బు లెక్కలూ కావాలి. అంటే, పెట్టుబడిదారీ విధానంలో ఏదైతే అసంభవమో, అదే కావాలన్న మాట! అదే జరగాలన్న మాట!

రంగనాయకమ్మ

Updated Date - 2022-01-21T09:34:08+05:30 IST