ధరల దడ!

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

ధరల దడ!

ధరల దడ!


  • కుతకుతమంటున్న కూరగాయల రేట్లు
  • కిలో టమాట, చిక్కుడు రూ.100
  • వినియోగదారుల బెంబేలు

రంగారెడ్డి అర్బన్‌/పరిగి/తాండూరు, మే22: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రూ.500 పట్టుకొని వెళితే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా వచ్చే కూరగాయలు ధరలు ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగాయి. చిన్న కుటుంబాలు మినహాయిస్తే పెద్ద కుటుంబాలైతే రోజుకు రూ.200 కూరగాయలకే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కూరగాయల ధర ఎప్పుడు ఎంత పెరుగుతుందో తెలియక కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు. వారంలో మూడు రోజులు మాత్రమే కూరగాయలు ఉపయోగిస్తూ మిగతా రోజులు పచ్చడి, చింత పులుసుతో కాలం వెళ్లదీస్తున్నారు. అసలే ఆదాయం లేక సామాన్యులు, మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతుంటే పెరుగుతున్న ధరలు మరింత భయపెడుతున్నాయి. 

రూ.వందకు చేరిన టమాట

ఇంట్లో కూర చేయాలంటే.. టమాట తప్పనిసరి. అలాటి టమాట ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. దాదాపు రెండు నెలల క్రితం కిలో టమాట ధర రూ.10 ఉండగా, ప్రస్తుతం రూ.100కు చేరుకుంది. చిన్న సైజు మచ్చ ఉండి నాణ్యత లేని టమాట కిలో రూ.80కు అమ్ముడు పోతుంది. ఉమ్మడి జిల్లాలోని రంగారెడ్డి,    వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో ఈ రేటు పలుకుతుంది. పరిగి, తాండూరులో శనివారం కిలో టమాట వందరూపాయలు పలికింది. ఇతర కూరగాయల ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు టమాట పంట నష్టపోవడంతో పాటు సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరకు డిమాండ్‌ పెరిగింది. కిలో టమాట కొనాలంటే సామాన్యులు జంకుతున్నారు. టమాటకు బదులుగా ఇతర కూరగాయలు కొంటున్నారు. తప్పనిసరిగా కొనాల్సి వస్తే.. పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. అలాగే చిక్కుడుకాయ సామాన్యుడికి చుక్కలు చూపిస్తుంది. రెండు వారాల క్రితం కిలో చిక్కుడు 80 రూపాయలు ఉంటే ప్రస్తుతం 100 రూపాయలకు చేరుకుంది. అలాగే బీర కాయ రేటు ఎగబాకుతుంది. ఉమ్మడి జిల్లాలో బీర, బీర్నిస్‌ సెంచరికీ చేరువైంది. మార్కెట్‌లో కిలో బీరకాయ, బీర్నిస్‌ 80 రూపాయలు పలుకుతుంది. మిగతా కూరగాయలదీ అదే పరిస్థితి తయారైంది. ఆరు నెలల క్రితం కోయకుండానే కన్నీటిని పెట్టించిన ఉలిగ్లగడ్డ రేటు మాత్రం కాసింత తగ్గి వినియోగదారులకు ఊరటనిచ్చింది.

రకం         ధర కిలో (రూ.)

టమాట 100

చిక్కుడు 100

బీర్నిస్‌ 80

బీరకాయ 80

పచ్చిమిర్చి 60

చామగడ్డ 50

కాకర 40

ధరలు భగ్గుమంటున్నాయి

మార్కెట్‌లో ఏ కూరగాయ ముట్టుకున్నా ధర భగ్గుమంటుంది. రూ. 100 పెట్టుకుని పోతే ఒక రోజుకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. మార్కెట్‌కు వెళ్లి రావడానికి ఆటో కిరాయికే రూ.40 అవుతున్నాయి. వారం రోజులకు సరిపడా కూరగాయలు కొంటే రూ.500 నుంచి రూ.600 వరకు ఖర్చవుతుంది.

                                                  - శారదాబాయ్‌, ఎక్లా్‌సఖాన్‌పేట్‌, కేశంపేట మండలం

కుటుంబ పోషణ భారంగా మారింది

పెరుగుతున్న ధరలతో ఏం కొనాలో ఏం తినాలో తెలియడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో కుటుంబ పోషణ భారంగా మారుతుంది. ఇప్పటికే వంట గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచారు. వంద రూపాయలు తీసుకుని మార్కెట్‌కు వెళితే అన్ని రకాల కూరగయాలు వచ్చేవి. 

                                                         - విజయలక్ష్మి, అజీజ్‌నగర్‌, మొయినాబాద్‌

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST