పెట్రోలు, డీజిల్ ధరలు త్వరలో తగ్గబోతున్నాయా!?

ABN , First Publish Date - 2021-03-23T21:10:32+05:30 IST

ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ

పెట్రోలు, డీజిల్ ధరలు త్వరలో తగ్గబోతున్నాయా!?

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లు కరుణిస్తే పెట్రోలు, డీజిల్ వినియోగదారులపై భారం త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు వారాల నుంచి అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు సుమారు 10 శాతం తగ్గాయి. ఈ మేరకు ప్రజలకు ఉపశమనం కల్పిస్తారేమో చూడాలి.


పెట్రోలు, డీజిల్ ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ ధరలను తగ్గించడానికి ఓఎంసీలకు చాలా అవకాశం ఉంది. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 63.98 డాలర్లకు తగ్గింది. అదేవిధంగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్‌ ధర 60.94 డాలర్లకు తగ్గింది. పెట్రోలియంను ఎగుమతి చేసే దేశాలు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించడంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి ధర పెరగడం మొదలైంది. డిమాండ్ రికవరీ వేగంగా పెరుగుతుందనే ఆశలతోపాటు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ వల్ల కూడా అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. 


అయితే యూరోపు, ఇతర దేశాల్లో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతుండటంతో అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో మళ్ళీ అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని ప్రధాన దేశాలు మళ్ళీ లాక్‌డౌన్ ప్రకటించడంతో అంతర్జాతీయ చమురు ధరలపై మరింత ఒత్తిడి పడుతోంది. 


అంతర్జాతీయ ధరలు తగ్గుతున్నప్పటికీ ఆ మేరకు వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు ఓఎంసీలు ముందుకు వస్తాయా? అనేది అనుమానమే. ఎందుకంటే, కోవిడ్-19 మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నపుడు కూడా అంతర్జాతీయ ధరలు తగ్గాయి. అయినా ఆ మేరకు ప్రజలకు ఉపశమనం కల్పించలేదు. అయితే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం శాసన సభలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ ధరలు కాస్త తగ్గుతాయేమోనని కొందరు ఆశిస్తున్నారు. 


Updated Date - 2021-03-23T21:10:32+05:30 IST