మామి‘డీలా’

ABN , First Publish Date - 2022-05-12T05:12:03+05:30 IST

వేసవిలో వచ్చే మామిడి పండ్లను ఇష్టపడనివారంటూ

మామి‘డీలా’

  • బండెక్కని దిగుబడి.. కొండెక్కిన మామిడి 
  • ధరలతో దడ పుట్టిస్తున్న సీజన్‌ పండు  
  • జిల్లాలో 21,788 ఎకరాల్లో సాగు
  • దిగుబడి 40 శాతం మాత్రమే   
  • అతి వర్షాలే కారణమంటున్న హార్టికల్చర్‌ అధికారులు
  • మార్కెట్‌లో కేజీ మామిడి రూ.150 పైమాటే 
  • రూ. 230 ధర పలుకుతున్న రసాలు 


వేసవిలో వచ్చే మామిడి పండ్లను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. కానీ ఈ ఏడాది మామిడి పండ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు పండ్లను కొనలేకపోతున్నామంటున్నారు. ఈసారి అధిక వర్షాలు కురవడంలో మామిడి పూత నేలరాలి దిగుబడి తగ్గింది. దీంతో మార్కెట్‌లోకి మామిడి పండ్లు రావడం లేదు. వచ్చిన కొద్దిపాటి పండ్లకు ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. 


షాద్‌నగర్‌, మే, 11 : మామిడి సీజన్‌ వచ్చిందంటే చాలు.. టన్నుల కొద్ది కాయలను తోటల నుంచి తెంపడం.. వాటిని బండ్లలో మార్కెట్‌కు తరలించడంలో రైతులు బిజీబిజీగా ఉంటారు. కానీ ఈసారి బండ్ల అవసరం లేకుండా పోయింది. గంపలు నిండటమే కష్టమైంది. ఓవైపు దిగుబడులు లేక రైతులు దిగాలు పడుతున్నారు. మరోవైపు ఎగుమతులు లేక మామిడి ధర కొండెక్కి కూర్చుంది. దడ పుట్టిస్తున్న మామిడి పండ్ల ధరలతో వినియోగదారులు భయపడుతున్నారు. 


భారీగా దిగుమతి 

తెలంగాణ ప్రాంతం మామిడి తోటలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో 30 రకాల మామిడి పండ్ల సాగు జరుగుతుంది. ప్రధానంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల్లో మామిడి తోటలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో సుమారు 20వేల ఎకరాల నుంచి 26వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండటం గమనార్హం. ఈ జిల్లాల్లో ఎక్కువగా కేసరి, దసేరీ, బేనీసా, బంగినపల్లి లాంటి మామిడి పండ్ల సాగు జరుగుతోంది. ఈ జిల్లాల నుంచే కొన్ని దశాబ్దాలుగా కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌ లాంటి రాష్ర్టాలకు ఎగుమతులవుతుంటాయి. మహబూబ్‌నగర్‌ నుంచి ఎక్కువగా బెంగళూర్‌ నగరానికి మామిడి ఎగుమతి జరుగుతుంది. గతేడాది కూడా రాష్ట్రం నుంచే పెద్దఎత్తున మామిడి ఎగుమతులు జరిగాయి. కానీ ఈ ఏడు మాత్రం 5లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నా.. గత ఏడాది కురిసిన అతివర్షాలు, ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి మాసంలో ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానతో కేవలం 1.60 లక్షల ఎకరాల్లోనే మామిడి దిగుబడి వచ్చిందని హార్టికల్చర్‌ అధికారులు తెలిపారు. 


అకాల వర్షంతో మరింత ప్రియం 

రెండు రోజుల క్రితం పలు జిల్లాల్లో భారీ వర్షం కురవటంతో మామిడి కాయలు నేల రాలాయి. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హార్టికల్చర్‌ అధికారులు భావిస్తున్నారు. 20ఏండ్ల క్రితం ఇలాంటి పరిస్థితే వచ్చిందని, అప్పుడు కూడా ఇతర రాష్ర్టాల నుంచి మామిడి పండ్లను దిగుబడి చేసుకున్నారని అధికారులు అంటున్నారు.  


భారీ నష్టాలు 

సాఽధారణంగా రైతులు సాగు చేసిన మామిడి తోటలను డిసెంబర్‌, జనవరిలోనే ఇతరులు లీజుకు తీసుకుంటారు. దిగుబడులను బట్టి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు రైతులకు చెల్లిస్తారు. ఇలా కనీసం ఒక్కొక్కరు వారి స్థాయిని బట్టి ఐదెకరాల నుంచి 25 ఎకరాల వరకు లీజుకు తీసుకుని ఇతర చిల్లర వ్యాపారులకు, పండ్ల మార్కెట్‌కు విక్రయిస్తుంటారు. కానీ ఈ ఏడాది దిగుబడులు లేకపోవడంతో భారీగా నష్టాలను చవి చూడాల్సి వస్తుందని లీజు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


దిగుబడి నేలకు.. 

గత సంవత్సరం అధిక వర్షాలు పడటం, మార్చి నెల వరకు మంచు కురవడంతో మామిడి పూత నేలరాలింది. గతంలో ఫిబ్రవరి నెల నుంచే మామిడి పూత విరగబూసేది. మార్చి రెండో వారం వరకు చెట్లకు అక్కడక్కడా కాయలు కూడా కాసేవి. కానీ ఈ ఏడాది మాత్రం మే నెల వచ్చినా ఆశించిన మేర కాత రాలేదు.  గత నెలలో అకాల వర్షాలు కురవడంతో కాసిన కాత కూడా నేల రాలింది. దీంతో మామిడి దిగుబడి మరింత తగ్గింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 21,788 ఎకరాల్లో వివిధ రకాల మామిడి తోటల సాగు జరుగుతుంది. 20 ఏళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ఈసారి దిగుబడి 40 శాతం కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  


ఆకాశాన్నంటిన ధరలు 

మామిడి దిగుమతుల ప్రభావంతో ఈసారి ధరలు ఆకాశాన్నంటాయి. గతేడాది బేనిసాలు కేజీ రూ. 40 నుంచి రూ.50 వరకు మాత్రమే ఉంది. కానీ ఈసారి మాత్రం తోటల వద్దనే కేజీ బేనిసా రూ. 120 నుంచి రూ. 150కి విక్రయిస్తున్నారు. మేలు రకాలైన బంగినపల్లి, దసేరి, కేసరి లాంటి పండ్లు మాత్రం కేజీ రూ. 200కు విక్రయిస్తున్నారు. చిల్లర వ్యాపారాలు కూడా పూర్తిగా పడిపోవడం, ధరలు విపరీతంగా పెరగడంతోపేద, మధ్య తరగతి కుటుంబాలకు మామిడి పండ్లు అందని ద్రాక్షలా మారాయి. 


అతి వర్షాల వల్ల తగ్గిన దిగుబడి

గత ఏడాది కురిసిన అధిక వర్షాలతోనే ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గింది. 2021లో అక్టోబర్‌, నవంబర్‌ వరకు కూడా వర్షాలు పడటంతో పూత ఆలస్యంగా వచ్చింది. ఈ ఏడాది జనవరిలో పూసిన పూత మగ పుష్పాలే కావడంతో పంట దిగుబడి బాగా తగ్గింది. ఫిబ్రవరి, మార్చి నెలలో ఆడ పుష్పాలు పూసినా అతి వర్షాల వల్ల నిలువలేకపోయింది. దీంతో జిల్లావ్యాప్తంగా మామిడి దిగుబడి గత ఏడాది కన్నా 50 శాతం తగ్గింది. 

 - సునంద, జిల్లా హార్టికల్చర్‌ అధికారి


పెట్టుబడి కూడా రావడం లేదు 

మామిడి దిగుబడి తగ్గడంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఎన్నడూ లేనంతగా ఈసారి మామిడి దిగుబడి భారీగా తగ్గింది. నేను ఆరు ఎకరాల మామిడి తోటను రూ. 3లక్షలకు లీజుకు తీసుకున్నాను. పంట సంరక్షణ కోసం మరో రూ. లక్ష వరకు ఖర్చు చేశా. కానీ ఇప్పటివరకు కనీసం రూ. లక్ష కూడా చేతికి రాలేదు. పెద్ద ఎత్తున పూత రాలిపోవడంతో కాత లేదు. సీజన్‌ ముగిసే వరకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనన్న భయం నెలకొంది. 

- రాజు, పండ్ల వ్యాపారి, చౌదరిగూడ  


దిగుబడి తగ్గింది

ఎన్న్డడూ లేనంతగా ఈ సారి మామిడి దిగుబడి సగానికి పడిపోయింది. తమ 15 ఎకరాల మామిడి తోటను రూ. 10 లక్షలకు లీజుకు ఇచ్చాము. పంట దిగుబడి తగ్గడంతో పెట్టుబడిలో సగం డబ్బులు తిరిగి ఇవ్వాలని వ్యాపారి డిమాండ్‌ చేస్తున్నాడు. వారి బాధను కూడా అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌ చివరి మాసం వరకు వేచి చూడాలని వారికి నచ్చ చెబుతున్నాం. మధ్యలో అకాల వర్షాల వల్ల కూడా కాత నేల రాలడంతో మామిడి పరిస్థితి దయనీయంగా మారింది. 

- గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌..వ్యవసాయదారుడు


సీజన్‌ పండు కొనలేని పరిస్థితి

కనీసం కేజీ మామిడి పండ్లను కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేనంతగా కేజీ రూ. 150 చెబుతున్నారు. మేలురకం పండ్లు రూ. 200 కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో ఈ ఏడాది మామిడి పండ్లు తినలేకపోతున్నాం. ఇంత ధరలు ఎప్పుడూ చూడలేదు.

 - బాలరాజ్‌.. షాద్‌నగర్‌


మధ్య తరగతి కుటుంబాలకు అందని ద్రాక్షే..

ఈసారి మామిడి పండ్లు పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందని ద్రాక్షలా మారాయి. కనీవిని ఎరుగని రీతిలో ధరలు మండిపోతున్నాయి. అరుదుగా దొరికే బేనిసాన్‌ మామిడి కూడా కేజీ రూ. 150కి విక్రయిస్తున్నారు. ఇతరత్రా పండ్లు రూ. 200 కేజీ అమ్ముతున్నారు. మామిడి పండ్ల కోసం వచ్చే వేసవి కాలం వరకు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. 

-  విగ్నేశ్వర్‌రెడ్డి.. నందిగామ 


Read more