మళ్లీ బాదుడు!

ABN , First Publish Date - 2022-01-22T07:23:59+05:30 IST

ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలన్నీ మూసుకుపోవడంతో రాష్ట్ర

మళ్లీ బాదుడు!

  • భూముల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
  • కసరత్తు ప్రారంభించిన రిజిస్ట్రేషన్‌ శాఖ
  • 2, 3 రోజుల్లో జిల్లా అధికారుల నివేదికలు
  • ఆర్నెల్ల క్రితమే భూముల ధరలు 50ు పెంపు
  • మరోసారి భారీగా పెరిగే అవకాశం
  • ప్లాట్లు, అపార్ట్‌మెంట్లపైనా భారం
  • రాష్ట్రం వచ్చిన తొలి ఏడేళ్లూ పెంచని సర్కారు
  • గత ఏడాది పెంచి మళ్లీ ఏడాదిలోపే సిద్ధం



హైదరాబాద్‌/నల్లగొండ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలన్నీ మూసుకుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై దృష్టి సారించింది. రాష్ట్రమంతటా ప్రధాన రహదారుల వెంట ఎకరం కోటి రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో వాటి మార్కెట్‌ ధరలను భారీగా పెంచడం ద్వారా ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ ఆదాయం పెంచుకొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం భూములు, ఇతర ఆస్తుల మార్కెట్‌ ధరలను పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మర్నాడే అంటే, గత బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అందుకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేశారు.


ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తి మార్కెట్‌ విలువలు ఎంత పెంచాలో అంచనా వేసే కసరత్తును స్ట్రాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి భూముల ధరల సవరణ కసరత్తు చేపట్టేవారు. 2013లో చివరిసారి భూముల విలువలను పెంచారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు కేసీఆర్‌ సర్కారు భూముల విలువలను పెంచలేదు. గత ఏడాది జూన్‌లో తొలిసారిగా సవరించింది. రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచినప్పటికీ ఆదాయం ఏమాత్రం తగ్గకపోవడంతో మరోసారి పెంచినా ఇబ్బంది ఉండదనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్నెల్లకే పెంపునకు సిద్ధమైంది. స్టాంఫ్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు మెయిల్‌ పంపి, భూముల ధరలపై నివేదికలను కోరింది. బహిరంగ మార్కెట్‌లో వ్యవసాయ, వ్యసాయేతర భూముల క్రయవిక్రయాలు (లావాదేవీలు) ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 సబ్‌ రిజిస్ట్రార్‌, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మండల రెవెన్యూ కార్యాలయాల నుంచి నివేదికలను తెప్పించుకొంది. ఆయా కార్యాలయాల అధికారులు జిల్లా, మండల కేంద్రాలు, పురపాలికలు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తూ నివేదికలను రూపొందించారు.


ప్రధానంగా రాజధాని (హైదరాబాద్‌) చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌తో వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరానికి కోట్లలో పలుకుతున్నాయి. జిల్లా కేంద్రాలు, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న గ్రామాల పరిధిలో ఎకరం కోటి రూపాయలకు తగ్గకుండా పలుకుతోంది. వీటిని అంచనా వేస్తూ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో అందజేశారు.


ఆర్నెల్ల క్రితమే 50 శాతం పెంచారు

2021 జూలై 22న భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించినపుడు, గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల విలువలను రూ.లక్షా నుంచి రూ.1.5 లక్షలకు, పట్టణ ప్రాంత (మున్సిపాలిటీలు) పరిధిలోని భూములకు రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు పెంచారు. సాధారణ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూమి గజం ధర రూ.1000 నుంచి రూ.1,500 వరకు పెంచారు. జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రధాన రహదారుల వెంట గజం ధర రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు నిర్ణయించారు. వ్యాపార సముదాయాల్లో చదరపు అడుగు కనీస విలువ రూ.2,500గా, గృహ అవసరాలకు కొనుగోలు చేస్తే చదరపు అడుగు కనీస విలువ రూ.1,500గా ప్రభుత్వం ఖరారు చేసింది. వీటి లావాదేవీలపై రిజిస్ట్రేషన్‌ చార్జీల కింద 7.5 శాతం చొప్పునా రుసుము వసులు చేశారు.



గతఏడాదిలో సవరించారు ఇలా

తక్కువ స్థాయి(లోయర్‌ రేంజ్‌) మార్కెట్‌ విలువలున్న ఆస్తులపై 50 శాతం, మధ్యస్తం(మిడ్‌ రేంజ్‌)గా ఉన్న విలువలపై 40 శాతం, ఎక్కువ స్థాయి(హయ్యర్‌ రేంజ్‌)లో ఉన్న విలువలపై 30 శాతం చొప్పున మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పెంచింది. వీటితో పాటు డాకుమెంట్ల రిజిస్ట్రేషన్‌ సందర్భంలో వసూలు చేసే రిజిస్ట్రేషన్‌ చార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలకు సంబంధించి ఎకరానికి కనీస మార్కెట్‌ విలువను రూ.75 వేలుగా ప్రకటించింది. ఇదివరకు ఇది రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండేది.


ప్రస్తుతం ఎకరానికి తక్కువ స్థాయి(లోయర్‌ రేంజ్‌)లో ఉన్న మార్కెట్‌ విలువలపై 50 శాతాన్ని పెంచింది. అదే మధ్య స్థాయి(మిడ్‌ రేంజ్‌)లో ఉన్న విలువపై 40 శాతం, అత్యధికం(హయ్యర్‌)గా ఉన్న విలువపై 30 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు దరిదాపుల్లోని వ్యవసాయ భూములపై 30 శాతం మేర, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ భూములపై 50 శాతం మేర, ఓ మోస్తరు పట్టణాలకు దగ్గరగా ఉండే భూములపై 40 శాతం మేర విలువలు పెరిగాయి. 


వ్యవసాయేతర ఆస్తులపై... 

వ్యవసాయేతర ఆస్తుల కిందకు వచ్చే ఓపెన్‌ ప్లాట్ల మార్కెట్‌ విలువలను మూడు కేటగిరీలుగా, అపార్ట్‌మెంట్లు, వాటిలోని ఫ్లాట్ల మార్కెట్‌ విలువలను రెండు కేటగిరీలుగా పెంచింది. ఓపెన్‌ ప్లాట్ల గజం(స్క్వేర్‌ యార్డ్‌) కనీస విలువ ఇదివరకు రూ.100గా ఉండేది. ఇప్పుడు దీనిని పెంచి రూ.200లుగా నిర్ధారించింది. ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి లోయర్‌ రేంజ్‌పై 50ు, మిడ్‌ రేంజ్‌పై 40ు, హయ్యర్‌ రేంజ్‌పై 30ు చొప్పున విలువలను పెంచింది. జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతంలో రిజిస్ర్టేషన్‌ విలువ 45 వేల రూపాయల నుంచి 58 వేలకు పెరిగింది. అపార్ట్‌మెంట్లు, వాటిలోని ఫ్లాట్ల కనీస మార్కెట్‌ విలువను చదరపు అడుగు(స్క్వేర్‌ ఫీట్‌)కు రూ.800 నుంచి రూ.1000కి పెంచింది. లోయర్‌ రేంజ్‌పై 20 శాతం, హయ్యర్‌ రేంజ్‌పై 30 శాతం మేర మార్కెట్‌ విలువలను పెంచింది.


మార్కెట్‌ విలువలు నిర్ణయించే కమిటీలు

భూముల విలువలను ఖరారు చేసే రాష్ట్ర స్థాయి కమిటీ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆధ్వర్యంలో పని చేస్తుంది. పట్టణాల్లో జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో, గ్రామీణ ప్రాంతాల కమిటీ ఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పడతాయి. కంటోన్మెంట్‌ ఏరియాకు కూడా కమిటీలు ఉంటాయి. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, ఈసారి ఎంత పెంచాలనేది ఈ కమిటీలు నిర్ణయుస్తాయి.


2, 3 రోజుల్లో నివేదిక

ప్రభుత్వం నిర్దేశించిన రిజిస్ట్రేషన్‌ ధరలతో పోల్చి బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించి సమగ్ర సమాచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల ధరలను 19న రాష్ట్ర కార్యాలయానికి పంపారు. బహిరంగ మార్కెట్‌లో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఏవిధంగా ఉన్నాయో నివేదిక రూపొందించే పనిలో సబ్‌రిజిస్ర్టార్లు, తహసీల్దార్లు నిమగ్నమయ్యారు.


ప్రాథమిక సమాచారం మేరకు వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలను 50 శాతం, ఖాళీ స్థలాల విలువలను 35 శాతం, అపార్ట్‌మెంట్ల విలువలను 25 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. పెంపుపై ఈ నెల 20న రిజిస్ట్రేషన్‌ శాఖ కీలకమైన సమావేశాన్ని నిర్వహించి జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారులకు దిశానిర్ధేశం చేసింది. ఆ సమావేశంలో మార్కెట్‌ విలువను ఏ మేరకు సవరించాలనే విషయంపై ప్రాథమిక కసరత్తు నిర్వహించారు. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఒక నివేదిక ఇవ్వనున్నారు. దీనిపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. జిల్లా అధికారులు మాత్రం ఫిబ్రవరి మొదటి వారం నుంచి లేదా మార్చి నెలలో అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 


Updated Date - 2022-01-22T07:23:59+05:30 IST